- భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ రాకూడదు
- గత పొరపాట్లు పునరావృతం కావొద్దు
- ఉత్సవాల నిర్వహణపై రెండురోజుల్లో కార్యాచరణ ప్రణాళిక
- దుర్గగుడి అధికారులకు మంత్రి ఆనం ఆదేశం
విజయవాడ(చైతన్యరథం): ఇంద్రకీలాద్రిపై వున్న దుర్గమల్లేశ్వర స్వామివార్ల దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులను దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం నాడు కనకదుర్గ ఆలయాన్ని సందర్శించిన మంత్రి కొండపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించారు. నిర్మాణం పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. అమ్మ వారి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏర్పాట్ల విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని అధికారులను మంత్రి హెచ్చరించారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కొండ పై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను త్వరిత్తగతిన పూర్తి చేయాలని మంత్రి ఆనం ఆదేశించారు. దసరా ఉత్సవాల నిర్వాహణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రెండు రోజుల్లో రూపొందించుకుని రావాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఈ సారి అమ్మవారి ఉత్సవాలను గతంలోకన్నా మిన్నగా నిర్వహించడం ద్వారా భక్తుల మనసు గెలుచుకోవాలని మంత్రి సూచించారు. భక్తులకు ఏ మాత్రం అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖా కమిషనర్ ఎస్. సత్యనారాయణ, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామారావు, దేవస్థానం ఇంజనీరింగ్ విభాగానికి చెందిన చీఫ్ ఇంజనీర్లు, టెక్నికల్ అడ్వైజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.