- దోపిడీదారులు, కబ్జాకోరుల ముఠా నాయకుడు జగన్‌రెడ్డి
- ప్రజల భూములపై హక్కుల్ని నియంతలా కాలరాస్తున్న జగన్
- అసురగణాలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి
- ఫ్యాన్ రెక్కలు విరిచేసి.. ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో పడేయాలి
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూముల్నీ కబ్జా చేసే కుట్ర
- నూజివీడును అభివృద్ధి పథంలో నడిపిస్తా: చంద్రబాబు
- కిక్కిరిసిన ప్రజాగళం సభలో హామీలు.. వరాలు
నూజివీడు (చైతన్యరథం): ఐదేళ్ల అరాచకనికి మరో పది రోజుల్లో ఫుల్‌స్టాప్ పెడదామని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డి అరాచకాన్ని, అహంకారాన్ని అణచివేసేందుకు సిద్ధమా? అని ప్రజలను ప్రశ్నించారు. నూజివీడు ప్రజాగళం ఊపు చూస్తుంటే, కూటమి గెలుపు కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. ఐదేళ్లలో ఎక్కడా అభివృద్ధి జరగలేదు. ఉద్యోగాలు రాలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కలేదు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించలేదు. జగన్‌రెడ్డి మాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు గడప దాటవు. రాష్ట్రంలోని ప్రజల సంపదంతా అతని దగ్గరే ఉండాలనే నియంత జగన్‌రెడ్డి. అతను వేసే చిల్లరతో ప్రజలు బతకాలని అనుకుంటున్నాడు. 13న ఫ్యాన్‌ని విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాలి. రాతియుగం పోయి, స్వర్ణయుగం రావాలంటే కూటమి అధికారంలోకి రావాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా శనివారం నూజివీడులో పెద్దఎత్తున నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట జగన్ సర్కారు తెచ్చిన కొత్త చట్టం, ప్రజల ఆస్తుల దోచుకోవడానికే అన్నారు. ప్రజల భూములపై ప్రజలకు ఎలాంటి అధికారం లేకుండా `పెత్తనమంతా టీఆర్వోల చేతుల్లో పెట్టారని, ఆ టీఆర్వోలు జగన్ వందిమాగధులైతే.. ఇక భూములకు నీళ్లు వదులుకోవాల్సిందేనన్నారు. ఒరిజినల్ పత్రాలు వాళ్ల ఆధీనంలో పెట్టుకుని జిరాక్స్‌లు ఇవ్వడం, అమెరికాలోని క్రిటికల్ రివర్ టెక్నాలజీ అనే బినామీ కంపెనీకి ఆన్‌లైన్ నిర్వహణ గుత్తాధిపత్యం ఇవ్వడం, వివాదాలేవీ సివల్ కోర్టుల్లో చెల్లవన్న నిబంధనలు పెట్టడం.. ఒక్కటికాదు, మీ భూములపై ఇక జగన్‌దే పెత్తనం అని చంద్రబాబు వివరించారు. జగన్ కుటిల ఆలోచనను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రజలు హాలో ఏపీ.. బై బై జగన్ అంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘నూజివీడు సాక్షిగా చెబుతున్నా. అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతాను. మలి సంతకం జగన్‌రెడ్డి తెచ్చిన నల్ల చట్టం రద్దుపైనే అని చంద్రబాబు స్పష్టం చేశారు.
మళ్లీ.. అమరావతికి పూర్వవైభవం
అమరావతిని దేశంలోనే అగ్రస్థాయి రాజధానిగా నిర్మించాలన్న మన కలను, రాజధానిపై మూడు ముక్కలాటతో నాశనం చేశాడు జగన్‌రెడ్డి. అమరావతి పూర్తైవుంటే.. ఔటర్ రింగు రోడ్డు నూజివీడు అభివృద్ధికి అవకాశం ఉండేది. నేను అధికారంలోకి రాగానే.. అమరావతికి పూర్వ వైభవం తెస్తా. అతనికి విధ్వంసం తెలుసు. నాకు అభివృద్ధి తెలుసు. కూటమి అధికారంలోకి రాగానే రాజధాని అమరావతికి పూర్వవైభవం తెచ్చే ప్రణాళికలు మొదలు పెట్టుకుందామని చంద్రబాబు స్పష్టం చేశారు.
క్లాస్ వార్ పేరిట కొత్త మోసం
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్‌రెడ్డి.. పేదలు పెత్తందారులు అంటూ ప్రజలను బురిడీకొట్టించే కుట్రలు పన్నుతున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల ఆస్తులు కొల్లగొట్టి తాడేపల్లి కొంపకు తరలించుకున్నాడు. జగన్‌రెడ్డికి ప్యాలెస్‌లు కావాలి. పేదలకు మాత్రం.. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లా? ఇదేమైనా జగన్‌రెడ్డి జాగీరా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వేల కోట్ల ఆస్తులు, పదుల కొద్దీ ప్యాలెస్‌లు కట్టుకున్న జగన్ రెడ్డి పేదవాడెలా అవుతాడని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో చెప్పినట్టు ఆదాయం సృష్టించి అందరికీ పంచుతానని, పేదల జీవితాలు మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, ఉచిత ప్రయాణ సౌకర్యం, సున్నా వడ్డీ రుణాలు, నిరుద్యోగ భృతి, అన్నదాత ఇలా.. సూపర్ సిక్స్ పథకాల అమలుతో ప్రజల జీవితాల్లో వెలుగులు పూస్తాయని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘మన మేనిఫెస్టో చూసి భయపడి ఏం చేస్తున్నాడో అర్ధం కావడం లేదు. అందుకే నేనొస్తే పథకాలు తీసేస్తానంటూ డ్రామాలాడుతున్నాడు. జగన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలిచ్చాను. ఇకపై ఇస్తాను కూడా. పేదరికం లేని రాష్ట్రాన్ని సృష్టించి తీరుతాను’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
నూజివీడు అభివృద్ధి నాది పూచీ
‘నూజివీడులో పనికిమాలిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మూడుసార్లు గెలిచినా.. నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడ్డాడు. జగన్‌రెడ్డికి, ఈ ఎమ్మెల్యేకి వడ్డీతో సహా చెల్లించి తీరుతాను’ అని చంద్రబాబు హెచ్చరించారు. నూజివీడును అభివృద్ధి పథాన తీసుకెళ్లేందుకు అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తానని, నాగార్జున సాగర్ ఎడమకాలువ నుండి నూజివీడుకు నీరిచ్చే బాధ్యత తీసుకుంటానని, నూజివీడు ట్రాఫిక్ సమస్యకు ఏకైక పరిష్కారం ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నూజివీడులో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తా. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలివ్వడమే లక్ష్యంగా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చాను. బడుగుబలహీన వర్గాలకు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాలిస్తా. టిడ్కో ఇళ్లు ఉచితంగా అందించి అండగా నిలుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
నూజివీడును కృష్ణా జిల్లాలో కలపాలని కోరుతున్నారు. వారి కల నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు వరాలు కురిపించారు. ఎమ్మెల్యేగా పార్ధసారధి, ఎంపీగా మహేశ్‌యాదవ్‌ను గెలిపించుకోవాలన్నారు. నిన్నటి వరకు ఇంఛార్జిగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావును రాజకీయంగా ఆదుకునే బాధ్యత తనదన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే.. ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలని అంటూ, ఇక్కడి ఆడబిడ్డల ఉత్సాహం చూస్తుంటే కూటమి గెలుపు ఎలా ఉండబోతుందో కళ్లకు కనిపిస్తోందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.