- లక్షల ఎకరాల భూమి దోచుకున్నారు
- పేదవాడికి రెండు సెంట్లు ఇవ్వడానికి మాత్రం చేతులు రాలేదు
- నేడు చంద్రబాబు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తున్నారు
- పాపాలు చేసినందునే ప్రజల్లోకి వచ్చేందుకు పెద్దిరెడ్డికి భయం
- అక్రమాలు బయటపడతాయనే ఫైళ్లు తగలెడుతున్నారు
- ఒక రోజు లేటైనా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం
- మంత్రి మండిపల్లి స్పష్టీకరణ
అమరావతి(చైతన్యరథం): వైసీపీ నేతల్లా ఒకరోజు షో చేసి మర్నాడు దుకాణం సర్దేసే ప్రభుత్వం తమది కాదని, కాస్త ఆలస్యం అయినా… ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహన్‌రావుతో కలిసి మంత్రి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరి మైన్స్ లాక్కున్నారో, ఎవరి భూములు లాక్కున్నారో వారు నేడు వందలాదిగా వచ్చి అర్జీలు ఇస్తున్నారన్నారు. ఎక్కడా లేని విధంగా గత ఐదేళ్లలో భూ దోపిడీ జరిగింది. రాష్ట్రంలో సుమారు లక్షా 74 వేల ఎకరాలను వైసీపీ నాయకులు కొట్టేశారు. 40 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూముల స్కామ్ జరిగింది. మఠాల భూములు, ప్రజల భూములు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. కానీ పేదలకు రెండు సెంట్లు ఇచ్చేందుకు మాత్రం జగన్‌రెడ్డికి భూమి దొరకలేదు. నేడు పేదల ఇంటి నిర్మాణానికి పట్టణ ప్రంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున భూమి ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు శభాష్ అంటున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన అందరికి తెలిసిందే. రాష్ట్రాన్ని దోచుకున్న వారిలో నెంబర్ 2 గా చెప్పే వ్యక్తి కథ ఇది. 14 మండలాలకి సంబంధించిన భూ అక్రమణల వివరాలు బయట పడతాయని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను దగ్ధం చేశారు. ఈ ఘటనపై వెంటనే సీఎం ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు 14 వేల ఎకరాలకు సంబంధించిన దస్తావేజులను దగ్ధం చేశారు. గవర్నమెంట్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి ఎన్వోసీలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రావడంతో అక్రమాలు బయట పడతాయని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, బంధువుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వారి తప్పులను కప్పి పెట్టేందుకు మదనపల్ల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని దగ్ధం చేశారు. ఆర్డీఓ మురళి, పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి, పెద్దిరెడ్డి పీఏ తుకారంలే ఇందుకు సూత్రధారులని మంత్రి మండిపల్లి చెప్పారు.
దోచుకోవడమే పనిగా..
జగన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి రాష్ట్రంలో ఉన్న భూములను దోచుకోవడం తప్పించి మరే కార్యక్రమం చేయలేదు. నేడు తప్పులు బయట పడతాయనే భయంతో ఫైళ్లను దగ్ధం చేస్తున్నారు. వైసీపీ నేతల్లా మేము కక్ష పూరిత రాజకీయాలు చేయం. న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. వైసీపీ నేతలు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఇకనైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలి. వైసీపీ హయాంలో నష్టపోయిన బాధితులు వచ్చి నిలదీస్తుంటే సిగ్గులేకుండా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. వైసీపీ నేతల వల్ల నష్టపోయిన ప్రజలకు నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు భరోసా ఉండటంతో ప్రశ్నిస్తున్నారే కాని ఎక్కడా కూడా దాడులు చేయలేదని మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు.
అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి
వైసీపీ నేతలు గత ఐదు సంవత్సరాలుగా పోలీసుల నీడలోనే ప్రజల్లోకి వచ్చారు. ఇప్పుడు వైసీపీ నేతలే దాడులు చేయించుకుని టీడీపీపై నేపం వేయడం దారుణం. నాడు జగన్ రెడ్డి ఢల్లీికి వెళ్లి అప్పటి కేంద్ర పెద్దల కాళ్లునొక్కడం, తన కేసులు గురించి మాట్లాడటం తప్ప కేంద్ర నుండి ఒక్క రూపాయి సాయం తీసుకు రాలేదు. నేడు చంద్రబాబు ఢల్లీి వెళితే పోలవరానికి నిధులు, రాష్ట్ర రహదారులకు నిధులు వస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది. వైసీపీ నేతలు నిజంగా ప్రజల పక్షాన ఉన్నారనుకుంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాలి. కానీ ఢల్లీికి పోయి అక్కడి రిసార్ట్ లలో సేద తీరుతూ.. ఒక గంట ఢల్లీి రోడ్లలో ధర్నా చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ప్రశ్న రాసిన ఎమ్మెల్యేకు సమాధానం చెబుదామంటే అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు లేకపోవడం సిగ్గుచేటన్నారు.
అక్రమాలన్నీ బయటపెడతాం
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో ఒక చిన్న సివిల్ కాంట్రాక్టర్ మాత్రమే. నేడు వందల కోట్లు ఎలా వచ్చాయి. వేల ఎకరాలు ఎలా వచ్చాయి? జగన్ రెడ్డిలా పోలీసులతో అడ్డుకునే చర్యలు మా ప్రభుత్వం చేయదు… జగన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లవచ్చునని మంత్రి అన్నారు. తుమ్మల్లపల్లి, మదనపల్ల్లె క్వారీల్లో ఎన్నో అరాచకాలు చేసిన వైసీపీ నేతలు నేడు వాటిని వదిలేసి పారిపోయారు. ఒక లారీ పేరుతో మూడు లారీలను పెద్దిరెడ్డి తిప్పాడు. నేడు ఆ లారీలను పక్క రాష్ట్రాల్లో దాచిపెట్టారు. ఆ అక్రమాలను బయటపెడతా. అధికారం పోయి రెండు నెలలు అయినా వైసీపీ నేతలు ప్రజల్లో తిరగలేకపోతున్నారు. తప్పు చేయకుంటే ప్రజల్లోకి ఎందుకు రావడంలేదు. టీడీపీ నేతలు ఎవరిపైనా దాడులు చేయటం లేదు. మా నాయకుడు, మేము ప్రజలకోసం పనిచేస్తున్నామని మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు.