- 58 నెలల జగన్ రెడ్డి పాలన మొత్తం దోపిడీలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, విధ్వంసం, వంచనే
- జగన్ రెడ్డి పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదు. ఆయన్ని నమ్ముకున్న కొద్దిమంది రెడ్లు తప్ప
- బీసీల రిజర్వేషన్లలో కోత పెట్టారు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లించారు
- ఎస్సీ, ఎస్టీలపైనే అట్రాసిటీ కేసులు, వారిపై అఘాయిత్యాలు, హత్యలు
- రైతుల ఆత్మహత్యల్లో, మహిళలపై దురాగతాల్లో అగ్రస్థానం
అమరావతి: దోపిడీ, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, వంచనకు మారుపేరైన జగన్ రెడ్డి 58 నెలల పాలనలో ప్రజల్ని నయవంచనకు గురిచేశాడని, అధికారం కోసం ముద్దులు పెట్టిన వ్యక్తి, ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల్ని పిడిగుద్దులు గుద్దుతున్నాడని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ విమర్శించారు. పన్నులు, అప్పులు పెంచి, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి తలపై రూ.8 లక్షల భారం మోపాడని, జగన్ రెడ్డి హయాంలో పేదల పరిస్థితి దిగజారిపోయి, మరింత పేదలుగా తయారయ్యారని దుయ్యబట్టారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, చెత్తపై పన్ను, ఇతరపన్నులు, నిత్యావసర ధరలు, పెట్రోల్.. డీజిల్ ధరల పెంపు, వాహనాల పన్ను పెంపు వంటివి జగన్ రెడ్డి హయాంలోనే అధికంగా ఉన్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని పన్నులు, ఛార్జీల భారం ఏపీ ప్రజలపైనే పడిరదంటే దానికి కారణం జగన్ రెడ్డి. మరోవైపు జగన్ పాలనలో వ్యవసాయదారుల పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు పండిరచే పంటలకు గిట్టుబాటు ధరలేదు. ప్రకృతి విపత్తులు, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలేక, పెట్టుబడులు పెరిగి నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి ఈ 58 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జగన్ రెడ్డి హయాంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కౌలురైతుల ఆత్మహత్యల్లో దేశంలో రెండోస్థానంలో ఉంటే, రైతు ఆత్మహత్యల్లో మూడోస్థానంలో ఉంది. తన ప్రభుత్వం రైతు ప్రభుత్వమని చెప్పుకునే జగన్ రెడ్డి సాధించిన ఘనత ఇదే. అలానే రైతులపై అప్పులు భారం కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువ అని శ్రావణ్ కుమార్ అన్నారు.
ఇసుకను దోపీడీ వనరుగా మార్చుకున్న జగన్
టీడీపీ ప్రభుత్వం ఉచితంగా అందించిన ఇసుకను జగన్ రెడ్డి తన దోపిడీ వనరుగా మార్చుకున్నాడు. జగన్ దోపిడీతో భవననిర్మాణ రంగం, దాని అనుబంధ రంగాల కార్మికులు పనిలేక, పూటగడవక అల్లాడిపోతున్నారు. సంక్షేమం ముసుగులో జగన్ రెడ్డి రూ.8లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చాడు. బటన్ నొక్కుడు పేరుతో ప్రజలకు ఇచ్చింది రూ.2.50 లక్షలకోట్లు అయితే, మిగిలిన రూ.5.50 లక్షల కోట్ల సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ముఖ్యమంత్రే చెప్పాలి. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పి, రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారిస్తూ, 30 లక్షల మంది మందుబాబుల్ని ఆసుపత్రుల పాలు చేశాడు. అమ్మఒడి ముసుగులో అరకొర సాయం చేస్తూ నాన్న బుడ్డి ద్వారా జగన్ రెడ్డి ఒక్కో కుటుంబం నుంచి ఏటా రూ.75వేలు రాబడుతున్నాడు. జగన్ రెడ్ది పాలనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, డ్రైవర్లు, కార్మికులు, మహిళలు, యువత, నిరుద్యోగులు ఇలా ఎవరూ సంతోషంగా లేరన్నది వాస్తవం. సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని వంచించాడు. ఆఖరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని దుస్థితికి వచ్చాడు. పోలీస్ శాఖకు ఇవ్వాల్సిన చెల్లింపులు కూడా నిలిపివేశాడని శ్రావణ్ కుమార్ విమర్శించారు.
ఈ ప్రభుత్వంలో కొద్దిమంది రెడ్లు మాత్రమే బాగుపడ్డారు
మరోపక్క వైసీపీ నేతలు అధికార మదంతో దళితులు, బీసీలను దారణంగా చంపేస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు నిత్యం ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతికే దుస్థితి కల్పించాడు జగన్ రెడ్డి. చివరికి వారి ఆస్తులు కూడా లాక్కుంటూ వైసీపీ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన 120కి పైగా సంక్షేమ పథకాల్ని రద్దుచేశాడు. తెలుగుదేశం పార్టీ స్థానికసంస్థల్లో బీసీలకు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించాడు. కులగణన పేరుతో బీసీల్ని వంచిస్తున్నాడు. జగన్ రెడ్డి పాలనలో అధికారం అనుభవిస్తున్నది అతని సామాజికవర్గం అయితే, బీసీ..ఎస్సీ..ఎస్టీలు కేవలం బాధిత వర్గాలుగానే మిగిలి పోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి కొద్దిమంది రెడ్లే ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందారు, సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్న రెడ్లు ఎవరైనా ఉంటే, వారు జగన్ రెడ్డి వ్యాపార భాగస్వాములో, లేక సాక్షిలో పనిచేసిన వారో, లేక జగన్ బంధువులో అయి ఉండాలి. అలాంటి వారిలో కూడా కొందరికి ఏడుపే మిగిలింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ మంత్రులు ఈ ప్రభుత్వంలో తమకు జరిగిన అవమానాలు దిగమింగి, సిగ్గులేకుండా సామాజిక సాధికార యాత్ర చేస్తున్నారని శ్రావణ్ కుమార్ మండిపడ్డారు.
రూ.40వేల కోట్ల విలువైన మైనారిటీల ఆస్తుల్ని స్వాహా చేశారు
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నిజమైన సంక్షేమం కోరుకుంటున్నారు గానీ, జగన్ రెడ్డి అందించే మోసకారి సంక్షేమాన్ని కాదు. టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన పెళ్లి కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, చంద్రన్న బీమా, విదేశీవిద్య లాంటి పథకాలు ఏమయ్యాయో జగన్ రెడ్డి చెప్పాలి. వైసీపీ ప్రభుత్వంలోనే బీసీలు, ఎస్టీలు, ఎస్సీల భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయి. మైనారిటీలకు చెందిన వక్ఫ్ భూముల్ని వైసీపీ నేతలు స్వాహా చేశారు. జగన్ రెడ్డి, వైసీపీ నేతలు రూ.40వేల కోట్ల విలువైన మైనారిటీల ఆస్తుల్ని దోచుకున్నారు. దుల్హన్ పథకాన్ని రద్దుచేయడానికే జగన్ రెడ్డి అర్థం పర్థం లేని నిబంధనలు పెట్టాడు. రంజాన్ తోఫా, దుకాన్ మకాన్ వంటి పథకాలు రద్దుచేశాడు. చంద్రబాబు మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేస్తే, జగన్ రెడ్డి వచ్చాక వారిని కేవలం తన సభలకు వినియోగించుకుంటూ వంచించాడు. డ్వాక్రా రుణపరిమితిని రూ.10 లక్షలకు పెంచుతానని, వడ్డీలేని రుణం ఇస్తానని మాయ మాటలు చెప్పి డ్వాక్రా మహిళల్ని మోసగించాడు. జగన్ రెడ్డిని నమ్మి మోసపోయామని అంగన్ వాడీలు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు. ఇలాంటి మోసగాడిని, వంచకుడిని ఏంచేయాలో ప్రజలే ఆలోచించుకోవాలి. ప్రజల్నే కాకుండా తన కటుంబసభ్యుల్ని, సొంతపార్టీ వారిని కూడా జగన్ రెడ్డి అవసరానికి వాడుకొని వదిలేశాడనే నిజాన్ని ప్రజలు గ్రహించాలని శ్రావణ్ కుమార్ అన్నారు.