అమరావతి(చైతన్యరథం): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు వాగుదాటుతూ మృతి చెందడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అదే విధంగా ఆ రెండు కుటుంబాల్లో కుటుంబం నుంచి ఒకరు చొప్పున ఇద్దరికి ఉద్యోగం ఇస్తామని మంత్రి సంధ్యారాణి చెప్పారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ఆమె పాత్రి కయులతో మాట్లాడుతూ మూడు రోజుల క్రితం సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన మహేష్ (29), కీర్తి (26) అనే ఉపాధ్యాయులు వాగు దాటుతూ దురదృష్టవశాత్తూ మృతి చెందారన్నారు. సోమవారం వారి మృతదేహాలు దొరికాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయా మృతదేహాలను విమానంలో తీసుకువెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. కేంద్ర సాయంగా రూ.10 లక్షలు, రాష్ట్ర సాయంగా రూ.5 లక్షలు మొత్తం రూ.15 లక్షలను ఒక్కొక్క కుటుంబానికి అందజేస్తామన్నారు. అదే విధంగా ఆయా కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగం కూడా ఇవ్వడంతో పాటు, అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆమె తెలిపారు.
గుర్తింపులేని పాఠశాలలు, వసతి గృహాలు నడిపేవారిపై కఠిన చర్యలు
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని ప్రైవేటు వసతి గృహంలో ముగ్గురు చిన్నారులు కలుషిత ఆహారం తిని మృతిచెందిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఆ ప్రైవేటు వసతి గృహంలో ఉన్న విద్యార్థులు అందరినీ దగ్గర్లోని ప్రభుత్వ వసతి గృహం లో చేర్పించి చదువుకునే అవకాశాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులేని పాఠశాలలు, వసతి గృహాలు ఉంటే వెంటనే వాటిని గుర్తించి, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆమె తెలిపారు. వారి ఆదేశాల మేరకు అన్నిజిల్లాల కలెక్టర్లు ఐటీడీఏ పీఓలు, తహసీల్దార్లు, ఎంఈఓలు, డీఈఓలనుకు తగు ఆదేశాలు జారీ చేశామని మంత్రి సంధ్యారాణి తెలిపారు.