- పట్టణ వీధుల్లో టీడీపీ-జనసేన కార్యకర్తల కోలాహలం
- శీలంవారిపాకలు సెంటర్‌లో నేడు దళిత గళం పేరుతో సభ
పిఠాపురం: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పిఠాపురం పట్టణంలో జనసంద్రాన్ని తలపించింది. కాకినాడ రూరల్ తిమ్మాపురం నుంచి బయలుదేరిన యువగళం పాదయాత్ర పెద్దాపురం నియోజకవర్గం పవర మీదుగా చిత్రాడ వద్ద పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. చిత్రాడలో పిఠాపురం ఇన్‌ఛార్జి ఎన్వీవీఎస్ వర్మ ఆధ్వర్యంలో యువనేత లోకేష్‌కు అపూర్వస్వాగతం లభించింది. చిత్రాడలో ప్రధాన రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. లోకేష్ రాక సందర్భంగా పూలవర్షంతో ముంచెత్తారు. డప్పు చప్పుళ్లు, డిజె సౌండ్స్, బాణా సంచా మోతలతో కార్యకర్తలు కేరింతలు కొట్టారు. యువగళం జెండాలతో సందడి జనసేన కార్యకర్తలు, అభిమానులు సందడి చేశారు. దారిపొడువునా హారతులతో మహిళలు నీరాజనాలు పట్టారు.
అనంతరం యువనేతతో ఫొటోలు దిగేందుకు యువతీయువకులు పోటీపడ్డారు. భారీ గజమాలలతో యువనేతను పార్టీ నేతలు, కార్యకర్తలు సత్కరించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో పాదగయ క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీ విత్ నారా లోకేష్ కార్యక్రమంలో సుమారుగా వెయ్యి మందితో లోకేష్ ఫొటోలు దిగారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగడం పట్ల కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. పాదగయ క్యాంప్ సైట్ నుండి భోజన విరామానంతరం ప్రారంభమైన పాదయాత్రకు పిఠాపురంలో జనం పోటెత్తారు. పిఠాపురంలో లోకేష్ కి జనసేన ఇన్‌చార్జ్ ఉదయ్ శ్రీనివాస్ నేతృత్వంలో జనసైనికులు ఘనస్వాగతం పలికారు. పిఠాపురంలో రోడ్డుకి ఇరువైపులా జనం బారులు తీరారు. భవనాలు ఎక్కి లోకేష్ కి జనం అభివాదం చేశారు. యువత, మహిళలు, వృద్ధులను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. 215వరోజు యువనేత లోకేష్ 19.8 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2964.4 కి.మీ.లు పూర్తయింది. యువగళం పాదయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం పొన్నాడలో దళితగళం పేరుతో నిర్వహించే సభకు యువనేత లోకేష్ హాజరవుతారు.