- పీఎం సూర్యఘర్తో మగ్గాలున్న వారికి ఉచిత విద్యుత్
- త్వరలోనే నూతన టెక్స్టైల్స్ పాలసీ..
- మంచి మార్కెట్ కోసం.. రిటైల్ చైన్లతో జతకట్టండి
- త్వరలోనే ఆరోగ్య బీమా సైతం అమలు చేస్తాం..
- చేనేత, హస్తకళలపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): చేనేత, హస్తకళల రంగంలో ఉన్నవారి అభివృద్ధికి వినూత్న విధానాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మారుతున్న కాలానికి అనుగణంగా ఉత్పత్తుల తయారీలో మార్పులు చేపట్టి చేనేత, హస్త కళాకారుల ఆదాయం పెంచే మార్గాలు అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దాదాపు రెండేళ్లపాటు చేనేత, జౌళి, హస్తకళలపై కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ శాఖలో పరిస్థితులు, స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమగ్ర సమీక్ష చేశారు. 35 చేనేత, 36 హస్తకళల క్లస్టర్ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఉత్పత్తుల ఆధునీకరణ, టెక్నాలజీ వాడకం, మార్కెట్ సౌకర్యం కల్పించడం ద్వారా చేనేత, హస్తకళాకారుల ఉత్పత్తులకు డిమాండ్ పెంచవచ్చని… తద్వారా ఆయా వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని సీఎం అన్నారు.
త్వరలో కొత్త టెక్స్టైల్ పాలసీ తెస్తామని సీఎం ప్రకటించారు. నిపుణులు, కన్సల్టెన్సీ ద్వారా చేనేత, హస్తకళలలో ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్నారు. చేనేత ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెట్ చేయడానికి ఈ-కామర్స్, రిటైల్ చైన్లతో జతకట్టాలని సూచించారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీని రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. పీఎం సూర్యఘర్ పథకం అమలు చేసి చేనేత మగ్గాలున్నవారికి 200 యూనిట్లు, మరమగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా ఇప్పటికే ప్రకటించినట్లు నేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకం త్వరలో అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడిరచారు.