- సంక్షేమ పథకాల రూపకల్పనకు ఆదేశాలు..
- కడప హజ్‌హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తికి ఆదేశం
- నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం
- ఇమామ్, మౌజన్లకు త్వరలో గౌరవ వేతనాలు
- మైనారిటీలకు లబ్ది చేకూరేలా వక్ఫ్ భూముల అభివృద్ధి
- మైనారిటీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్య రథం): ముస్లిం మైనారిటీ వర్గాలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలను మరింత మేలు జరిగేలా.. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా రూపకల్పన సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీల నేపథ్యంలో…. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా పథకాల రూపకల్పన సాగాలని సీఎం ఆదేశించారు. మైనారిటీ సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద మంజూరైన రూ.447 కోట్లకు సంబంధించి పెండిరగులోవున్న పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరై కొంతమేర నిర్మాణాలు జరిగిన షాదీఖానాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చెయ్యాలన్నారు. ప్రారంభంకాని పనులను రద్దుచేసి పునఃసమీక్షించాలని సూచించారు. కడపలో హజ్‌హౌస్‌కు నాడు తెలుగుదేశం ప్రభుత్వం రూ.24 కోట్లు మంజూరు చేసి 80 శాతంమేర నిర్మాణం పూర్తి చేసిందని అధికారులు తెలిపారు.
ఆ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. మైనారిటీ విభాగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు శిక్షణ సంస్థలు ఏపీలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. గుంటూరు క్రిస్టియన్ భవన్‌కు నాడు తెలుగుదేశం ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేస్తే, 50 శాతం పనులు పూర్తైనట్టు అధికారులు వివరించగా.. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వక్ఫ్ బోర్డు భూముల సర్వే రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వక్ఫ్‌బోర్డ్ భూముల అభివృద్ధికి అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం అంగీకారం తెలిపారు. వక్ఫ్ బోర్డు భూములను అభివృద్ది చేయాలని… అందులో ఆ వర్గానికి చెందిన వారే భాగస్వాములుగా ఉండేలా చూడాలన్నారు. వక్ఫ్ బోర్డుకు ఆదాయం తీసుకురావడంతో పాటు…. భూముల అభివృద్ధి ఫలాలు ఆ వర్గాలకే అందేలా చూడాలన్నారు.
అదేవిధంగా నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం అంగీకరించారు. మత కార్యక్రమాల్లో ప్రభుత్వ శాఖలు అనవసర జోక్యం చేసుకోవద్దని… వారి గౌరవాలకు భంగం కలగకుండా ప్రభుత్వ శాఖలు పనిచేయాలని సీఎం సూచించారు. ఇమామ్, మౌజన్లకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు, రూ.5 వేలు ఇస్తామన్న హామీని త్వరలో అమల్లోకి తేవాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. అర్హతవున్న ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించాలని సీఎం తెలిపారు. మసీదుల నిర్వహణకు రూ.5 వేలు ఆర్థిక సాయం, హజ్‌యాత్రకు వెళ్లే వారికి రూ.లక్ష సాయం ఇచ్చే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాలని సీఎం ఆదేశించారు. మైనారిటీలకు స్మశాన వాటికల స్థలం కేటాయింపు కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రక్రియ మొదలు పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ ఎండి ఫరూక్, అధికారులు పాల్గొన్నారు.