- భీతిగొలిపే సెక్షన్లతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
- వివాదాలను సృష్టించి పేదల ఆస్తులను కొట్టేసేందుకు కుట్ర
- టీఆర్వోలకు సర్వాధికారులు… సివిల్ కోర్టులకు వెళ్లకుండా చేసిన వైనం
- టీఆర్వోలుగా ఎవరినైనా నియమించేలా చట్టం
- సొంతవారినే టీఆర్వోలుగా నియమించుకుని భూములు కొట్టేసే కుట్ర
అమరావతి(చైతన్యరథం): భూ వివాదాలు సృష్టించి భూములను కొట్టేసేందుకు, బ్లాక్‌మనీతో కొన్న భూములను చట్టబద్ధం చేసుకునేందుకు జగన్ రెడ్డి, జే గ్యాంగ్ కొత్త చట్టాన్ని తీసుకు వచ్చి రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ గత ఏడాది యాక్ట్ నెంబర్ 17 పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందన్నారు. అది ప్రజలకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వ చేతుల్లోకి తీసుకు వెళ్లే చట్టం అన్నారు. ఈ చట్టం తేవడంతో భూములకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా సివిల్ కోర్టుకు వెళ్లే అవకాశం లేదన్నారు. ఏ సమస్య ఉన్నా టీఆర్వో( టైటిల్ రిజస్ట్రేషన్ ఆఫీసర్) దగ్గరకు వెళ్లమని ఈ చట్టం చెబుతోంది. మరో వైపు అధికార పార్టీకి నచ్చిన ఏ వ్యక్తినైనా టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా నియమించుకోవచ్చని కూడా చెబుతోందని జీవీ రెడ్డి తెలిపారు.
అధికారపార్టీ వాళ్లకే టీఆర్వో పదవి
ఏ మాత్రం అర్హత లేకపోయినా వైసీపీతో అంటకాగి తిరిగినవాళ్లకు ఇష్టం వచ్చినట్లు సలహాదారులుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, ఇతర కీలక పదవులు కట్టబెట్టినట్లుగానే టీఆర్వో పదవిలో కూడా అధికార పార్టీకి అనుకూలమైన వ్యక్తిని నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పదవి చాలా కీలకమైనది. భూపరమైన ఏ సమస్య వచ్చినా ఆ ఆఫీిసర్ దగ్గరకే వెళ్లాలి. సెక్షన్ 5 ప్రకారం వైసీపీ అనుకూలంగా ఉన్న వ్యక్తికి టైటిలింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు అప్పగిస్తే.. ఇటు పేదలకు అటు ప్రతిపక్ష పార్టీలకు చెందినవారికి న్యాయం జరుగదు. భూములను కబ్జా చేసేందుకు వైసీపీ నేతలే లేని వివాదాలను సృష్టించి, వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారి(టీఆర్వో) దగ్గరకు వెళ్లినా దాన్ని తేల్చకుండా సెటిల్మెంట్ పేరుతో దండుకోవడానికి వైసీపీ నేతలు చేస్తున్న కుట్ర ఇది. బాధితులు సివిల్ కోర్టుకు వెళ్లకుండా చేశారు. సామాన్య ప్రజలు నేరుగా హైకోర్టుకు వెళ్లగలరా? ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన అని జీవీ రెడ్డి దుయ్యబట్టారు.
చాలా దారుణమైన సెక్షన్లు
టైటిల్ రిజిస్టర్, డిస్ప్యూట్ రిజిస్టర్ అని పెట్టారు. ఒక్కసారి ఏదైనా భూమి డిస్ప్యూట్ రిజిస్టర్ లోకి ఎక్కితే ఇక ఆ భూ యజమాని ఆ టీఆర్వో అధికారి చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే. ఆ భూమి తనదే అని అతనే నిరూపించుకోవాలి. ఈ చట్టంలోని 19,20,21 సెక్షన్లు చాలా దారుణంగా ఉన్నాయి. సెక్షన్ 18 ప్రకారం రాష్ట్రంలో భూ వివాదంలో ఉన్న ఏ కేసు అయినా కచ్చితంగా 3 నెలల్లో ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా, జైలు శిక్ష వేస్తారంట. అంతే కాకుండా ఆ భూమిని ఇక టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయరు. సెక్షన్ 19 ప్రకారం ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు జరిగినా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఆరు నెలలు జైలు శిక్ష వేస్తారని ఈ సెక్షన్ చెబుతోంది. సెక్షన్ 20 ప్రకారం బ్యాంకుల్లో భూములు తాకట్టు పెట్టిన వివరాలు కూడా టైటిలింగ్ టీఆర్‌వోకు మూడు నెలల్లో చెప్పాలి. సెక్షన్ 21 ప్రకారం రాష్ట్రంలో ఉన్న కంపెనీలు బ్యాంకుల్లో ఏ ఆస్తి తాకట్టు పెట్టినా టీఆర్‌వోకు చెప్పాలి. ఏ లావాదేవీ జరిగినా టీఆర్‌వోకు తెలియజేయాలని ఉందని జీవీ రెడ్డి చెప్పారు.
భూములు కొట్టేసేందుకే
వైసీపీ నేతలు బ్లాక్‌మనీతో కొనుగోలు చేసిన భూములను చట్టబద్ధం చేడానికి, పేదల భూములు లాక్కోవడానికి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఉన్న వైసీపీ గూండాలు భూ వివాదాలు సృష్టించి భూములను కొట్టేసేందుకే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తీసుకు వచ్చారు. మరో వైపు దీన్ని ఇప్పటికిప్పుడు అమలు చేయడం లేదని, అసలు ఇది రాష్ట్రం చేసిన చట్టం కాదని, కేంద్ర రూపొందించిన చట్టం అని రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడటం సిగ్గుచేటు. ఇది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని సెక్షన్ 1 స్పష్టంగా చెబుతున్నా మళ్లీ దాన్ని కేంద్రంపైకి నెట్టాలనుకోవడం ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడమే. అది కేంద్ర పరిధిలోని చట్టం అయితే దాన్ని అమలు చేయడానికి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అధికారం ఉంటుందని జీవీ రెడ్డి ప్రశ్నించారు.
ఈ చట్టం సోమవారం నుండి అమల్లోకి వచ్చింది. ఇక వైసీపీ నేతలు భూ వివాదాలు సృష్టించి ఆ భూములను కాజేసే పనిలో ఉంటారు. ఈ చట్టంతో ఎక్కువగా ఎన్నారైలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, పేదలు, రైతులు నష్టపోతారు. వివాదం వచ్చిన తరువాత రెండు సంవత్సరాల్లో భూమి తనదేనని యజమాని నిరూపించుకోలేకపోతే, ఆ భూమి తనదేనంటూ వివాదం సృష్టించిన వ్యక్తికే టీఆర్వో భూమిపై హక్కులు కల్పిస్తారు. భూ యజమానులు ఇక ఏమి చేయలేని పరిస్థితి వస్తుందని జీవీ రెడ్డి అన్నారు.