అమరావతి (చైతన్యరథం): విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఇకపై కళాశాల యాజమాన్యాల ఖాతాలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు చేస్తామని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుపై శాసనమండలిలు శుక్రవారం సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమచేసే విధానం తెచ్చి ఫీజులు చెల్లించకుండా ఎగ్గొట్టిందని ఆరోపించారు. తల్లి ఖాతాలో, ఆ తర్వాత తల్లి- విద్యార్థి జాయింట్ ఖాతాలో నగదు జమ చేయడం వల్ల విద్యార్థులు పలు అవస్థలు పడ్డారని చెప్పారు. ఇకపై ఈ విధానానికి స్వస్తి పలికి గతంలో మాదిరిగా… విడతల వారీగా విద్యార్థుల ఫీజుల బకాయిలు కళాశాలలకు చెల్లిస్తామన్నారు. పీజీ చదివే విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. గత ప్రభుత్వం మెస్ ఛార్జీలు, ట్యూషన్ ఫీజులు సగం కూడా చెల్లించలేదన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.