- రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ దళిత నేతల నీచ రాజకీయం
- స్మృతివనంలో ఎవరో పేరు తొలగిస్తే నానా యాగీ చేస్తున్నారు
- ఆ ఘటనకు, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు
- దళితులను, గిరిజనులను మోసగించిన చరిత్ర వారిదే
- ఎమ్మెల్సీ ఎన్నికలపై జగన్ నీతులు..దెయ్యాలు వేదాలు వల్లించడమే
- వాలంటీర్లను రెన్యువల్ చేయకుండా మోసగించడం సిగ్గుచేటు
- సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డి.ఎస్.బి.వి.స్వామి వ్యాఖ్యలు
ఒంగోలు(చైతన్యరథం): విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ పేరును ఎవరో ఆగంతకులు తొలగిస్తే నానా యాగీ చేస్తున్న వైసీపీ నేతలు నాడు విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చి జగన్ పేరు పెట్టుకుంటే ఎందుకు నోరు మెదపలేదని రాష్ట్ర సాంఘి క సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి మండిపడ్డారు. శుక్రవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహానికి ఉన్న జగన్ పేరును అర్థరాత్రి ఎవరో ఆగంతకులు తొలగిస్తే వైసీపీ నేతలు సిగ్గులేకుండా నానా యాగీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంబేద్కర్ విగ్రహంపై చిన్న గీత కూడా పడలేదని, కానీ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేయటం సిగ్గుచేట న్నారు. దీన్ని ప్రభుత్వానికి ఆపాదించటం సరికాదని, ఆ ఘటనకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లే పనులు మానుకోవాలని హితవు పలికారు.
ఐదేళ్లు వైసీపీ దళిత మంత్రులు ఏం ఒరగబెట్టారు?
పేర్లు తొలగిచడం వంటి పనులు చేయాల్సిన అవసరం మాకు లేదని.. వైసీపీలో దళిత మంత్రులు ఐదేళ్లు అధికారంలో ఉండి ఎప్పుడూ జగన్ మెప్పు కోసం పాకులాడటం తప్ప దళితులకు చేసిందేంటి? నాడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన మేరుగ నాగార్జున, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ ఏం ఒరగబెట్టారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు అధ్వానంగా ఉన్నా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారని మండిపడ్డారు. జాతి ప్రయోజనాలు పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడే వారిని జాతి క్షమించదని హెచ్చరించారు. జగన్ ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టారు. దళితులు, గిరిజనులను జగన్ దారుణంగా మోసం చేశారని విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై వ్యాఖ్యలు..దెయ్యాలు వేదాలు వల్లించడమే
నాడు ఈవీఎంలు సూపర్ అన్న జగన్..నేడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అని అంటున్నా రు.. ఒంగోలులో కొన్ని స్థానాల్లో రీకౌంటింగ్ జరపాలని వైసీపీ నేతలు అంటున్నారు.. ఏం చేసినా ప్రజలిచ్చిన తీర్పును ఎవరూ మార్చలేరని హితవుపలికారు. నాడు సంఖ్యాబలం లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జగన్…నేడు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించటమేనని.. మాట తప్పడం మడప తిప్పడం జగన్‌కు అలవాటేనని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు నా సైన్యం అన్న జగన్ 2023 ఆగస్టు నుంచి వారిని రెన్యువల్ చేయకుండా ద్రోహం చేశాడని, తాము వాలంటీర్లను రెన్యువల్ చేస్తామని తెలిపారు.