అమరావతి : భవిష్యత్ గ్యారెంటీ బాబు ష్యూరిటీ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక జగన్ రెడ్డి, ఆయన గుమాస్తా సజ్జల అవాకులు, చెవాకులు పేలుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘ప్రజల డేటా వైసీపీ చోరీ చేస్తూ టీడీపీపై ఆరోపణలు చేయటం సిగ్గుమాలిన చర్య. భవిష్యత్తుకు గ్యారెంటీ ద్వారా టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందించే సంక్షేమం గురించి ప్రజలు చెప్తుంటే జగన్ రెడ్డి, సజ్జలకు భయమెందుకు? అన్నదాత పధకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20 వేల ఆర్దిక సాయం చేస్తామంటే మీకు వచ్చిన నొప్పేంటి? జగన్ రెడ్డి రైతు భరోసా కింద ఏడాదికి రూ. 13,500 ఇస్తామని చెప్పి కేవలం రూ. 7500 ఇస్తున్నారు, అది కౌలు రైతులకు వర్తింపజేయటం లేదు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళకు ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ నెలకు రూ. 1500 చొప్పున ఏడాదికి రూ. 18 వేలిస్తామంటే మీకు వచ్చిన భాధేంటి? ఇంట్లో ఎంతమంది విద్యార్దులున్నా ఒక్కొక్కరికి అమ్మఒడి రూ. 15 వేలు అని జగన్ రెడ్డి ఒక్కరికే పరిమితం చేశారు. అది కూడా రూ. 14 వేలు, 13 వేలే ఇస్తున్నారు. తల్లికి వంధనం పధకం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్దులు చదువుకుంటున్నా ఒక్కొక్కరికి ఏడాది రూ. 15 వేలిస్తామంటే మీకు బెదురెందుకు? వైసీపీ పాలనలో విపరీతంగా నిత్యవసర ధరలు పెంచారు, గ్యాస్ ధర రూ. 1200 పైనే ఉంది, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్త్తాం, పేదవాడి వాహనం ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామంటే మీకు వచ్చిన ఇబ్బందేంటో చెప్పాలి. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ప్రతి ఏటా మెగాడీఎస్సీ అని మాట తప్పి మడమ తిప్పి నిరుద్యోగులను జగన్ రెడ్డి వంచించారు.
పరిశ్రమలు, పెట్టుబడులు తరిమేశారు. యువగళం పధకం ద్వారా ప్రతి నిరుద్యోగికి నెలకు రూ. 3 వేల చొప్పున ఏడాదికి రూ. 36 వేలు ఇస్తామంటే మీకు వచ్చిన సమస్య ఏంటి? టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. జనాభాలో సగం ఉన్న బీసీలు వైసీపీ పాలనలో అన్ని విధాల అన్యాయాలకు గురవుతున్నారు. బీసీలకు 34 శాతం ఉన్న రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీసీలకు 16800 రాజ్యాంగ బద్ద పదవుల్ని దూరం చేసిన బీసీ ద్రోహి జగన్ రెడ్డి. చరిత్రలో ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు, ఆధరణ పధకం నిలిపేశారు. బీసీల రక్షణ చట్టం తెస్తామంటే జగన్ రెడ్డి, సజ్జలకు వచ్చిన సమస్య ఏంటో చెప్పాలి. పూర్ టు రిచ్ పధకం కింద పేదల్ని ధనికుల్ని చేసే పధకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
భవిష్యత్ గ్యారెంటీ ద్వారా వ్యక్తిగత వివరాలు తీసుకోవడం లేదు
భవిష్యత్తు గ్యారెంటీ ద్వారా ఇంట్లో ఏ వయస్సు వారు ఎంతమంది ఉన్నారో, వారికి ఏ సంక్షేమ పధకాలు అందిస్తామో మాత్రమే చెప్తున్నాం. తప్ప వ్యక్తిగత వివరాలు తీసుకోవటం లేదు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామని చంద్రబాబు, పవన్ సంతకాలతో కూడిన బాండ్లు అందిస్తున్నాం. ఇదంతా పారదర్శంగా డిజిటల్ గా అప్లోడ్ చేస్తున్నాం, ఇందులో తప్పేంటో జగన్ రెడ్డి, సజ్జల చెప్పాలి? 2024లో టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బాండ్లు రిజిష్ట్రేషన్ చేసుకున్న వారి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేయటం జరుగుతుంది. వైసీపీ పాలనలో నిత్యవసర ధరలు, పెట్రోల్, గ్యాస్, డీజీల్, ఆర్టీసీ రేట్లు పెంచారు, డ్రైనేజీ, చెత్త పన్ను వంటి వాటితో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెప్త్తున్నారు. 300 యూనిట్లు విద్యుత్ వినియోగం దాటిందని, కారు ఉందని, హౌస్ మ్యాపింగ్ చూపించటం లేదని ఫించన్లు, రేషన్ కార్డులు తొలగించారని ప్రజలు మా వద్ద వాపోతున్నారు, పండుగ కానుకలు, అన్న క్యాంటీన్ వంటి సంక్షేమ పధకాలు జగన్ రెడ్డి రద్దు చేశారు.
నాలుగున్నరేళ్లలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు సమస్యలు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ గ్యారెంటీ మ్యానిఫెస్టో రూపోందించాం. టీడీపీ జనసేన మిని మ్యానిఫెస్టోకే వైసీపీ నేతలు భయపడితే పూర్తి మ్యానిపెస్టో వస్తే వైసీపీ నేతలు రాష్ట్రం వదలి పారిపోతారు. పేదలకు పెత్తందారులకు మద్య యుద్దం అని జగన్ మాట్లాడటం విడ్డూరం. దేశంలోని 29 ముఖ్యమంత్రుల్లో జగన్ రెడ్డి అత్యంత ధనవంతుడు, 28 మంది ముఖ్యమంత్రుల ఆస్తులు కలిపినా జగన్ ఆస్తులకు సరిపడవు. జగన్ రెడ్డి అబద్దాల పుట్ట, టీడీపీ మ్యానిఫెస్టో వెబ్ సైట్లో తొలగించామనేది పూర్తిగా అబద్దంగా, సీఈవో ఆంధ్ర వెబ్ సైట్లో ఇప్పటికీ ఉంది. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఆ అబద్దాలను కొనసాగిస్తూ ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ రెడ్డిది మోసకారి సంక్షేమం. పైన బటన్ నొక్కి రూ. 10 ఇచ్చి కింద బటన్ నొక్కి రూ. 100 లాక్కుంటున్నారని ప్రజలే చెప్తున్నారు. జగన్ ని ఎప్పుడూ గద్దె దింపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
వైసీపీ మ్యానిఫెస్టోను అమలు చేసింది కేవలం 15 శాతం మాత్రమే. ప్రత్యేక హోదా, జాబ్ క్యాలెండర్, సీపీఎస్ రద్దు, కాపు కార్పోరేషన్ కి ఏడాది రూ. 2 వేల కోట్లు హామీలు ఏమయ్యాయో జగన్ సమాధానం చెప్పాలి. 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు కడతామని అన్నారు, నాలుగున్నరేళ్లలో కనీసం 2 లక్షల ఇళ్లు కూడ కట్టలేదని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. మద్య నిషేదం అని మద్యంపై వచ్చే ఆదాయాన్ని 15 ఏళ్లకు తాకట్టు పెట్టి రూ. 38 వేల కోట్లు అప్పులు తెచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన జగన్ రెడ్డికి, వైసీపీ నేతలకు భవిష్యత్ గ్యారెంటీపై మాట్లాడే హక్కు లేదు. గడగడపకు వైసీపీ కార్యక్రమంలో మహిళలు వైసీపీ నేతల్ని చీపుళ్లతో కొడుతున్నారు, వైసీపీ మంత్రుల ముఖాలపై ప్రజలు తలుపులు వేస్తున్నారు. ప్రజలకు భద్రత, భరోసా ఇచ్చేందుకే బాబు ష్యూరిటీ భవిష్యత్ కి గ్యారెంటీ కార్యక్రమం ఇది వైసీపీకి ఎందుకు తప్పుగా కనపుడుతుందో సమాధానం చెప్పాలి’’ అని రామానాయుడు నిలదీశారు.