- వెలుగు చూస్తోన్న వైసీపీ చీకటి పాలన
- ‘ప్రజాదర్బార్’లో బహిర్గతమవుతున్న నిజాలు
- ఏ ఒక్కరిని కదిలించినా కష్టాలు.. కన్నీళ్లే!!
- వైసీపీ హయాంలో ప్రజాసమస్యలు పట్టని పాలకులు
- 21వ రోజూ మంత్రి లోకేష్‌కు పోటెత్తిన విన్నపాలు
- పరిష్కారానికి మంత్రి భరోసాతో బాధితుల హర్షం
అమరావతి (చైతన్య రథం): ఐదేళ్ల వైసీపీ పాలన చవిచూసిన ఓ ఒక్కరిని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే. జగన్ చీకటి పాలనలో ప్రజలెంతటి కష్టాలు అనుభవించారో ‘ప్రజాదర్బార్’ సాక్షిగా బహిర్గతమవుతున్నాయి. వైసీపీ రాక్షస పాలనలో సమస్యలకు పరిష్కారం లభించక ప్రజలెంతో ఆవేదన చెందారో `మంత్రి లోకేష్ వద్దకు వస్తున్న వినతులు చూసి చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం రాగానే ‘ప్రజాదర్బార్’తో ఐటీ మంత్రి నారా లోకేష్ బాధిత ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఉండవల్లి నివాసంలో 21వ రోజు ‘ప్రజాదర్బార్’కు ప్రజలనుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. భూములు కబ్జాకు గురయ్యాయని, ఏ ఆధారంలేని తమకు శాశ్వత నివాసం కల్పించాలని, గత ప్రభుత్వంలో అర్హత ఉన్నా వృద్ధాప్య, వితంతు, వికలాంగ, పెన్షన్ తొలగించారని, అనారోగ్యంతో బాధపడుతున్న తమకు వైద్య సాయం అందించాలని, వివిధ వృత్తి, వ్యక్తిగతమైన సమస్యలను పరిష్కరించాలంటూ బాధితులు మంత్రిని కలిసి విన్నవించారు.
సమస్యల సత్వర పరిష్కారానికి నారా లోకేష్ భరోసా ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులోని శ్రీనివాసకాలనీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు నారా లోకేష్‌ను కలిశారు. 25 ఏళ్ల క్రితం ఉడా ఆమోదం పొందిన లే అవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేశామని, తమ లే అవుట్‌లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతిలేక ఇబ్బందులు పడుతున్నామని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రికి పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లికి చెందిన ఎస్ నవ్యభారతి విజ్ఞప్తి చేశారు. భర్త చనిపోయిన తనకు వితంతు పింఛను మంజూరుచేసి ఆదుకోవాలని దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెంకు చెందిన మండ్రు కుమారి మంత్రిని కోరారు. నిరుపేదలమైన తమకు సొంతిల్లు లేదని, టిడ్కో ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లికి చెందిన బి జయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం, వి తిమ్మాపురానికి చెందిన తుమ్మలపల్లి లక్ష్మన్న లోకేష్‌ను కలిశారు. తమ కూతురు గ్రామంలోనే 4వ తరగతి పూర్తిచేసిందని, పైచదువుల కోసం ఆర్థిక పరిస్థితి సహకరించనందున గురుకుల పాఠశాలలో 5వ తరగతి సీటు కల్పించాలని కోరారు. ప్రకాశం జిల్లా ఎనికపాడుకు చెందిన జి శ్రీనివాసరావు మంత్రిని కలిశారు. కుటుంబంతో సహా శ్రీశైలం తీర్థయాత్రకు వెళ్లగా.. తమ ఇంట్లో బంగారం, నగదు అపహరించారని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని వాపోయారు. తమ సమస్యను పరిష్కరించేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ హయాంలో మాజీ హోంగార్డులకు తీవ్ర అన్యాయం జరిగిందని, మాజీ హోంగార్డులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలనే హైకోర్టు ఆదేశాలను అమలుచేయాలంటూ ఏపీఈహెచ్ అసోసియేషన్ ప్రతినిధులు నారా లోకేష్‌ను కలిసి కోరారు. రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న సీఆర్టీ, పీజీటీ పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ టీచర్లుగా గుర్తించాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
గంజాయి మత్తులో తమ 16 ఏళ్ల కుమారుడిని హత్య చేశారని, నిందితులను శిక్షించడంతోపాటు ఏ ఆధారంలేని తమకు ఆర్థిక సాయంచేసి ఆదుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా రామగోపాలపురానికి చెందిన అజ్మీర లక్ష్మణ్ కోరారు. 2016-18 మధ్య పీజీ పూర్తిచేసిన తనకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక సర్టిఫికెట్లు కాలేజీలోనే నిలిచిపోయాయని, సర్టిఫికెట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ వాంబే కాలనీకి చెందిన కె మాధవి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొత్తపల్లిలో తమ అరెకరం పొలాన్ని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు కబ్జా చేశారని, కబ్జాదారులపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మంత్రి లోకేష్‌ను వాసిరెడ్డి సూర్యప్రసాద్ కోరారు. వృద్ధాప్యంలో ఉన్న తాము చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అద్దెఇంట్లో ఉంటున్న తమకు శాశ్వత నివాస వసతి కల్పించి ఆదుకోవాలని విజయవాడకు చెందిన ఎమ్ శాఖిరి విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.