- జలగన్న కళ్లల్లో ఆనందం చూడటమే వారి లక్ష్యం
- రూల్ ఆఫ్ లా కు పాతరేస్తున్న ఐపిఎస్ లు
- ఇన్వెస్టిగేషన్ వింతపోకడలు
- రాష్ట్రంలో మహిళలు, సామాన్యులకు రక్షణ కరువు
- అధికారపార్టీ ఎంతకు బరితెగించినా నో యాక్షన్
- అదేమని ప్రశ్నించిన గళాలపై ఉక్కుపాదం
- వ్యవస్థకే తలవంపులు తెస్తున్న పోలీసు బాసులు
- పోలీసు పెద్దల వ్యవహార శైలితో జనం విస్మయం
- దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఎపి పోలీసుల తీరు
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
నిష్పాక్షికంగా, నిర్బయంగా, స్వతంత్రంగా పనిచేస్తూ ప్రజాస్వామ్య సౌదానికి రక్షణ కవచంగా నిలవాల్సిన ఐపిఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి సర్కారు వత్తిళ్లకు తలొగ్గి గతంలో ఎన్నడూ లేనివిధంగా వింతపోకడతో వ్యవహరిస్తున్న తీరు యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని విస్మయానికి గురిచేస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన పోలీసు బాసులు రూల్ ఆఫ్ లాకు పాతరేసి.. జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం చూడటమే లక్ష్యంగా పనిచేయడం రాష్ట్రప్రజలకు వెగటు పుట్టిస్తోంది. అడ్డగోలు పనులు చేసిన అధికార పార్టీ నాయక గణాన్ని కాపాడేందుకు ఇన్విస్టిగేషన్ లో వింతపోకడలకు శ్రీకారం చుట్టడంతో యావత్ రాష్ట్ర ప్రజానీకం విస్మయానికి గురవుతోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే గళాలపై తప్పుడు కేసులతో ఉక్కుపాదం మోపుతో గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు పనులు చేసిన అధికార పార్టీ పెద్దలను కాపాడేందుకు పోలీసు పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు, ఇస్తున్న స్టేట్ మెంట్లు ఐపిఎస్ వ్యవస్థ ప్రతిష్టను అధఃపాతాళానికి దిగజారుస్తున్నాయి. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు యావత్ భారతదేశంలో చర్చనీయాంశంగా మారింది.
ఫోరెన్సిక్ కు పంపకుండానే ఫకీరప్ప క్లీన్ చిట్
ఇటీవల ఒక మహిళతో సెల్ ఫోన్ వీడియో కాల్ లో మానవమృగంలా ప్రవర్తించి ఒంటిపై నూలుపోగు లేకుండా తప్పుడు పనిచేస్తూ అడ్డగోలుగా సోషల్ మీడియా చేతికి చిక్కిన ఎంపి గోరంట్ల మాధవ్ వ్యవహారంలో అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఇచ్చిన స్టేట్ మెంట్ రాష్ట్రంలో మహిళాలోకాన్ని తీవ్ర ఆందోళన, ఆవేదనకు గురిచేసింది. సంబంధిత వీడియో క్లిప్ ఒరిజినల్ కాదని, ఒరిజినల్ వీడియో దొరికేవరకు ఏమీ చెప్పలేమంటూ వారంరోజుల తర్వాత దాదాపు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఏదేని హత్య లేదా అవాంఛనీయ సంఘటన జరిగినపుడు దొరికిన సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి నిర్థారించుకోవడం పోలీసుల విధుల్లో భాగం. సంబంధిత వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కే పంపకుండా జిల్లా ఎస్పీ మాధవ్ ను తప్పించిన తీరు చూశాక రాష్ట్రంలో ఇక రూల్ ఆఫ్ లా అనేది మృగ్యమేనని తేలిపోయింది. మరో అడుగు ముందుకేసి ఎవరైనా ఫిర్యాదు ఇస్తే తప్ప ఎంపి ఫోన్ స్వాధీనం చేసుకోలేమని తమ నిస్సహాయతను వ్యక్తంచేశారు.
సుబ్రహ్మణ్యం కేసులో రవీంద్రబాబు కట్టుకథ
కాకినాడలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ రాక్షసుడిగా మారి డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హతమార్చి శవాన్ని ఆయన ఇంటికి డోర్ డెలివరీ చేస్తే తక్షణమే అరెస్టుచేయాల్సిన పోలీసులు మీనమేషాలు లెక్కించారు. మే 19వతేదీ రాత్రి సంఘటన జరిగితే.. ప్రతిపక్షాలు, దళిత సంఘాలు ఆందోళన చేయడంతో విధిలేని పరిస్థితుల్లో 23వతేదీ అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత ఆ జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఇచ్చిన స్టేట్ మెంట్ చూస్తే ఐపిఎస్ లు ఇంతలా దిగజారిపోయారా అనిపిస్తుంది. బాకీ విషయమై అనంతబాబు, సుబ్రహ్మణ్యం మధ్య వాగ్వివాదం జరిగింది… ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది.. తొలుత ఎమ్మెల్సీనే సుబ్రహ్మణ్యం తోసేసాడు..తర్వాత ఇద్దరి మధ్య తోపులాట జరిగి సుబ్రహ్మణ్యం ఐరన్ గ్రిల్స్ పై పడటంతో తలకు గాయమైంది.. ఆయనను విశాల హృదయంతో అనంతబాబు ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నంచేయగా మార్గమధ్యంలో మరణించాడని అక్కడి ఎస్పీ రవీంద్రబాబు అందమైన కట్టుకథను సినిమా స్టోరీ మాదిరి విన్పించారు. ఇది చూశాక రాష్ట్రంలో అధికారపార్టీ దాష్టీకానికి బలైపోయిన వారికి న్యాయం జరగడం కల్లేనని తేలిపోయింది. రిమాండ్ తర్వాత కూడా చార్జీషీటు వేయకుండా నిందితుడికి బెయిల్ వచ్చేందుకు పోలీసులు పడుతున్న తాపత్రయం చూస్తే ఒక కిరాతకుడ్ని కాపాడేందుకు పోలీసులు ఇంతలా దిగజారాలా అన్పిస్తోంది.
సినిమా డైరక్టర్ ను మించిపోయిన విజయారావు
మంత్రి కాకాణి గోవర్థన రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు చరమాంకానికి వచ్చిన దశలో సంబంధిత కేసు తాలూకు ఎవిడెన్సులు, పత్రాలు సాక్షాత్తు న్యాయస్థానం నుంచే చోరీకి గురైన ఘటనలో అక్కడ ఎస్పీ విజయారావు ఇచ్చిన స్టేట్ మెంట్ చూశాక ఆయన సినిమా డైరక్టర్ ను మించి కథ చెప్పారని యావత్ రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైంది. ఈ కేసులో నిందితులు కోర్టు కాంపౌండ్ లో ఇనుము దొంగతనానికి వెళ్లారు.. అక్కడ కుక్కలు మొరగడంతో భయపడి కోర్టు మొదటి అంతస్తుకు చేరుకున్నారు. కోర్టు లాకర్ లో విలువైన వస్తువులు ఉంటాయని భావించి బీరువా తాళాలు పగులగొట్టి అందులోనుంచి కాకాణి కేసు తాలూకు ఎవిడెన్స్ లు, పత్రాలు ఉన్న సంచిని దొంగిలించారు. ఇది ఎస్పీగారి చెప్పిన సినిమా స్టోరీ తాలూకు సారాంశం. తప్పుడు పనిచేసిన ఒక మంత్రిని కాపాడేందుకు సాక్షాత్తు ఒక ఐపిఎస్ అధికారి రంగంలోకి దిగి తన నోటిద్వారా ఈవిధమైన కట్టుకథలు చెప్పాలని ఆయన ఏ శిక్షణలో చెప్పారో ఆ భగవంతుడికే ఎరుక.
చంద్రయ్య చంపుతాడని తెలియడంతో
ప్రత్యర్థులు హత్యచేశారనన్న విశాల్ గున్ని
పల్నాడులో నరరూప రాక్షసుడిగా పేరొందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులు వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టిడిపి నేత తోట చంద్రయ్యను 13-1-2022న దారుణంగా హతమార్చారు. ఎస్పీ విశాల్ గున్నీ స్టేట్ మెంట్ ప్రకారం చంద్రయ్యకు, ఈ కేసులో ప్రధాన నిందితుడు చింతా శివరామయ్యకు మూడేళ్ల క్రితం సిమెంట్ విషయమై గొడవ జరిగింది. హత్య జరగడానికి నాలుగురోజుల ముందు గ్రామంలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన చంద్రయ్య బంధువులతో శివరామయ్యను చంపుతానని చెప్పాడు. ఆ విషయం శివరామయ్యకు తెలిసి తనే ముందుగా చందయ్యను చంపాలని భావించి ఆరుగురితో కలసి హత్యచేశాడని తమ విచారణలో తేలినట్లు ఎస్పీ విశాల్ గున్ని చక్కటి కథను అప్పట్లో మీడియాకు విన్పించారు. విశాల్ గున్నీ ఇచ్చిన స్టేట్ మెంట్ చూశాక రాష్ట్రంలో హంతకులు ఇటువంటి కథలు కూడా చెప్పి ఆత్మరక్షణకోసం చంపామని భయపడొచ్చన్న సరికొత్త మార్గాన్ని చూపారు. మంచి అధికారిగా పేరొందిన విశాల్ గున్నీ ఒక నరహంతకుడిని కాపాడేందుకు చేసిన సాహోసోపేతమైన నిర్ణయం ఆయనకున్న గత రికార్డులన్నింటిపైనా మాయనమచ్చగా నిలచింది.
జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం
ఎంపిపైనే సునీల్ కుమార్ థర్డ్ డిగ్రీ
ఇక రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒక ముఖ్యమంత్రి కళ్లలో ఆనందం చూడటం కోసం సిఐడి అడిషన్ డిజి సునీల్ కుమార్ ఏకంగా ఒక పార్లమెంటు సభ్యుడిపైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించి తమ ప్రియతమనేతకు లైవ్ లో చూపించిన తీరు యావత్ భారతదేశ ప్రజానీకం నివ్వెరపోయేలా చేసింది. విచారణ పేరుతో ఎంపిని హింసించిన తర్వాత వైద్య పరీక్షల్లో ఆ విషయాన్ని తొక్కిపట్టేందుకు చేసిన విన్యాసాలు అన్నీఇన్నీ కావు. ఛివరకు ఎంపి రఘురామకు సుప్రీంకోర్టు జోక్యంతో హైదరాబాద్ మిలటరీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఒక ఎంపి విషయంలో సునీల్ కుమార్ వ్యవహరించిన తీరు చూశాక ఇక సామాన్యుల విషయంలో ఆయన ఏవిధంగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కారణంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులనుంచి సామాన్య కార్యకర్త వరకు చిత్రహింసలకు గురిచేసిన తీరు చూశాక సునీల్ కుమార్ ఇండియన్ పోలీసు సర్వీసును జగన్ రెడ్డి పోలీసు సర్వీసుగా మార్చేశాడనంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి కళంకిత అధికారులను అడ్డంపెట్టుకొని వారి భుజాలపై తుపాకీపెట్టి ప్రత్యర్థులపై జగన్ రెడ్డి కక్షసాధిస్తున్న తీరు చూశాక ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతలు అధమస్థాయికి దిగజారాయని తేటతెల్లమైంది.
అయిదేళ్ల కోసం ఎన్నికైన ప్రభుత్వాలు ఈరోజు ఉండొచ్చు.. రేపు ఉండకపోవచ్చు.. కానీ ప్రజాస్వామ్య భారత్ లో వ్యవస్థలు శాశ్వతం. ఆ వ్యవస్థలు ప్రతిరూపాలుగా నిలవాల్సిన పోలీసు ఉన్నతాధికారులు అధికారపక్షానికి తొత్తులుగా మారి వ్యవహరిస్తున్న తీరు యావత్ ఐపిఎస్ వ్యవస్థకే మచ్చతెచ్చేలా ఉంది.