- వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణంపై దృష్టి
- స్వచ్ఛాంధ్ర పనుల్లో జాప్యం వద్దు
- స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): కాలుష్యం తగ్గించడం.. స్వచ్ఛతను పెంచడం… వ్యర్థాలను సద్వినియోగం చేసుకుని సర్కులర్ ఎకానమీ దిశగా అడుగులు వేయడమనే అంశాలు నిరంతర ప్రక్రియగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో భాగంగా చేపట్టే వివిధ కార్యక్రమాలు.. పనులను సీఎం సమీక్షించారు. “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాలుష్యాన్ని తగ్గించేందుకు.. స్వచ్ఛత పాటించేందుకు పెద్ద పీట వేశాం. ప్రతీ నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంచుతున్నాం. నెట్ జీరో, సర్కులర్ ఎకానమీ వంటి అంశాలపై దృష్టి సారించాం. దీంట్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టళ్లు, స్కూళ్లు, అంగన్‌వాడీ వంటి కేంద్రాల్లో ఈ అంశాలకు పెద్ద పీట వేస్తున్నా”మని సీఎం చెప్పారు.
కాలుష్యం తగ్గించడంతోపాటు.. ఖర్చులను కూడా తగ్గించుకునేలా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇండక్షన్ స్టవ్‌లు ఇస్తున్నామని… ఇప్పటికే మొదటి దశలో పట్టణ ప్రాంతాల్లో 11,400 ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేశామని సీఎం చెప్పారు. ఈ నెలాఖరులోగా మిగిలిన 44,346 అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇండక్షన్ స్టవ్‌లవల్ల నెలకు రూ.247 మేర ఆదా అవుతోందని సీఎం చెప్పారు. వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణం విషయంలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న విశాఖ, గుంటూరు ప్లాంట్ల పనితీరుపై సీఎం ఆరా తీశారు. కడప, కర్నూలు జిల్లాల్లో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు శనివారం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు. తిరుపతి, నెల్లూరు, కాకినాడ విజయవాడలలోని వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణ ప్రారంభ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఈ-ఆటోలు, కాంపాక్టర్స్, స్వీపింగ్ మిషన్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.
వచ్చే నెలాఖరులోగా ఈ-ఆటోలను, అక్టోబర్ నెలాఖరులోగా కాంపాక్టర్లను, స్వీపింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మిద్దె తోటల విధానాన్ని ప్రొత్సహించాలని సీఎం అధికారులకు సూచించారు. గోబర్డన్ ప్లాంట్లు.. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లవంటి వాటి నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని స్పష్టం చేశారు. లెగసీ వేస్ట్ తొలగింపులో లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని నిర్దేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 33 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పనులు ప్రారంభమయ్యాయని.. మరో 148 ఎస్టీపీల పనులు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు, అక్టోబరు మాసాల్లో ఎస్టీపీ ప్లాంట్లను అందుబాటులోకి తేవాలని సీఎం నిర్దేశించారు. మేజిక్ డ్రెయిన్లను లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం, కాకినాడ, విజయనగరం, అనంతపురం, పిడుగురాళ్ల, వినుకొండ, మచిలీపట్నంలలో పనులు ముమ్మరంగా జరిగాయని అధికారులు సీఎంకు తెలియచేశారు. సమావేశంలో మంత్రి నారాయణ వర్చువల్‌గా పాల్గొన్నారు. పురపాలక శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.















