అమరావతి: అధికారమదం తలకెక్కిన వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలోనే పాపాలకు పాల్పడుతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. చేసిన పాపాలు పోవాలని, సన్మార్గంలో నడిచేలా దీవించాలని భక్తులంతా శ్రీకాళహస్తీశ్వర స్వామిని వేడుకుంటారు.. అయితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాత్రం బరితెగించి సాక్షాత్తూ స్వామివారి సన్నిధిలోనే ఘోరాలు చేస్తున్నాడు.. స్వామి, అమ్మవార్లకే అపచారం తలపెడుతున్నాడని ఒక ప్రకటనలో లోకేష్ విమర్శించారు. పురాతన శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకి నైవేద్యాలు తయారుచేసే గది, మృత్యుంజయ పూజలు నిర్వహించే ప్రదేశంలో వేల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాలను కూల్చేయిస్తున్నాడు. పురావస్తు, దేవాదాయ శాఖ నిబంధనలు పట్టించుకోకుండా, వీఐపీల ఆశీర్వాదాల కోసం శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చారిత్రక, పురాతన, ఆధ్యాత్మిక సంపద ధ్వంసం చేయడం నిబంధనలకు విరుద్ధమే కాదు, పాపం కూడా. శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలకు కారకులపై చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.