- లేదంటే గుడివాడ ప్రజలే తరిమికొడతారు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ప్రజలు స్పష్టమయిన తీర్పునిచ్చి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వయంగా వారే ముందుకు వచ్చి చంద్రబాబు పాలనలో తామెంత సుభిక్షంగా ఉన్నామో చెబుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడమే కాకుండా గత ఐదేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమయిన తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో తయారయ్యే లడ్డూ ప్రసాదం తయారీలో జగన్ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యి ఉపయోగించి కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బ తీయటం అత్యంత దుర్మార్గం. ఈ దుర్మార్గం బయట పడగానే ఎక్కడినుంచి బయటికొచ్చారో తెలియదు.. వరదల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కనబడని కొడాలి నాని బయటికొచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు.
జగన్ రెడ్డి ప్రతిష్టని దెబ్బతీయడానికి చంద్రబాబు ఈ లడ్డూ అంశాన్ని తీసుకొచ్చి విష ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని నోటికొచ్చినట్లు మాట్లాడటం విడ్డూరం. సుపరిపాలనతో ఆకాశమంత ప్రతిష్టను సంపాదించిన సీఎం చంద్రబాబు నాయుడికి అధఃపాతాళంలో ఉన్న జగన్ రెడ్డిపై విష ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది. ప్రజలు ఛీ కొట్టి తిరస్కరించిన బూతుల మంత్రి కొడాలి నాని విశ్వాసం గురించి దేవుడి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. గతంలో ఆంజనేయ స్వామి విగ్రహం చేయి విరగ్గొట్టినప్పుడు బొమ్మే కదా ఏమవుతుందన్న కొడాలి నాని ప్రేలాపనలు జనం మరిచిపోలేదు. దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు చోరీకి గురయితే ఎంత ఖర్చవుతుంది అని హేళనగా మాట్లాడాడు. అలాంటి కొడాలి నానికి ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడే అర్హత ఉందా. నాని గుర్తొస్తేనే, ఆయన మాటలు గుర్తొస్తేనే గుడివాడ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇకనయినా పిచ్చి వాగుడు మానకపోతే గుడివాడ ప్రజలు తరిమి కొడతారని వెనిగండ్ల రాము స్పష్టం చేశారు.