- నాయకుడిలో ఉండాల్సింది విజన్..పాయిజన్ కాదు
- ఇలాగే పాలన సాగితే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందా?
- బాబాయిని చంపేశా.. ఓటేయమని అడుగుతారా?
- పోలీసులు లేకుండా వస్తే ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందాం
- ఒకసారి వ్యవస్థను కూల్చివేసిన తర్వాత నిర్మించడం కష్టం
- వ్యవస్థలను కాపాడుకుంటే అవే మనల్ని కాపాడతాయి
- కష్టాల్లో ఉన్న ప్రజలకు నేతలు అండగా నిలవాలి
- నిత్యం ప్రజల్లో ఉండాలి.. అన్నివర్గాలను స్పురించండి
- నీలిమీడియాను దూరంపెట్టండి.. మనపైనే తప్పుడు కథనాలు
- మీవల్ల కాకపోతే పోరాడే వారికి నాయకత్వం అప్పగించండి
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
అమరావతి : ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కొవ్వూరు అర్బన్ బ్యాంకు పాలకవర్గాన్ని రద్దుచేస్తూ వైసిపి ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయంపై హైకోర్టు ఛీవాట్లు పెట్టింది.. జగన్ రెడ్డికి ఏమాత్రం సిగ్గూ, లజ్జా ఉన్నా తక్షణమే సిఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో అధినేత ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. సొంత కంపెనీకి మైనింగ్ ఇచ్చారని ఝార్జండ్ సిఎం హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వాన్ని రద్దుచేశారు, సరస్వతి సిమెంట్స్ కు నీటికేటాయింపుల విషయంలో జగన్ చేసిన దానికి ఏ శిక్ష విధించాలని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. గత మూడేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు కానీ..వైసిపి ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. ముఖ్యమంత్రి జగన్ ఈ మూడేళ్లలో 2 లక్షల కోట్లు అక్రమంగా ఆర్జించారు. 20 కోట్లు ఆదాయం లేని కంపెనీతో 500 కోట్లతో 20వేలకోట్ల లేపాక్షి భూములు కొట్టేశారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి జమానాలో పక్క రాష్ట్రం నుంచి మద్యం తెచ్చేవారికి నో చెక్ పోస్ట్…గంజాయి తెచ్చే వారికి చెక్ పోస్ట్ లేదు..సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం చెక్ పోస్ట్ లు పెడుతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం చేస్తేనే ఓటు అడుగుతామన్నారు, కానీ మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి 25వేలకోట్లు అప్పులు తెచ్చారని అన్నారు. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో పార్టీ కేడర్ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
నాయకుడికి ఉండాల్సింది విజన్.. పాయిజన్ కాదు
రాష్ట్రంలో నేటి పరిస్థితులను చూస్తే బాధేస్తోంది. పాలకుడికి ఉండాల్సింది విజన్ కానీ విద్వేషం కాదు. నేడు ఎక్కడ చూసినా విద్వేషమే.. నేడు పాలకులకు విజన్ పోయి పాయిజన్ గా తయారయ్యింది. తమకు రావాల్సిన బకాయిలపై అనంతపురంలో కానిస్టేబుల్ ప్లకార్డు పట్టుకున్నాడు. దీంతో ఆయనను టార్గెట్ చేశారు..ఉద్యోగం నుంచి తొలగించారు. కానిస్టేబుల్ తనను వేధించలేదు అని చెప్పిన శ్రీలక్ష్మిని వేధిస్తున్నారు. కానిస్టేబుల్ ప్రకాష్ ఇప్పుడు కనపడడం లేదు. సమస్యలను ప్రస్తావిస్తే..దాడులు, వేధింపులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆడబిడ్డలపై గత మూడేళ్లలో 31 శాతం దాడులు పెరిగాయి. ఈ విషయాన్ని నేషనల్ క్రైం బ్యూరో రికార్డు స్పష్టంచేసింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీలు గెలుస్తామని జగన్ రెడ్డి డప్పాలు కొట్టుకుంటున్నారు. ఏంచేశారని జనంవద్దకు వెళ్లి ఓట్లడుగుతారు? జగన్ పాలనలో అన్ని వ్యవస్థలూ పతనావస్థకు చేరాయి. వ్యవస్థలను మనం కాపాడితే అవి మనల్ని కాపడతాయి. ఇందుకోసం ప్రతిఒక్క నాయకుడు రోడ్డెక్కాల్సిన సమయం ఆసన్నమైంది.
నాడు చేసిన పనులు నేడు ఫలితాన్నిస్తున్నాయి
నాడు విజన్‌తో నేను చేసిన పాలనతో ఇప్పుడు హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానం ఉంది. ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నతస్థితిలో ఉండడమే నాకు అన్నిటికంటే సంతృప్తి. నేను ముఖ్యమంత్రిగా మొదటి సారి పదవి చేపట్టి 27 ఏళ్లు అయ్యింది. 27 ఏళ్ల క్రితం మనం చేసిన పనులు..ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా అవసరం నాడు చాటి చెప్పాం. అమెరికాలో ఉండే అమెరికన్ ఆదాయం 65 వేల డాలర్లు..కానీ అక్కడ ఉన్న ఇండియన్స్ ఆదాయం 1.25 లక్షల డాలర్లు. ఇది మన వారి సత్తా. మనం చేసిన మంచి ఎప్పుడూ గుర్తు ఉంటుంది. రాష్ట్రంలో సంక్షేమం అనేది మొదట పరిచయం చేసింది ఎన్టీఆర్. ఆహార భద్రతకు నాంది పలికింది ఎన్టీఆర్. పేద పిల్లల కోసం గురుకుల పాఠశాలలో రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టింది ఎన్టీఆర్ . పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టింది ఎన్టీఆర్. పాలనలో సంస్కరణలు మొదలు పెట్టింది ఎన్టీఆర్. తెలుగుదేశం జాతీయ భావాలు ఉన్న ప్రాంతీయ పార్టీ. టిడిపి గత విజయాలు నెమరవేసుకోవడంతోపాటు ప్రజలకు గుర్తుచేయాలి.
అన్నక్యాంటీన్లకు డొక్కా సీతమ్మ స్పూర్తి
నాడు డొక్కా సీతమ్మ అన్నదానంచేసి ఎంతోమంది పేదల ఆకలితీర్చారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఆమే స్పూర్తి. నందిగామలో చివరికి కోర్టుకు వెళ్లి అన్నక్యాంటీన్ నిర్వహణకు అనుమతులు తెచ్చుకున్నాం. కుప్పంలో అన్న క్యాంటీన్ ఏర్పాటుచేస్తే దాడులకు దిగారు. వైసిపి విధ్వంసక పాలనకు ఇది నిదర్శనం. రాష్ట్రంలో ఒకవైపు పన్నుల భారం..మరోవైపు అప్పుల భారం మోపారు. ఎస్సీలకు ఉన్న 26 పథకాలు రద్దు చేశారు. సబ్ ప్లాన్ తీసేశారు. చింతూరులో వరదల సమయంలో సిఎం జగన్ పిలిచి మాట్లాడిన బాలిక డెంగ్యూవచ్చి చనిపోయింది. దీనికి సిఎం ఏం సమాధానం చెపుతారు..ఇది ప్రభుత్వ హత్య కాదా? వరద ప్రాంతంలో దోమల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. విదేశీ విద్యను ఆపేశారు..బిసిలకు ఒక్క పథకం లేదు. కాపు కార్పొరేషన్ కు నిధులు లేవు. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు. కనీసం ధాన్యం డబ్బులు కూడా చెల్లించడం లేదు. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.రాష్ట్రంలో ఇసుక దొరక్క..భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. చేనేత, గీత, మత్స్య కారులు, ఆటో డ్రైవర్లు..ఇలా అన్నీ వర్గాలు జగన్ పాలనలో దెబ్బతిన్నారు.
సంస్థాగత విషయాల్లో రాజీలేదు
సంస్థాగత విషయాల్లో రాజీ పడేది లేదు..సభ్యత్వ నమోదు త్వరితగతిన పూర్తిచెయ్యాలి. పార్టీకి సంబం ధించి గ్రామస్థాయి వరకు కమిటీలు వెంటనే పూర్తి చెయ్యాలి. ఓటర్లు వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన ఓట్లు ఉండవు. ప్రజల్లో ఎంత చైతన్యం ఉన్నా మన ఓట్లు లేకపోతే ఏమీ చెయ్యలేం.. జాగ్రత్తగా ఉండాలి. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా ఉంటారు. వారిని గెలిపించే బాధ్యత పార్టీ నేతలు తీసుకోవాలి. నియోజకవర్గ ఇంచార్జిలు నెలలో 10 రోజులు నియోజకవర్గంలో ఉండాలి. నియోజకవర్గ అబ్జర్వర్ 8 రోజులు నియోజకవర్గంలోనే ఉండాలి. ప్రతి రెండు నియోజకవర్గాలకు ముగ్గురు చొప్పున 175 నియోజకవర్గాలకు టీమ్ లను పంపుతాం. అధికారంలో ఉన్నపుడు ఎక్కువ సమయం పార్టీకి కేటాయించక పోవడంతో సమస్యలు వచ్చాయి. పాలనలో పడి పార్టీని నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్యలు వచ్చాయి. నేను సైతం నన్ను సరి చేసుకుంటున్నాను.
నీలిమీడియాకు దూరంగా ఉండండి
రాష్ట్రంలో ఇంత అరాచకం ఉంటే కొన్ని టీవీలు తిరిగి మనల్నే విమర్శిస్తున్నాయి. అందుకే నీలిమీడియా గా ఉన్న టివి9, ఎన్టీవిని దూరంగా పెట్టాలి..వారికి బాధ్యత గుర్తు చెయ్యాలి. టిడిపి నేతలు సొంత సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకోవాలి. దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఉంటే మరింత ఎక్కువ నష్టం. మనం అప్రమత్తంగా ఉండాలి.