అమరావతి: సమస్యలు పరిష్కరించాలంటూ గత కొన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. వారితో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా…విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగటం సరైన పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు కోటి సంతకాలతో వినతి పత్రం ఇచ్చేందుకు ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపడితే అర్ధరాత్రి వేళ పోలీసులు వారిని ఈడ్చి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘‘అంగన్వాడీ సిబ్బందిని అరెస్టు చేయడం వారి కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో వారిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిపైనా పోలీసు లు దురుసుగా ప్రవర్తించారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమ యంలో పాదయాత్ర చేస్తూ పొరుగు రాష్ట్రాలకంటే ఎక్కువ జీతం ఇస్తాను అని హామీ ఇచ్చారు. దాన్నే అమలు చేయాలని కోరుతున్నారు. చిన్నపాటి జీతాలతో పని చేస్తున్న వారిపట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించాలి’’ అని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.