- కూల్చటమేగాని కట్టడం చేతగాని సైకో ముఖ్యమంత్రి
- ఉన్న భవనాలకు రంగులేసుకోవడం అభివృద్ధా?
- తనకు రాజప్రాసాదాలు.. పేదలకు పిచ్చుకగూళ్లు
- హైదరబాద్‌కంటే గొప్పగా రాజధాని నిర్మాణం మొదలెడితే.. విధ్వంసం చేశాడు
- చెప్పుకోడానికి ఏమీలేని.. ఏంచేయాలో తెలియని ముఖ్యమంత్రి
- ప్రజల పొలాలు, ఆస్తులు లాక్కోవడానికే చట్టం తెచ్చారు
- నడిపించే నాయకుడు కావాలా? నరరూప రాక్షసుడా?
- ఇంటింటా చర్చ జరగాలి.. గత రాయలసీమ తీర్పు తిరగబడాలి
- ముస్లింలు తెదేపాతోనే ఉన్నారు..
- నంద్యాల భారీ ప్రజాగళం సభలో చంద్రబాబు ఉద్ఘాటన
నంద్యాల (చైతన్య రథం): ప్రజలకు, రాష్ట్ర భవితకు అతి కీలకం కానున్న ఈ ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి.. ఎవరు ఏమిటో తెలుసుకుని రేపు ఓటు వేయాలని, నవ్యాంధ్రకు ముఖ్యమంత్రి జగన్ చెరనుంచి విముక్తి కలిగించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. శనివారం నంద్యాలలో జరిగిన భారీ ప్రజాగళం సభలో తానేమిటో, తన విలువలేమిటో, పేదల సంక్షేమం, అభివృద్ధిపట్ల తన నిబద్ధత, దృక్పథాలేమిటో ప్రజలకు తెలుసని అంటూ, గత ఐదేళ్లుగా జగన్‌రెడ్డి పాలనను ప్రజలు ప్రత్యక్షంగా చూసి అనుభవించారని.. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
2014`19 కాలంలో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అభివృద్ధిని అప్పటి ముఖ్యమంత్రిగా పరుగులెత్తిస్తే.. దాని ఫలితాలతో గత ఐదేళ్లుగా బటన్ నొక్కిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అభివృద్ధి జాడలేకుండా చేయటమే కాక, సంక్షేమాన్ని పూర్తిగా సంక్షోభంలో పడేసి ప్రజల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టాడని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరు కావాలి?
రానున్న ఐదేళ్లలో తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరటానికి ఎవరు కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. విధ్వంస పాలనా? లేక అభివృద్ధి పాలనా? సంక్షేమ పాలనా` సంక్షోభ పాలనా? ఉద్యోగాలా` గంజాయి, డ్రగ్సా? నడిపించే నాయకుడా నరరూప రాక్షసుడా? ప్రజలను గౌరవించే ముఖ్యమంత్రా `నియంతా? ప్రజల ఆస్తులకు రక్షణా వాటిని భక్షించే ల్యాండ్ గ్రాబింగ్ చట్టమా? గుంతలమయమైన రోడ్లా `సౌకర్యవంతమైన ప్రయాణమా? రూ.పదిచ్చి రూ.వంద దోచుకోవడమా `ఖర్చులు తగ్గించి ప్రజల ఆదాయం పెంచటమా? కరెంట్ చార్జీల నియంత్రణా `షాకులు కొట్టే బిల్లులా? ఉచిత ఇసుకా `ఇసుక మాఫియానా?.. ఏం కావాలో ప్రజలు నిర్ణయించుకునే సమయం వచ్చిందని.. గత ఐదేళ్ల అనుభవాలు రేపు ఓటు వేసే వరకూ ప్రజల మనస్సుల్లో మెదలుతూ ఉండాలని చంద్రబాబు సూచించారు.
నన్నే చంపుతామన్నారు.. ప్రజలొక లెక్కా?
నంద్యాల రాగానే సెప్టెంబర్ 9వ తారీఖు గుర్తొస్తుంది. ఇక్కడే చివరి మీటింగ్ పెట్టి తెల్లవారితే హైదరాబాద్ వెళ్లాలని రాత్రి బస చేశాను. కారణం చెప్పకుండా ఇక్కడే అరెస్ట్ చేశారు. ఎన్ని దొంగ కేసులు పెట్టినా భయపడలేదు. జైల్లో చంపుతామని బెదిరించారు. అయినా భయపడలేదు. మీ ప్రాణాలు, మీ ఆస్తులు కాపాడడానికి లా అండ్ ఆర్డర్‌ని సక్రమంగా నడిపించాను. తిరుపతి దగ్గర 24 క్లెమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే, ఆ ప్రమాదం నుంచే గెలిచి వచ్చిన నేను, సైకోకి భయపడతానా? అంటూ.. నాపట్లే అలా ప్రవర్తించిన జగన్ సర్కారు, సామాన్యుల విషయంలో ఎలా ప్రవర్తించగలదో అర్థం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల పాలన ఇదే తరహాలో సాగిందని వ్యాఖ్యానించారు. నా శ్వాస ఉన్నంత వరకు తెలుగు జాతికోసం, మీ బిడ్డల భవిష్యత్తుకోసం, పేదవాళ్ల కోసమే పనిచేస్తానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్‌ను తీర్చిదిద్దిన అనుభవముంది. విభజిత రాష్ట్రం కుప్పకూలిపోకుండా నిలబెట్టుకోగలిగే సామర్థ్యం ఉంది. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలనన్న నమ్మకముంది. అద్భుతాన్ని ఆవిష్కరించగలనన్న నమ్మకంతో కూటమిని గెలిపించండి. రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతా అని చంద్రబాబు స్పష్టం చేశారు.
అభివృద్ధికి పునాదులు వేసిన పార్టీ టీడీపీ….
రాష్ట్రంలో అభివృద్ధిని పుంతలు తొక్కించాను. నంద్యాలకు బై ఎలక్షన్‌కి వచ్చి రోడ్లు వెడల్పు చేస్తానని చెప్పాను చేసి చూపించాను. 14,500 టిడ్కో ఇళ్లు కట్టించాను. ఐదేళ్లయినా నేను కట్టిన ఇళ్లకు సైకో రంగులు వేసుకున్నాడు కానీ మీకివ్వలేదు. కరెంటు స్తంభాలు, శ్మశానాలను కూడా వదిలిపెట్టకుండా రంగులు పిచ్చోడు వైసీపీ రంగులు వేసుకుని మొత్తం మార్చేశానని చెప్తున్నాడు. నంద్యాల అభివృద్ది కావాలంటే అది టీడీపీతోనే సాధ్యం. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాను. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 లక్షల ఉద్యోగాలు కల్పించాను. రెండంకెల అభివృద్ది చేశా. ఆదాయాన్ని పెంచి 100 సంక్షేమ కార్యక్రమాలు మీకిచ్చాను. దేశంలోని మూడు రాష్ట్రల్లో ఆంధ్రప్రదేశ్‌ని నిలిపే బాధ్యత నాది. 78 ఏళ్లుగా నాకు రాజకీయంలో అనుభవం ఉంది. ఇప్పటికి 9 వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. నా జీవితంలో ఇలాంటి చేతగానీ దద్దమ్మను ముఖ్యమంత్రిగా ఎప్పుడూ చూడలేదు. కోవిడ్ వచ్చినప్పుడు కూడా వర్చువల్ సమావేశాలు పెట్టి మీకోసం పనిచేశానని బాబు అన్నారు.
వైసీపీది అసమర్థ పాలన…..
వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను, రంగాలను సర్వనాశనమయ్యాయని, బాదుడే బాదుడుతో ప్రజలపై తీవ్ర ఆర్థిక భారంమోపి జీవన ప్రమాణాలను దెబ్బతీశాడని దుయ్యబట్టారు. సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేశాడన్నారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టుకూ శ్రీకారం చుట్టలేదంటూ, సీమ ద్రోహి జగన్ అని ధ్వజమెత్తారు. 2019లో 52 సీట్లకు 42స్థానాల్లో గెలిపించారు. కులంపేరు, మతం పేరు, చెప్పి ఓట్లు వేయించుకుని మిమ్మల్ని ముంచేశాడు. నేను కూడా రాయలసీమ బిడ్డనే. ఈ గడ్డపైనే పుట్టాను. మీ అందరి అభిమానంతో రాజకీయల్లో దూసుకెళ్తూ అందరి దగ్గర గౌరవాన్ని సంపాదించా. సీమకు న్యాయం జరగాలంటే `2019 ఎన్నికల ఫలితాలను రివర్స్‌చేసి కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
మీ భూమి మీ హక్కు….
జగన్ సర్కారు తెచ్చిన భూహక్కు చట్టం ప్రమాదకరమైనదిగా చంద్రబాబు అభివర్ణించారు. ప్రయివేట్ ఆస్తులు సైతం చట్టబద్ధంగా కొల్లగొట్టేందుకే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాడని దుయ్యబట్టారు. మీ భూములకు సంబంధించిన పాసు పుస్తకాలపై రాజముంద్ర ఉండాలిగానీ, జగన్ బొమ్మ, జగన్ పెత్తనమేంటని ప్రశ్నించారు. ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తన దగ్గర పెట్టుకుని, మనకు జిరాక్స్ కాపీలు ఇస్తామని చెప్పడం ఎంత తెంపరితనమో అర్థం చేసుకోవాలన్నారు. సైకో జగన్‌ను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిరచి వైసీపీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే లాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు దస్త్రంపైనే మలి సంతకం చేస్తానని బాబు ప్రకటించారు.
మైనార్టీల సంక్షేమాభివృద్ధి కోసం…..
అన్న క్యాంటిన్లు, దుల్హాన్, రంజాన్ తోఫా, విదేశీ విద్య, చంద్రన్న భీమా, మీ ఆరోగ్యం కోసం రూ.25 లక్షలతో హెల్త్ ఇన్సూరెన్స్.. ఇలా మైనార్టీలకు గతంలో అమలు చేసిన పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తానని బాబు హామీ ఇచ్చారు. ఎన్టీయేతో పొత్తులో ఉన్న సందర్భాల్లోనూ ముస్లింల అభ్యున్నతికి కట్టుబడివున్న పార్టీ తెలుగుదేశమే అన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 శాతం రిజర్వేషన్లుకు కృషి చేస్తామని చంద్రబాబు హమీ ఇస్తూ, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
సంక్షేమానికి ఢోకా లేదు….
తానొస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఎన్నికల సభల్లో జగన్ చెప్పడం బెదిరింపేగానీ పేదలపై ప్రేమ కాదన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టీడీపీ అంటూ.. పేదల అభ్యున్నతికి, సంపద సృష్టికి టీడీపీ ఎలాంటి పథకాలు అమలు చేసిందో ప్రజలకు తెలీంది కాదన్నారు. ఇద్దరి మేనిఫెస్టోలు ప్రజలముందు ఉన్నాయని, ఎవరి మేనిఫెస్టోతో ప్రజలకు లబ్ది, రాష్ట్రాభివృద్ధి జరుగుతుందో ప్రజలే నిర్ణయించాలని చంద్రబాబు కోరారు. జగన్ ప్రచారం చేసే అబద్ధాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని అంటూనే, అప్పులు, అబద్ధాలను ఆశ్రయించే నాయకుడు రాష్ట్రాభివృద్ధి ఏం సాధిస్తాడని నిలదీశారు. టీడీపీ వచ్చిన తర్వాత సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి పేదవాళ్లకి పంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
గొప్ప నాయకుడు పవన్….
మిత్రుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ నిజమైన హీరో. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. జనసేన జెండాలు పట్టుకుని అల్లు అర్జున్ వస్తే వైసీపీ వాళ్లంతా పనికిమాలిన రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేశారు. పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటే చిన్న సైకో నంద్యాలలో ఉన్నాడు. అతనే సండే ఎమ్మెల్యే. అతనిని శాశ్వతంగా ఇంటికి పంపిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సూపర్-6తో అభివృద్ధి….
తాము తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల స్థితిగతులు పూర్తిగా మారతాయన్న నమ్మకాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. మహాశక్తి పథకం కింద ప్రతి ఆడబిడ్డకు రూ.1500, తల్లికి వందనం పథకం కింద ప్రతి బిడ్డకూ ఏడాదికి రూ.15వేలు, ‘దీపం’ పథకం కింద ఏటా 3 గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, డ్వాక్రాలకు వడ్డీలేని పదిలక్షల రుణం అందిస్తామని ప్రకటించారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే బాబు, పవన్ కళ్యాణ్ రావాలని అంటూనే, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామని, రైతులకు అన్నదాత కింద ఏటా రూ.20 వేలు అందిస్తామన్నారు. కూటమి అధికారంలోకి రాగానే నెలకు రూ.4 వేలు పింఛను ఇంటికి తీసుకొచ్చి ఇస్తామన్నారు. దివ్యాంగులకు రూ.6 వేలు పింఛను ఇవ్వనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.