- ‘సీఈఓ సీఎం’ టూ ‘వాటర్‌మ్యాన’ చంద్రబాబు..చెరగని ముద్ర
- తొలి నుంచీ నీటిపొదుపు, ప్రతి బొట్టును ఒడిసిపట్టడంపైనే దృష్టి
- భూగర్భాన్నే జలాశయంగా మార్చే సంకల్పం
- డ్రిప్ ఇరిగేషన్‌కు ఆద్యుడు
- సాగునీటి ప్రాజెక్ట్‌ల పూర్తిపై ప్రత్యేక శ్రద్ధ
- ఆయన కృషితో రాయలసీమ పొలాýకు కృష్జాజలాలు
- పట్టిసీమతో కృష్ణా డెల్టాకు గోదావరి నీరు
- నదుల అనుసంధానానికి నాంది
- ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకూ ప్రధాన్యత
- వాటర్‌మ్యాన్‌గా సీఎం చంద్రబాబును ప్రశంసిస్తూ జాతీయ మీడియా కథనం
- టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌లో అభినందన తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి నిమ్మల
- స్టాండింగ్ ఓవేషన్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు అభినందనలు
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా తనను తాను మార్చుకునే గొప్ప దార్శనిక నేత చంద్రబాబు నాయుడు అని జాతీయ మీడియా సైతం గుర్తించడం మన అందరితోపాటు, రాష్ట్ర ప్రజలకు కూడా గర్వకారణమని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి అవసరాలకు అనుగుణంగా సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చారని, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కు జల వనరులను అభివృద్ధి చేస్తూ వాటర్ మ్యాన్‌గా మారిన వైనాన్ని జాతీయ మీడియా ప్రస్తావించి ప్రశంసించడం గొప్ప విషయమని రామానాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మొదలైన టీడీపీ ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కాంక్లేవ్‌లో ఎకనామిక్ టైమ్స్ పత్రిక రాసిన సీఈఓ సీఎం టూ వాటర్ మాన్ ఆర్టికల్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందన తీర్మానాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రవేశపెట్టారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ విప్లవాన్ని యువతకు అందించి తెలుగు వారికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు ఆ తర్వాత సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తూ వాటర్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నారని తీర్మానంలో మంత్రి పేర్కొన్నారు. 3 దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు కలను సాకారం చేయటంలో సీఎం చేసిన కృషిని ఎకనామిక్ టైమ్స్ ప్రస్తుతించింది. ఉత్తరాంధ్రకు నీరు ఇచ్చేలా పోలవరం ఎడమ కాలువను ఎడాదిన్నర కాలంలోనే పూర్తి చేసి గోదావరి జలాలను అనకాపల్లి వరకూ తీసుకెళ్లటంలో చేసిన కృషిని ప్రస్తావించింది. 2027 పుష్కరాలకంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారన్న లక్ష్యాన్ని కూడా కథనంలో పేర్కొందన్నారు.
ఏపీకి ఏమి కావాలో చంద్రబాబుకు బాగా తెలుసు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవసరాలు, బాగోగులు చంద్రబాబుకు మాత్రమే తెలుసు..రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయనకున్న అవగాహన మరెవ్వరికీ లేదు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన రామానాయుడు, రాష్ట్రంలో జల వనరుల అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని సమగ్రంగా వివరించారు. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్ర భాగంలో నిలపాలని నిరంతరం కలలు గంటున్న గొప్ప స్వాప్నికుడు మన ముఖ్యమంత్రి అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు జల వనరుల శాఖలో సాధించిన ప్రగతిని, స్థాపించిన మైలురాళ్లను.. దృష్టిలో ఉంచుకొని ఆయనను వాటర్ మ్యాన్ గా కీర్తించడం.. మనకు ఎంతో గర్వకారణం అన్నారు. తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఆదాయంలో 62 శాతం హైదరాబాద్‌దే అంటే ఆ క్రెడిట్ మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. అలాగే ఈనాడు నవ్యాంధ్ర.. అభివృద్ధికి.. నడుం కట్టిన మహానీయుడుఅని అన్నారు..
డ్రిప్ ఇరిగేషన్‌కు ఆద్యుడు
విభజిత ఆంధ్రప్రదేశ్ పునః నిర్మాణం లో భాగంగా చంద్రబాబు వాటర్ మ్యాన్‌గా మారటం అక్షర సత్యం అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందే 90వ దశంలో వ్యవసాయ ప్రాధాన్యాన్ని, నీటి పొదుపు ఆవశ్యకతను గుర్తించి కుప్పం నియోజకవర్గంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు.. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించారు.. ఇజ్రాయిల్ తరహా వ్యవసాయ విధానంతో 30 నుంచి 50 శాతం అధికంగా పంట దిగుబడి సాధించి తన ప్రత్యేకతను చాటారని గుర్తు చేశారు. కాల క్రమంలో రాష్ట్రంలోని మెట్ట ప్రాంత భూములన్నిటికీ డ్రిప్ ఇరిగేషన్ ని అలవాటు చేసి.. నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజెప్పారన్నారు.
బీడు భూములకు జలసిరులు
1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలను, వెనుకబాటుతనాన్ని గుర్తించారు. గోదావరి కృష్ణా డెల్టాల పరివాహక ప్రాంతాల ప్రజలు ఆర్థికంగా ముందుండటానికి, రాయలసీమ, ఉత్తరాంధ్రాలు వెనుకబాటుతనానికి కేవలం నీటి వనరులు లేకపోవడమేనని ఆయన గుర్తించారని మంత్రి కీర్తించారు. అందులో భాగంగానే.. పనికిరాని పర్రలుగా ఉన్న మెట్ట భూములు.. సిరులు పండాలంటే భూగర్భ జలాలు వెలికితీత ఒకటే మార్గమని యోచించి బోరు బావులకు సబ్సిడీ కరెంట్ ఇవ్వటం ప్రారంభించారని చెప్పారు. తరువాత కాలంలో దానిని ఉచితం చేశారన్నారు. దీంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.. మెట్ట ప్రాంతాల్లో కూడా సిరులు పండించటం ప్రారంభించారని అని చెప్పారు. ఆనాడే.. చంద్రన్న.. భూగర్భ జలాలు.. వెలికి తీసి అపర భగీరథుడయ్యారన్నారు. అలాగే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయిన తరువాత..
వ్యవసాయానికి ప్రాణాధారమైన.. జల వనరులపై దృష్టి పెట్టారన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ కె.ఎల్.రావు ప్రతిపాదించిన నదుల అనుసంధానం పై దృష్టి పెట్టిన భారతదేశంలోని ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టును.. ఒడిసి పట్టాలి.. నిల్వ చేయాలి.. అధికంగా ఉన్న చోట నుంచి అవసరం ఉన్న చోటకి జలాన్ని తరలించాలి. తద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలి.. సిరులు పండించాలి.. సంపద సృష్టించాలి.. కరవురహిత రాష్ట్రంగా మార్చాలి. ఇదే నా జీవితాశయం.. అంటూ బహిరంగంగా ప్రకటించిన ఏకైక నేత చంద్రబాబు అని రామానాయుడు ప్రశంసించారు. ఈ రకంగా.. ఆనాడే ఆయన.. వాటర్ మ్యాన్ గా రూపాంతరం చెందారన్నారు.
మొత్తం సాగుభూములకు నీరివ్వటమే లక్ష్యం
ఆంధ్రుల మదిలో అపర భగీరధుడిగా, ప్రత్యేకించి రాయలసీమలో.. కృష్ణదేవరాయలను గుర్తుకు తెచ్చారన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో నాలుగు కోట్ల ఎకరాల భూమి ఉంది. అందులో సాగుకు పనికి వచ్చేది రెండు కోట్ల ఎకరాలు మాత్రమే.ఈ రెండు కోట్ల ఎకరాలలో.. ప్రస్తుతం సాగయ్యేది. ఒక కోటి లక్ష ఎకరాలు మాత్రమే. మిగిలిన 99 లక్షల ఎకరాలకు కూడా.. అందుబాటులో ఉన్న అన్ని జలవనరులను ఉపయోగించి నీరు ఇవ్వాలనేదే.. చంద్రన్న ఆశయంగా రామానాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఈ ఆశయంలో భాగంగానే 2014 -19 మధ్యకాలంలో రాష్ట్రంలోని అనేక నీటిపారుదల ప్రాజెక్టుల పనులు పట్టాలెక్కించారు. రాష్ట్రానికి జీవనాడి.. అయిన ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తి చేశారు. రాయలసీమలోని పలు ప్రాజెక్టులకు రూ.12,500 కోట్లు వెచ్చించారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు కూడా ఒక రూపు తీసుకొచ్చారని చెప్పారు. అన్నింటికంటే మించి.. పోలవరం పూర్తి అయ్యేవరకు.. ఆగకుండా గోదారి వరద జలాలను పట్టిసీమ, పుష్కరా ఎత్తిపోతల ద్వారా అటు తడారిన కృష్ణ డెల్టాకు, ఇటు ఉత్తరాంధ్రకు.. నీరు ఇవ్వాలని.. ఆ రెండు కార్యక్రమాలను.. రికార్డ్ స్థాయి సమయంలో పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు దే అన్నారు. గోదారిని.. కృష్ణమ్మతో అనుసంధానించి.. దేశంలో మొట్టమొదటిసారిగా.. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారన్నారు.
ఐదేళ్లపాటు వైసీపీ గ్రహణం
ఈ దశలో ప్రభుత్వం మారి గొడ్డలి పార్టీ రావడం వల్ల.. నీటిపారుదల రంగానికి గ్రహణం పట్టిందన్నారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయాయి.. రివర్స్ పాలన అంటూ.. ప్రాజెక్టుల నిర్మాణాలు శిథిల స్థితికి చేరేటట్టు చేసేశాడని . ఘోరమైన విధ్వంసం జరిగిపోయిందన్నారు. 18 వేల కోట్లు అప్పు వారసత్వంగా ఇచ్చి అదోస్థితికి చేర్చాడని విమర్శించారు. ఐదేళ్లపాటు అమూల్యమైన సమయం.. కాలగర్భంలో కలిసిపోయిందన్నారు.
ప్రాజెక్టుల పూర్తికి టైం షెడ్యూల్
ఈ నేపథ్యంలో 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రన్న నేతృత్వంలోని.. కూటమి ప్రభుత్వం.. మళ్లీ జలసిరిపై దృష్టి పెట్టింది. ఇరిగేషన్ క్యాలెండర్ తయారు చేసింది.. ప్రతి ప్రాజెక్టు పూర్తికి టైం షెడ్యూల్ నిర్ణయించిందన్నారు. రేయింబవళ్లు పనిచేస్తూ.. ముందుగా.. రాయలసీమ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది.. ఈ రెండేళ్లలో రూ.30 వేల కోట్లు ఇరిగేషన్ బడ్జెట్ కేటాయింపులు ఉంటే సగానికి సగం రాయలసీమ ప్రాజెక్టులకు వెచ్చించిందన్నారు . అందులో భాగంగానే హంద్రీనీవా సుజల స్రవంతి.. పూర్తి చేసి 700 కిలోమీటర్లు దూరాన ఉన్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ జలాలను తరలించారన్నారు . అలాగే మూడు దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టు కలను గత ఆగస్టు 31న సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు దక్కించుకున్నారన్నారు. అలాగే ఈనెల 2న పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి వరకు పంపటం.. ఉత్తరాంధ్ర చరిత్రలో మరో సువర్ణాధ్యాయమన్నారు.
అన్నింటికంటే మించి..
ఈ రాష్ట్ర దశదిశ మార్చే పోలవరం జాతీయ ప్రాజెక్టు 2027 మార్చికి అంటే వచ్చే ఏడాది పుష్కరాలకు ముందే ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించటం.. ఆయన సమర్థ నాయకత్వానికి, సత్తాకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్య క్రమంలో 36 ప్రాజెక్టులను.. ఎంపిక చేసాం.. రానున్న రెండేళ్లలో అంటే 2028 నాటికి పూర్తిచేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఇందుకోసం రూ.36,555 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారని ఈ కారణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వాటర్ మ్యాన్ అని అనడం సమంజసమేనన్నారు.
జలాశయంగా భూగర్భం
అలాగే భూగర్భాన్ని జలాశయంగా మార్చే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ ఫలించి 2014 -19 మధ్యకాలంలో గ్రౌండ్ వాటర్ లెవల్ 2- 2.5 మీటర్లు పెరిగిందన్నారు. నీరు చెట్టు పథకం కింద 38,500 చెరువులు లోతు తవ్వడం, గట్లు పట్టిష్టపరచటం చేయడం ద్వారా చెరువులు జలకళను సంతరించుకున్నాయన్నారు. ఈ ఘనత అంతా ముఖ్యమంత్రి చంద్రన్నదే అని చెప్పారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభించిన జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా 90 వేల పనులు పూర్తి చేశాం.. 80 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచగలిగాం అని రామానాయుడు చెప్పారు. ఇలా అందుబాటులో ఉన్న నీటి వనరులు అన్నిటిని అందిపుచ్చుకుని ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలనే విశ్వ ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ అవసరాలు కనుగుణంగా వాటర్ మ్యాన్‌గా అవతారం దాల్చారని మంత్రి పేర్కొన్నారు. ఈ కారణాలన్నిటి కారణంగానే ప్రతిష్టాత్మక ఎకనమిక్ టైమ్స్ పత్రిక చంద్రబాబు నాయుడిని వాటర్ మ్యాన్ గా అభివర్ణించటం తెలుగు వారందరికీ గర్వకారణం అన్నారు.
ఈ తీర్మానంపై ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు అభినందనలు తెలిపారు.














