- నెల్లూరు నయీంగా నల్లపురెడ్డి
- ఇదీ వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న అవినీతి పద్దు
- చదివింది డిగ్రీ.. దోపిడీలో డాక్టరేట్
- సొంత జాగీరుగా కోవూరు సెగ్మెంట్
- ఇలాకాలో ఏ పనికైనా కప్పం కామన్
- గోవా నుంచి కోవూరుకు లిక్కర్ ఛానెల్
- వెయ్యి కోట్లకు పడగలెత్తిన నల్లత్రాచు
అమాయక నవ్వుల వెనుక అంతుచిక్కని అవినీతి. మెత్తని చూపుల వెనుక విషపూరిత కాఠిన్యం. ప్రతి అడుగులోనూ అరాచకత్వం, ఆలోచనల్లో దోపిడీతనం. మొత్తంగా అతను ` మనిషి రూపంలో కనిపించే విషసర్పం. అతని కాటుకు ఒకరో ఇద్దరో కాదు, మొత్తం అసెంబ్లీ నియోజకవర్గమే నిర్వర్యమైంది. అతని పేరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి. అతని ఇలాకా కోవూరు. అతనికి కొండంత అవినీతి అండ జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు ` నల్లపురెడ్డి నిరుపేద. అప్పులోళ్ల వత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికెళ్లాడు. ఇప్పుడు ` వెయ్యి కోట్లకు పడగలెత్తాడు. నెల్లూరు జిల్లా కోవూరు ప్రసన్నకుమార్ జాగీరు. రాజకీయ అరాచకాలే అతన్ని అంతటివాడిని చేశాయి. కొన్నేళ్ల క్రితం తెలంగాణలో భూకబ్జాలు, దోపిడీలతో సంచలనం సృష్టించిన నయీంని మించి పోయాడు. సింపుల్‌గా చెప్పాలంటే నెల్లూరు నయీం నల్లపురెడ్డి.
2019లో రూ.50 కోట్లమేర అప్పుల భారంతో వ్యక్తులకు, బ్యాంకులకు ముఖం చాటేశాడు. హైదరా బాద్, బెంగుళూరుల్లో తలదాచుకున్నాడు. అధికారం లోకి వచ్చిన వైసీపీ అండదండలందడంతో `దందాను తన పంథా చేసుకున్నాడు. ఇసుక తిన్నాడు. మట్టి మింగాడు. అడ్డదారుల్లో మద్యం పారించాడు. నియోజ కవర్గంలో ప్రతి పనికీ రేటు పెట్టి ట్యాక్స్ వసూలు చేశారు. రైతునుంచి ధాన్యం కొనుగోలూ.. నిరుద్యోగికి అవుట్‌సోర్సింగ్ పోస్టింగూ.. ఇలా ఏది జరగాలన్నా ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకోక తప్పని స్థితి. నిజాం కాలేజీలో బీఏ చదివిన ప్రసన్న.. అవినీతిలో మాత్రం డాక్టరేట్ చేశాడు. ఆదాయంలో రాజకీయ అండనిచ్చిన జగన్‌ను మించిపోవాలన్నది నల్లపురెడ్డి ఆశయం. వెయ్యికోట్లకు పడగలెత్తిన నల్లపురెడ్డి.. టార్గెట్‌ను త్వరలోనే దాటేస్తారని అనుయాయులే గొప్పగా చెప్పుకుంటారు.
బడుగు రైతులూ బాధితులే
బడుగు రైతుల పంటకు మద్దతు ధర దక్కకుండా చేసి కోట్లు వెనకేస్తున్న నీచ చరిత్ర ప్రసన్నకుమార్‌ది. బెదిరింపులతో రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి, అధిక రేటుకు ప్రభుత్వరంగ సంస్థలకు అంటగట్టి ప్రతి సీజన్‌లో రూ.30 కోట్లు వెనకేయడం, ఆ సొమ్ముతో హైదరాబాద్, బెంగళూరుల్లో వ్యాపారాలు చేయడం ఎమ్మెల్యేకే చెల్లింది. ధైర్యం చేసి రైతులు నిలదీస్తే వారిమీద అక్రమ కేసులు, వేధింపుల పర్వానికి తెరలేపడం కోవూరులో పరిపాటి.
గోవా టు కోవూరు లిక్కర్ ఛానెల్
గోవా, పాండిచ్చేరి నుంచి భారీగా డ్యూటీ ఫ్రీ లిక్కర్‌ను తీసుకొచ్చి ఇలాకాలో అక్రమ అమ్మకాలు చేపట్టడం ఈయనకు నిత్యవ్యాపకం. ఈ తతంగాన్ని ఎమ్మెల్యే అనుచరుడు అనిల్‌కుమార్ నిర్వహిస్తూ ఏటా రూ.200 కోట్ల లాభాలు ఆర్జిస్తున్నాడు. సర్కారీ దుకాణాల్లో సైతం గోవా లిక్కర్ ఏరులవుతున్నా, అధికారులు అటువైపు చూడలేని పరిస్థితి. మద్యం దందా సొమ్ముతో హైదరాబాద్‌లో 10 ఎకరాల భూమి ఇటీవలే కొనుగోలు చేశారన్న కథనాలు వినిపిస్తున్నాయి.
బ్యాంకులకూ టోకరా
దొంగ పత్రాలు సృష్టించడం, ఫోర్జరీలు చెయ్యడంలో వైసీపీ నేతలు దిట్టలన్నది జగమెరిగిన సత్యం. అయితే ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఒకడుగు ముందుకేసి నకిలీ పత్రాలనే బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.20 కోట్లమేర రుణం తీసుకుని ఎగనామం పెట్టాడు. దీంతో ప్రసన్న పేరెత్తితే బ్యాంకు మేనేజర్లు పరుగులు పెడుతున్నారు. ఎస్‌బీఐ నుంచి ఆరుగురు మేనేజర్లు వచ్చిన వారానికే ట్రాన్స్‌ఫర్ చేయించుకుని జిల్లా వదిలేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వవ్వేరు కో`ఆపరేటివ్ బ్యాంకుకు అనుచరులతో కలిసి రూ.10 కోట్లకు ఎగనామం పెట్టిన వైనం నియోజకవర్గ విదితమే.
కాంట్రాక్టర్లనూ వదల్లేదు. జగన్‌రెడ్డి క్విడ్‌ప్రోకో ద్వారా లక్షల కోట్లు వెనకేస్తే.. నల్లత్రాచు ప్రసన్నకుమార్ రెడ్డి పర్సంటేజీలతో దందా కొనసాగించాడు. మలిదేవి కాలువ పనుల్లో 25 శాతం (రూ.80 కోట్లు), ఎఫ్‌డీఆర్ పనుల్లో 60 శాతం (రూ.96 కోట్లు), షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో రూ.100 కోట్లు, కనిగిరి భూముల్లో గ్రావెల్ ద్వారా రూ.90 కోట్లు, పౌరసరఫరాల కాంట్రాక్టర్ వద్ద రూ.70 కోట్లు, కరోనా సమయంలో నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సుమారు పది కోట్ల ప్రజా విరాళాలు మింగేసిన వైనం నియోజకవర్గ విదితమే. తెదేపా హయాంలో ఇరిగేషన్ పనులు క్యూబిక్ మీటర్‌కు 43 రూపాయిలు ఉంటే.. ప్రస్తుతం ఎమ్యెల్యే పెట్టిన రేటు రూ.230. ప్రతి ఇరిగేషన్ పనిలో ఎమ్యెల్యే వాటా 20 శాతం.
జగనన్న లే అవుట్లకూ తూట్లు
జగనన్న లేఅవుట్ల కింద ఇళ్ల స్థలాలు ఇవ్వడం నుంచి భూసేకరణ వరకు అన్ని దశలోనూ పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకున్నదన్నది జనమెరిగిన సత్యం. లేఅవుట్లు వేసే ప్రాంతంలో అనుచరులతో ముందుగానే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయించి.. వాటిని తిరిగి ప్రభుత్వానికి అమ్మి కోట్లు వెనకేశాడు. పైగా స్థలాల్ని మెరక చేసే సాకుతో మరో రూ.20 కోట్లు మింగేశాడు. బోనసుగా.. లబ్ధిదారుల నుంచీ లక్షలు వసూలు చేయడం నల్లపురెడ్డికే సాధ్యమైంది.
ఎన్`ట్యాక్స్ వసూలు
నియోజకవర్గంలో జరిగే ప్రతి పనికీ నల్లపురెడ్డికి ఎన్` ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఇదీ అనధికార ధరల పట్టిక.
1. టీచర్ ట్రాన్స్‌ఫర్లకు రూ.10 లక్షలు
2. లేఅవుట్ వెయ్యాలంటే ఎకరాకు రూ.20 లక్షలు
3. మిల్లర్ల నుంచి రూ.15 లక్షలు
4. రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి రూ.10 లక్షలు
5. పోలీసుల పోస్టింగ్‌కు 10 నుంచి 20 లక్షలు
6. కాంట్రాక్టర్ల నుంచి రూ.కోటి పనికి10శాతం
7. అంగన్‌వాడీ పోస్టుకు రూ.5 లక్షలు
8. ఆపరేటర్ పోస్టుకు రూ.3 లక్షలు
కబ్జాల పర్వం
నియోజకవర్గంలో ప్రభుత్వ భూములే కాదు, రైతుల భూములూ వదల్లేదు. అడంగల్‌లో పేర్లు మార్చి స్వాహా చేసిన సంఘటనలెన్నో. ప్రసన్నకుమార్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 300 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములున్నాయి. ఖాళీ స్థలాలు కనిపిస్తే పట్టాలు సృష్టించి కబ్జా చేయడం ఇక్కడ పరిపాటి. విడవలూరులో 18 ఎకరాల పంట భూమి, ఇందుకూరుపేటలో 25 ఎకరాల రైతుల భూములు, కొవ్వూరు, బుచ్చి తదితర ప్రాంతాల్లో 100 ఎకరాలకు పైగా భూములు అన్యాక్రాంతమైన కథనాలు ఇక్కడ వినిపిస్తున్నాయి. విడోస్ హోమ్ ఫౌండేషన్‌కు చెందిన 7 ఎకరాల భూమినీ వదల్లేదన్న కథనాలు లేకపోలేదు. గుంట పోరంబోకులను పూడ్చడానికి వీల్లేదన్న సుప్రీంకోర్టు తీర్పును తుంగలోతొక్కి, నల్లత్రాచు ఆధ్వర్యంలో యథేచ్ఛగా పూడ్చి వెంచర్లు వేశారు. రాజుపాలెం ప్రభుత్వ భూముల్లో లే అవుట్లు వేసి స్థలాలు అమ్మి రూ.20 కోట్లు వెనకేశాడు. చెప్పుకుంటూ పోతే నియోజకవర్గంలో నల్లపురెడ్డి ఆగడాలు పెద్ద గ్రంథమే అవుతుంది.
రియల్ ఎస్టేట్ మాఫియా..
ప్రభుత్వ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? ప్రసన్నకుమార్‌రెడ్డికి వచ్చింది. ప్రభుత్వ భూముల్లో, అసైన్డ్ భూముల్లో లేఅవుట్లు వేసి వ్యాపారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ మాఫియాకు కోవూరును అడ్డాగా మార్చి వందకు పైగా అక్రమ లేఅవుట్లను ఏర్పాటు చేశారు. నెల్లూరు`బళ్లారి`ముంబై జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 67)కి ఆనుకుని పెద్దఎత్తున అక్రమ లేఅవుట్లను ఏర్పాటు చేశారు. ఇందులో రూ.100 కోట్ల మేర మిగుల్చుకున్నట్టు లెక్కలు వినిపిస్తున్నాయి.
అనుచరుల ఆగడాలు
ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు బుచ్చి సుర శ్రీనివాస రెడ్డి ఓవర్ బ్యాంక్‌లో నిధులు 3 కోట్లు గోల్‌మాల్ చేశాడు. మరో ముఖ్య అనుచరుడు, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి అక్రమ మైనింగ్‌లో దిట్ట. ఎర్ర బంగారం అని పిలువబడే ఎర్రమట్టి గ్రావెల్ కొడవలూరు మండలంలో విరివిగా దొరుకుతుంది. ఈ మైనింగ్ మొత్తాన్ని అనుచరులకు అప్పగించాడు. ఎమ్యెల్యే మరో ముఖ్య అనుచరుడు, ఆప్కాబ్ చైర్మన్ అనిల్‌బాబు విడవలూరు మండలం రామతీర్థం, రామచంద్రపురం, ఊటుకూరు గ్రామాల్లో సముద్ర తీర ప్రాంత సోషల్ ఫారెస్ట్ భూమి 300 ఎకరాలు ఆక్రమించి, వాటిలో రొయ్యలు చెరువులు వేసి ఎమ్యెల్యేకి కోట్ల రూపాయల్లో వాటాలు అప్పజెపుతున్నారు. ఇంతింత కాదయా ఎమ్మెల్యే దందా అని చెప్పుకోడానికి పైన చెప్పుకున్నవి మచ్చుకు మాత్రమే.