పల్నాటి పులి కోడెలను వేధించి ప్రాణాలు తీశారు
వివేకా హత్యపై సొంత చెల్లి వ్యాఖ్యలకు జగన్ సమాధానం చెప్పాలి
జగన్ నోక్కేది ఉత్తుత్తి బటన్
చంద్రబాబు సభకు భారీ స్పందన
జనసంద్రంగా మారిన సత్తెనపల్లి రహదారులు
పేదలను అందరినీ సంపన్నులను చేయటమే నా లక్ష్యం. అందుకోసం సంపద సృష్టిస్తా. దానిని పేదలకు పంచుతా అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి సత్తెనపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అంతకు ముందు నియోజకవర్గ పరిధిలోని పెదమక్కెన గ్రామం నుంచి సత్తెనపల్లి వరకు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో తో రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. నియోజకవర్గ ప్రారంభంలో పెదమక్కెన వద్ద మహిళలు మంగళహారతులతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. రహదారులన్నీ జనంతో కిక్కిరిసి పోవటంతో రోడ్ షో ముందుకు సాగేందుకు గంటలకొద్దీ సమయం పట్టింది.
అనంతరం సత్తెనపల్లి లో జరిగిన భారీ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ జగన్ వంటి వ్యక్తి ప్రజాజీవితంలో వుండేందుకు అనర్హుడు అని విమర్శించారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలు గుర్తు చేసుకోవాలి. పల్నాటి పులి మన కోడెల శివప్రసాద్. ఎవరికి భయపడని వ్యక్తి. అలాంటి వ్యక్తిని వేధించి ప్రాణాలు తీశారు. గోదావరి పెన్నా అను సంధానానికి నకిరకల్ లో శంకుస్థాపన చేయించిన వ్యక్తి కోడెల శివప్రసాద్. అలాంటి మంచి వ్యక్తి సైకో సిఎం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు కారణం అయిన సైకో సిఎంను ఏమనాలి? అని ప్రశ్నించారు. ఇలాగే నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి చంపారు. నేను 14 ఏళ్లు సిఎంగా ఉన్నా. ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా? బాబాయిని గొడ్డలితో చంపేసి. నానా గడ్డి తిని నాపై ఆరోపణలు చేస్తావా? బాబాయిని చంపడంతో పాటు అతని క్యారెక్టర్ పైనా దారుణ వ్యాఖ్యలు చేశారు.
వివేకా హత్యపై సొంత చెల్లి వ్యాఖ్యలకు జగన్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. కోడి కత్తి డ్రామా ఆడిన జగన్ పై ఎన్ఐఎ స్పష్టంగా చెప్పారు. ఆ కేసులో నిందితుడికి టీడీపీతో సంబంధం లేదని చెప్పారు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండాల్సిన పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పారు. ఇలాంటి ఫేక్ నేత మనకు ముఖ్యమంత్రిగా వచ్చారు. అందుకే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చేస్తున్నాం అని వివరించారు. నేను సిఎం అయిన తరువాత 16 వేల కోట్ల లోటు బడ్జెట్. అయినా చిన్న లోటు రాలేదు. నాడు ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్ ఇచ్చాను. అన్నా క్యాంటీన్ పెట్టాను. చంద్రన్న బీమా పెట్టాను. బడుగు వర్గాల సబ్ ప్లాన్ లు ఉన్నాయా ఇప్పుడు? అని ప్రశ్నించారు.
నవరత్నాలు కాదు.. నవ మోసాలు
జగన్ చెప్పినవి నవరత్నాలు కాదు…నవ మోసాలు. ఇచ్చేది 10 రూపాయలు…దోచుకునేది 100 రూపాయలు. ఒకప్పుడు పెట్రోల్ ధర 76, ఇప్పుడు 126 రూపాయలు. గ్యాస్ అప్పుడు 700 ఇప్పుడు1175. వంట నూనె అప్పుడు 85 రూపాయాలు. ఇప్పుడు 165 రూపాయాలు. రిజిస్ట్రేషన్ చార్జీలు మళ్లీ పెంచాడు. కరెంట్ చార్జీలు 8 సార్లు పెంచాడు.300 రూపాయాలు ఉండే కరెంట్ చార్జీ 800 అయ్యింది. నేను నాడు విద్యుత్ చార్జీలు ఒక్క సారి కూడా పెంచలేదు. మద్యం రేట్లు అన్నీ పెంచాడు. నాసిరకం బ్రాండ్లు అమ్ముతున్నాడు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దోచిన వ్యక్తి ఈ జగన్….. బాబాయిని చంపిన వ్యక్తి జగన్. ఆస్తిపన్ను ఏటా 15 శాతం పెంచుతున్నాడు. జగన్ పెంచుతూనే ఉంటాడు. మీరు మాత్రం సైలెంట్ గా ఉంటారు.
నేను 149 రూపాయాలకు ఫైబర్ నెట్ ఇస్తే ఇప్పుడు 350 చేశాడు. నాడు ఇసుక ఉచితంగా ఇచ్చాం. ఇప్పుడు ట్రాక్టర్ 5 వేల రూపాయలు. లారీ ఇసుక 75 వేల రూపాయలు. మన ఊర్లో, మన నదిలో వచ్చే ఇసుక ఎందుకు ఇంత ధర. దేవుడి ఇచ్చిన ఇసుకపై వీళ్ల పెత్తనం ఏంటి ? పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే నెలకు 20 కోట్లు తాడేపల్లికి కప్పం ఇసుక దోచుకుంటున్నాడు అని ఆరోపించారు. మీకు ఇచ్చేది గోరంత. దోచుకునేది కొండంత అనేది ఆలోచించాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా ఆనందంగా లేరు రాష్ట్రంలో మన రాష్ట్రంలో రెండింతల ధరలు పెరగడానికి ఈ ప్రభుత్వమే కారణం చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్ అని విమర్శించారు.
అమ్మ ఒడి అని చెప్పి ఒక్కరికే పథకం ఇస్తున్నాడు. ఒకప్పుడు అన్ని ప్రభుత్వాలు ఇచ్చే ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఇప్పుడు వసతి దీవెన అంటున్నాడు. విద్యాదీవెన అంటున్నాడు. ఇవన్నీ గత ప్రభుత్వాలు ఇవ్వలేదా? ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలల్లో పీజీ చేస్తున్న వారి సంఖ్య తగ్గిపోయారు. నాడు ఫీజు రీయింబర్స్మెంట్ కింద 16 లక్షల మందికి ఇస్తే ఇప్పుడు 10 లక్షల మందికే ఇస్తున్నాడు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణలలో పిజీ చదివే వారి సంఖ్య పెరిగింది. మన దగ్గర పిజీ చదివే వారి సంఖ్య తగ్గింది. పీజీ చెయ్యడానికి మన రాష్ట్రం నుంచి రెండు లక్షల మంది తెలంగాణకు వెళ్లారు. అమరావతి లో విద్యార్థుల కోసం విట్, ఎస్ఆర్ఎం, అమృత వంటి యూనివర్సిటీలు తెచ్చాను. మంగళగిరిలో ఎయిమ్స్ తీసుకువచ్చాను.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కేంద్ర విద్యాసంస్థలు తీసుకువచ్చాము అని వివరించారు. సైకోకు చదువు రాదు కాబట్టి మీరు కూడా ఎవరూ చదువుకోకూడదు అనేది అతని కోరిక. నా పిల్లలు బాగా చదువుకున్నారు. అందుకే అందరి పిల్లలను బాగా చదివించాలని నాకు ఉంటుంది అని చంద్రబాబు చెప్పారు. జగన్ నొక్కేది ఉత్తుత్తి బటన్. ట్యాంకర్ లో నీళ్లు ఉంటే ట్యాప్ లో నీళ్లు వస్తాయి. అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు తేవడం గొప్పకాదు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగు దేశం పార్టీ. అంబానీ సోదరుల్లో ఒకరు పెద్ద వ్యాపారవేత్తగా నిలిచారు. ఇంకొకరు వ్యాపారంలో దెబ్బతిన్నారు. ఇప్పుడు తెలంగాణ, ఎపి కూడా అంతే. బాగా చేసుకున్న తెలంగాణ అభివృద్ది చెందింది. ఎపి వెనుక బడింది. నాడు మనం చేసిన అభివృద్దిని తెలంగాణ లో తరువాత వచ్చిన పాలకులు కొనసాగించారు అని వివరించారు.
2014 అధికారంలోకి వచ్చిన తరువాత విజన్ 2029 తయారు చేశాను. మనం అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పుడు ఎపి తెలంగాణ దేశంలో టాప్ స్టేట్స్ గా ఉండేవి అని చంద్రబాబు చెప్పారు. నాడు ముద్దులు పెట్టిన జగన్ ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడు. కోడెలకు వేధింపులు ప్రజా వేదిక కూల్చివేత అమరావతి నాశనంతో సైకో జగన్ పాలన సాగించాడు. ప్రజల అందరి కష్టాలకు కారణం జగనే. అందుకే సైకో పోవాలి. సైకిల్ రావాలి అని పిలుపునిచ్చారు. బెదిరింపులతో ప్రజల ఆస్తులు రాయించుకుంటున్నారు. పోర్టులు, ఆస్తులు, భూములు అన్నీ రాసిస్తున్నారు. బెదిరింపులకు భయపడి చాలా మంది అస్తులు వైసీపీ గూండాలకు అప్పగించారు. నాలుగేళ్లలో రూ. 2లక్షల కోట్లు దోపిడీ చేసిన సిఎం ఈ జగన్. మద్యంలో 40 వేల కోట్లు దోచుకున్నాడు.
ఇసుక, మైనింగ్ ద్వారా దోచుకున్నాడు. చివరికి గంజాయి ద్వారా కూడా అక్రమ ఆర్జన చేస్తున్నాడు. వైసీపీ వచ్చిన తరువాత గంజాయి వాణిజ్య పంట అయిపోయింది. రేషన్ బియ్యం కూడా రీసైక్లింగ్…ఇదొక మాఫియా. ఎర్రచందనం, సిమెంట్, సెంట్ భూమి ద్వారా కూడా వేల కోట్లు దోచుకున్నాడు అని ఆరోపించారు. మరోవైపు రూ.5 లక్షల కోట్లు మీపై భారం వేశాడు. మీ పేరుతో రూ. 10 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఆ అప్పులు కట్టాల్సింది మన ప్రజలే కదా. ఉత్తర ప్రదేశ్ లో మనకంటే పెద్ద రాష్ట్రం. కానీ మనకంటే తక్కువ అప్పు ఉంది అని తెలిపారు. ఈ ఏడాది సాగర్ నీరు ఈ ప్రాంతానికి ఇవ్వలేదు. నాడు నేను పట్టిసీమ కట్టి నీటి ఎద్దడి లేకుండా చేశాను. మనం ప్రాజెక్టు కట్టినా వీళ్లు నీరు ఇవ్వలేకపోయారన్నారు.
నీళ్లడిగిన రైతులపై నరసారావు పేటలో అక్రమ కేసులుపెట్టారు. ఆ కేసులు మనం వచ్చాక ఎత్తేద్దాం. మనం అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేది. పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. ఇరిగేషన్ లో డయాఫ్రం వాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి. నోరు ఉందని ఆంబోతులా రంకెలు వేస్తే లాభం లేదు అని ఆ మంత్రి తెలుసుకోవాలి పెదకూరపాడు. సత్తెనపల్లి రోడ్డు వేయలేని నువ్వు టీడీపీని విమర్శించే పెద్దమగాడివా? అని ప్రశ్నించారు. సైకో ముఖంలో ఆనందం కోసం రోజూ పవన్ కళ్యాన్ ను, నన్ను ఈ మంత్రి విమర్శిస్తుంటారు అని చెప్పారు.
నాగార్జన సాగర్ లో కాలువల ఆధునీకరణ కోసం నాడు 127 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాంతంలో 4 వేల పైచిలుకు టిడ్కో ఇళ్లు నిర్మిస్తే వాటిని పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వలేదు. స్థానికంగా రైల్ ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉంది. దాన్ని నిర్మించలేకపోయారు పేరేచర్ల, సత్తెనపల్లి రోడ్డు అధ్వాన్నంగా ఉంది. ఆ రోడ్డు ఎందుకు వేయలేదు. 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఒక్క రోడ్డు వేశారా? ఒక్క ప్రాజెక్టు కట్టారా? అని ప్రశ్నించారు. ఈ మంత్రి అంబటి రాంబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అనిపిస్తుంది. సత్తెనపల్లి పట్టణంలో డ్రైనేజ్ పనికి వెళ్లి బిసి వర్గానికి చెందిన తురక అనీల్ అనే యువకుడు చనిపోయాడు. అతనికి వచ్చిన 5 లక్షల ఆర్థిక సాయంలో మంత్రి వాటా అడిగాడా లేదా? తల్లి దండ్రుల ఘోష కు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
కమిషన్ ఇవ్వలేదని 5 లక్షల రూపాయాల చెక్ వెనక్కి వెళ్లిపోయింది. దీనికి అంతా బాధపడాలన్నారు. పోలవరం కుడికాలువలో గట్లు కోట్టేస్తున్నారు. గట్లు మాయం అవుతున్నాయి. దీనిపై హైకోర్టు చీవాట్లు పెట్టింది. మరి మంత్రి దీనికి సమధానం చెపుతాడా అని అడుగుతున్నా. ఇలాంటి మంత్రి మనకు కావాలా? రాజు పాలెం మండలంలో మంత్రి అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని వాళ్ల పార్టీనాయకులే కోర్టుకువెళ్లారు. నియోజవకర్గంలో అపార్ట్మెంట్ అయినా వెంచర్ వేసినా మంత్రికి వాటా ఇవ్వల్సిందే. అంబటి తమ్ముడు మొన్నటి వరకు చాలా యాక్టివ్ గా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు యాక్టివ్ గా లేడు అనేది మంత్రి చెప్పాలి? పేదల ఇళ్ల స్థలాల్లో వీళ్ల మనుషులు 10 కోట్లు కొట్టేశారు. కమిషన్ ఇవ్వలేదని ముగ్గు మిల్లులు మూత వేశారు అని ఆరోపించారు. సత్తెన పల్లిమీటింగ్ చూసిన తరువాత మీ స్పందన చూసిన తరువాత చెపుతున్నా మీ ఆగ్రహానికి వైసీపి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ఈ ప్రభుత్వంపై పోరాటానికి రండి. ధైర్యంగా ముందుకు రండి అని పిలుపునిచ్చారు. జాబు రావాలి అంటే బాబు రావాలి అని అంతా అంటున్నారు. యువత భవిష్యత్ బాగుండాలి అంటే టీడీపీ రావాలి. రాష్ట్రంలో 5 కోట్లమంది ఒక పక్కన ఈ సైకో జగన్ ఒక పక్కన అని చంద్రబాబు వెల్లడించారు.