- వికసిత్ ఆంధ్ర సాధనకు ప్రభుత్వ ప్రాధాన్యతలు
- త్వరలో ది బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ తెస్తున్నాం
- పాలసీ రూపకల్పనలో సలహాలు, సూచనల స్వీకరణ
- పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు
- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తగు ప్రోత్సాహం
- సమర్థవంతంగా సింగిల్ విండో పాలసీ అమలు
- యువతలో ఉపాధి నైపుణ్యాలు పెంచేలా కరికులమ్
- టెక్నాలజీని అందిపుచ్చుకునేలా శిక్షణకు చర్యలు
అమరావతి (చైతన్య రథం): వికసిత్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీ పాలసీ రూపొందించనున్నట్టు రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ సాధికారత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడిరచారు. నూతన ఇండస్ట్రీ పాలసీ రూపకల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ, సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో స్టేక్ హోల్డర్స్ సమావేశం విజయవాడలో బుధవారం జరిగింది. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ వర్చువల్‌గా తన సందేశాన్ని అందించారు. స్టేక్‌హోల్డర్స్ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తుండటం శుభసూచకమన్నారు.
పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతామని ప్రకటిస్తూ.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఊతమిస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. సింగిల్‌విండో పాలసీని సమర్థవంతంగా అమలు చేస్తామని, అందులో భాగంగా నెలకు రెండుసార్లు సమావేశాలు నిర్వహించి దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోరంగం, బయోటెక్ రంగాలతోపాటు అన్ని రంగాలకు ప్రాధాన్యత కల్పించి ఏపీని పారిశ్రామిక రంగంలో దేశంలోనే టాప్‌గా నిలబెట్టాలన్న లక్ష్యంతో ముందు సాగుతున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడిరచారు.
పెద్దసంఖ్యలోవున్న ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లే రాష్ట్రబలంగా పేర్కొంటూ.. వారికి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంచి స్థానికంగా ఉపాధి కల్పించడమే ధ్యేయమని మంత్రి వివరించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు యూనివర్శిటీలతో, కాలేజీలతో మాట్లాడి ఉపాధికి అనుకూలమైన కరికులమ్ పొందుపర్చే చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామిక నైపుణ్యాలు కలిగిన యువత తక్కువగా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉపధి నైపుణ్యాలను అందింపుచ్చుకునేలా యువతకు తర్ఫీదునిస్తే, ఇక్కడే మంచి ఉద్యోగాలు సాధిస్తారన్నారు. నూతన ఇండస్ట్రీ పాలసీ రూపకల్పనకు సూచనలు, సలహాలు అందించాలనుకునేవారు ఈ`మెయిల్, పోస్ట్ ద్వారా కూడా తమదృష్టికి తేవొచ్చన్నారు.
వంద రోజుల ప్రణాళికలో భాగంగా నూతన ఇండస్ట్రీ పాలసీ కూడా సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్‌కు మొదటి అడుగుగా నూతన ఇండస్ట్రీ పాలసీ ఉండబోతోందని, దేశంలోనే పారిశ్రామికంగా ముందున్న ఐదు రాష్ట్రాల ఇండస్ట్రీల పాలసీలను స్టడీ చేసి మన రాష్ట్రాంలో వాటి ఫలితాలు ఎలా ఉంటాయని పరిశీలించి బెస్ట్ పాలసీని అందించనున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
మెడ్‌టెక్ పార్క్ తరహాలోనే రాష్ట్రంలో మరిన్ని సెక్టార్ బేస్డ్ ఇండస్ట్రీ పార్క్‌లను అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ ఇండస్ట్రీస్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. నేటి స్పీడ్ యుగంలో రోజురోజుకూ టెక్నాలజీ మారిపోతుందని, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆ నైపుణ్యాలు మన యువతకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం (పీ`4) తో అద్భుతాలు సృష్టించవచ్చని, ఎంఎస్‌ఎంఈల స్థాపనతో స్థానిక యువతకు పెద్దసంఖ్యలో ఉపాధి లభిస్తుందన్నారు. ఎంఎస్‌ఎంఈల స్థాపనకు ప్రత్యేకంగా కృషి చేస్తామన్నారు. టెక్స్‌టైల్ రంగంలో పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి, ఉద్యోగకల్పన జరుగుతుందని మంత్రి వివరించారు.
పరిశ్రమల మంత్రి టీజీ భరత్ వర్చువల్‌గా స్టేక్‌హోల్డర్స్‌తో మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితమే సీఎం చంద్రబాబు ఒక సీఈవోలా పనిచేసి రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారించారని, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించడంతో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు, కంపెనీలు తరలివచ్చాయని గుర్తుచేశారు. కొత్త ఇండస్ట్రీ పాలసీని వంద రోజుల ప్రణాళికలో భాగంగా సెప్టెంబర్‌లో తీసుకొస్తున్నట్టు చెప్పారు. నూతన ఇండస్ట్రీపాలసీ బెస్ట్‌గా ఉండేవిధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాలసీ రూపొందించడంలో పెట్టుబడులే లక్ష్యంగా ముందకు వెళుతున్నామని, పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పిస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు, విద్యుత్, నీరు తదితర మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి మంత్రి భరత్ తెలిపారు.
సమవేశంలో పాల్గొన్న స్టేక్‌హోల్డర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారి సూచనలు, సలహాలను ఖచ్చితంగా స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. అలాగే స్టేక్‌హోల్డర్స్ సమస్యలను విన్నవించగా వాటిని పరిష్కరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె సునీత, ఇండస్ట్రీస్ శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, పరిశ్రమల వాణిజ్య శాఖ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్, చేనేత, జౌళి శాఖ కమిషనర్ జి రేఖారాణి, సీఐఐ ఏపీ ఛైర్మన్ వి మురళీకృష్ణ, సీఐఐ ఏపీ మాజీ ఛైర్మన్ జెఎస్‌ఆర్కె ప్రసాద్, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ అభిషేక్ కిషోర్, స్టేక్‌హోల్డర్స్ పాల్గొన్నారు.