- రాష్ట్రమంతటా తెలుగుదేశం, జనసేన గాలి
- ఓటమి అర్థమై సంతోషంగా దిగిపోతానంటున్నాడు
- రాష్ట్రానికి పట్టిన శని మరో 74 రోజుల్లో పోతుంది
- పోయేటప్పుడు ఇచ్చే నోటిఫికేషన్‌తో ఎవరిని మోసం చేయడానికి?
- ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా కార్యకర్తలు టీడీపీ జెండా వదల్లేదు
- నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదలను
- ఉరవకొండ రా.. కదలి రా సభలో చంద్రబాబు ఉద్ఘాటన
ఉరవకొండ: ప్రజలను చైతన్న పరిచి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవచ్చో తెలియజేప్పేందుకే ఉరవకొండకు వచ్చాను.. మీ ఉత్సాహం చూస్తుంటే ‘‘మేమంతా మీ వెనుకే ఉన్నాం. మీరు ముందు నడవండి, మేము మీ వెనుకే నడుస్తాం’’ అని మీరు చెబుతున్నట్లుగా నాకు అర్థమవుతోంది.. ఇంతమంది జనాన్ని చూస్తుంటే ఇదంతా నా పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నాను.. ఈ జనాన్ని చూస్తే జగన్‌కు నిద్ర కూడా పట్టదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో శనివారం సాయంత్రం నిర్వహించిన రా.. కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. రాష్ట్రమంతటా తెలుగుదేశం, జనసేన గాలి వీస్తోంది. ఎప్పుడైతే జనసేన-తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకున్నాయో అప్పుడే వైసీపీ పతనం ప్రారంభమయింది. ఓటమి ఖాయమని తెలిసే జగన్ మాటల్లో మార్పు వచ్చింది. సంతోషంగా దిగిపోతానంటూ ఈ మధ్యనే జగన్ తన ఓటమిని అంగీకరించాడు. జగన్ కు తాను ఓడిపోతున్నట్లు అర్థమైపోయింది. ఆయన ఓడిపోతున్నాడని సర్వేలు సైతం వచ్చాయి. ఇటీవల జగన్ ఇదే ప్రాంతంలో సభ పెట్టాడు. ఆ సభకు, ఈ సభకు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు వచ్చిన జనం స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలే. జగన్ సభలకు వచ్చిన జనం స్వచ్ఛందంగా వచ్చిన వారుకాదు. జనంలోని చైతన్యాన్ని బట్టి ఈ విషయం స్పష్టమౌతోంది. మీ ఉత్సాహాన్ని జగన్ చూశాడంటే ఆయనకు నిద్ర పట్టదు. జగన్ కు 74 రోజులు నిద్ర కరువయ్యేది ఖాయం. ఎక్కడ చూసినా జగన్ ను జనం ఛీ కొడుతున్నారు. ‘‘నువ్వు మాకు వద్దు’’ అంటున్నారు. జగనే ఆ పరిస్థితి కొని తెచ్చుకున్నాడు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14కి 14 నియోజకవర్గాలు గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం. ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా కార్యకర్తలు టీడీపీ జెండా వదల్లేదు. అందరికీ రుణపడి ఉంటాం. నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదలను. జగన్ కు ఉన్న గర్వమంతా ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయింది. 2021లో ఎవరూ కూడా నా వెంట్రుక పీకలేడన్నాడు. అప్పుడు మనిషిలో అహంభావం పూర్తిగా ఉండేది. 2022లో ప్లీజ్ నన్ను నమ్మండని బ్రతిమిలాడుకున్నాడు. 2023లో మిమ్మల్నే నమ్ముకున్నానని అన్నాడు. 2024లో నేను హ్యాపీగా దిగిపోతా అంటున్నాడు. ఖేల్ ఖతమ్ అని జగనే ధృవీకరించుకున్నాడు. జగన్ రెడ్డీ.. నువ్వు సిద్ధమైతే నిన్ను దించటానికి మేము సిద్ధమని చంద్రబాబు అన్నారు.
డ్రిప్ ఇరిగేషన్‌ను నాశనం చేశాడు
25 ఏళ్లకు ముందు మీ భూముల విలువ ఎంత? నేను వచ్చాక ఎంత అయ్యాయో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ ప్రాంతంలోని రైతుల బిడ్డలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా మారారు. వ్యవసాయ రంగాన్ని ఆధునిక పద్ధతుల్లోకి మార్చాలనుకున్నాను. టీడీపీ అధికారంలో ఉన్నప్పపుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. జగన్ వచ్చి దానికి అడ్డు తగిలాడు. నేను ఊహించినట్లు జరిగివుంటే డ్రిప్ ఇరిగేషన్ ఎంతో అభివృద్ధి జరిగి ఉండేది. అది పూర్తయివుంటే అనంతపురం జిల్లాలో ప్రతి రైతు బాగుపడేవాడు. అవసరమైన పరికరాలు పంపిణీ చేశాం. జగన్ వచ్చి వాటన్నింటినీ నాశనం చేశాడు. ఈ ముఖ్యమంత్రికి బుద్ది లేదు, రైతులకు ఇచ్చిన సామగ్రిని వాడకుండా వదిలేయటం వల్ల రూ. 30 కోట్లు వృథా అయ్యాయి. నేను తపించేది నా కోసం కాదు రైతుల కోసం. ఒకప్పుడు దేశానికి కూరగాయలు సరఫరా చేసిన ఏకైక జిల్లా అనంతపురం జిల్లా. వైసీపీ నాయకుల మాయ మాటలు నమ్మొద్దు. జగన్‌కు ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలియదు. అందుకే పంటల బీమా పథకాన్ని తీసేశాడు. మళ్లీ బీమా పథకం తెచ్చే బాధ్యత టీడీపీ-జనసేనలదని చంద్రబాబు హామీ ఇచ్చారు.
వైసీపీని నమ్మి నిండా మునిగారు
ఎక్కడ పోయినా జనం ఉత్సాహం, అభిమానం చూపిస్తున్నారు. వైసీపీిని భూస్థాపితం చేయాలి. డీఎస్సీ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఒక్క ఉద్యోగం లేదు. పోయేటప్పుడు ఇచ్చే నోటిఫికేషన్‌తో ఎవరిని మోసం చేయడానికి? ఇంకా ఎవరిని మోసం చేస్తారు?. మేం అధికారంలో ఉన్నప్పుడు ఐటీ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలిచ్చా. నాసి రకం మద్యంతో మంది ప్రాణాలు తీస్తున్నాడు. టీడీపీకి, వైసీపీకి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గ్రహించాలి. మేం విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. సెంట్రల్ యూనివర్శిటీలు తెచ్చాం. అనంతపురంలో కియా మోటార్ పరిశ్రమ పెట్టి 12 లక్షల కార్లు ఉత్పత్తి చేశాం. ఇక్కడ తయారైన కార్లు ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నాయి. మేం రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చాం. వాటిని జగన్ రెడ్డి తరిమేశాడు. అమర్ రాజాను తరిమేశారు. యువతకు జాబులు లేకుండా చేశాడు. జాబు రావాలంటే బాబు రావాలి. బాబు రావాలంటే సైకిలెక్కండి. టీడీపీ-జనసేన జెండా పట్టండి. మీ జీవితాల్లో వెలుగు తెస్తాం. మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తాను. మీరు సిద్ధమా? మీరు సిద్ధమైతే నేను సిద్ధం. మీరు పది అడుగులు ముందుకు వేయండి, మీ కోసం నేను వంద అడుగులు ముందుకు వేస్తా. ఇంకో 25 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్లాలన్నదే నా ఆలోచన. అందుకోసం ఏమి చేయాలో ఆలోచిస్తున్నాను. తెలుగు జాతి నెం.1 జాతిగా ఉండాలి. అదే నా జీవిత లక్ష్యం. దాన్ని సాధించేందుకు యువత సిద్ధమా? ఒకప్పుడు రోడ్లు ఉండేవి కాదు, మేం వచ్చాక రోడ్లు వచ్చాయి. రాష్ట్రంలో సెల్ ఫోన్ కంపెనీలు వచ్చాయంటే దానికి కారణం నేనే. దేశంలో ప్రత్యేకంగా తెలుగుజాతిలో పేదరికం లేకుండా చూడడమే నా లక్ష్యం. తలరాతలు మారాలి. వైసీపీ నేతలు కమీషన్ల కోసం తప్పడు పనులు చేశారు. యువతకు హామీ ఇస్తున్నా. 4 లక్షల 25వేల ఉద్యోగాలిస్తాం. అనేక కంపెనీలు, పరిశ్రమలు మరలా తీసుకువస్తాం. యువత పనిచేసుకునేందుకు వర్క్ ఫ్రం హోం కు శ్రీకారం చుడతాం. ఉద్యోగాలే మీ తలుపు కొట్టేలా చేస్తాను. అమ్మా, నాన్న పైన ఆధార పడాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ పెద్దగా ఉంటా. అనంతపురంలో కరెంటు కొరత ఉండేది. కానీ సోలార్, విండ్ ఎనర్జీ ద్వారా కరెంటు కొరత లేకుండా చేశాను. భవిష్యత్తులో కరెంటు చార్జీలు తగ్గిస్తాము గాని పెంచము. వైసీపీని నమ్మి ఓటేశారు. నిండా మునిగారని చంద్రబాబు అన్నారు.
ఎవర్నీ వదిలి పెట్టను
దొంగ ఓట్లు నమోదు చేసిన అధికారిని, వైసీపీ నాయకులను ఎవర్నీ వదిలి పెట్టను. నల్ల చట్టం(ఏపీ ల్యాండ్ టైట్లింగ్) అనే కొత్త చట్టాన్ని తీసుకు వచ్చాడు. అది భూ రక్షణ చట్టం కాదు భూ భక్షణ చట్టం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి మిమ్మల్ని విముక్తి చేసే బాధ్యత నాది. ఈ ముఖ్యమంత్రి మరలా వస్తే మీ ఆస్తులు మీవి కాకుండా పోతాయి. భూమి మీదైతే పట్టాపై జగన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. మీ అమ్మ బంధువా? లేదా మీ దాయాదనా జగన్ రెడ్డి తన ఫొటో వేసుకున్నాడు? ఇంట్లో, పొలంలో, చివరికి మరుగుదొడ్డుల్లో.. ఎక్కడ చూసినా జగన్ రెడ్డి ఫొటోనే అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఆడబిడ్డలకు రక్షణగా మేముంటాం
మనం మాట్లాడితే ప్రాణాలు ఉండవు, ఆడబిడ్డలకు రక్షణ ఉండదు. తన కోరిక తీర్చలేదని ఓ కిరాతకుడు, దుర్మార్గుడు నడి బజారులో ఆడబిడ్డను కొడితే పోలీసులు కూడా వెళ్ళలేదంటే సిగ్గు లేదా అని అడుగుతున్నా. మీ ఇంట్లో ఆడబిడ్డకు ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా? ఆంబోతుల్లారా జాగ్రత్తాగా ఉండండి. ఆంబోతులను నడిరోడ్డులో బట్టలిప్పి ఊరేగించి రోజులు దగ్గర పడ్డాయి. ఆడబిడ్డలకు రక్షణగా మేముంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఏది జరిగినా కారణం నేనే అంటున్నారు
జగన్ రెడ్డి బతుకే ఫేక్ బ్రతుకు. నారాసుర రక్తచరిత్ర అని చెప్పాడు, లేని తిరుమల వెంకటేశ్వరుని పింక్ డైమెండ్ మా ఇంట్లో ఉందన్నాడు. నేను కోర్టుకు వెళ్తే కేసును విత్ డ్రా చేసుకుంటానన్నాడు. వెనక్కి తగ్గకుండా నేను ఇంప్లీడ్ అయ్యాను. కోడి కత్తి డ్రామా ఆడాడు. ఇప్పుడేమో వైఎస్ కుటుంబాన్ని నేను చీలుస్తున్నానని అంటున్నాడు. భార్య, భర్త కాపురం చేయకపోతే దానికి కూడా కారణం నేనే అని అంటున్నావు. సిగ్గు లేదు మీకు? ఎక్కడ ఏం జరిగినా నన్ను తీసుకువస్తున్నారంటే నేనంటే ఎంత భయమో అర్థమవుతుంది. వైసీపీ నాయకులు నేనంటే భయమేసి డైపర్ వేసుకొని తిరగాల్సిన పరిస్థితికి వచ్చారు. వైసీపీ పని అయిపోయింది. నీ సీటు వద్దు.. ఏం వద్దని వైసీపీ నాయకులే పారిపోతున్నారు. ప్రజల్లారా.. మీరందరూ కన్నెర్ర చేస్తే వైసీపీ నుంచి పోటీ చేయటానికి అభ్యర్థులే ఉండరని చంద్రబాబు అన్నారు.
నష్టపోయిన ప్రజలందరూ నా స్టార్ క్యాంపెయినర్లే
నాకు పేపర్ లేదు, టీవీ ఛానల్ లేదని నంగనాచి కబుర్లు చెప్తున్నాడు. అందరూ ఆయనికి వ్యతిరేకంగా ఒకవైపు చేరారని అబద్ధాలు చెప్తున్నాడు. జగన్, అతని చెల్లెలు కొట్టుకొని.. చెల్లి వెళ్లి కాంగ్రెస్‌లో చేరితో దానికి కూడా నేనే కారణమంటున్నాడు. నువ్వు చేసేది తప్పని జగన్ రెడ్డిని ఎవరైతే ప్రశ్నిస్తే వారిని నాకు స్టార్ క్యాంపెయినర్ అంటూ ముద్ర వేస్తున్నాడు. అవును ఈ రాష్ట్రంలో జగన్ వల్ల నష్టపోయిన ప్రతీ ఒక్కరు నా స్టార్ క్యాంపెయినర్లే. ఉద్యోగం రాని యువత నా స్టార్ క్యాంపెయినర్. నష్టపోయిన రైతు నా స్టార్ క్యాంపెయినర్. డ్వాక్రాలో ఉన్న ప్రతీ మహిళా నా స్టార్ క్యంపెయినర్. నన్ను ఆదరించింది మీరు. మిమ్మల్ని గౌరవించింది నేను. అందరి జీవితాలతో ఆడుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. ఈ రోజు జగన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి అందరూ స్టార్ క్యాంపెయినర్లు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
దోపిడీలే ధ్యేయంగా ఎమ్మెల్యేలు
అక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఎక్కడ లే అవుట్ వేసినా ఆయనకు కప్పం కట్టాల్సిందే. చివరకు సెక్యూరిటీ సిబ్బంది జీతాల్లో కూడా ఆయనకు వాటా ఇవ్వాల్సిందే. తప్పుడు ఎన్వోసీలు సృష్టించి ఆడబిడ్డల భూములను కొట్టేసిన విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడిని ఇక్కడ ఇన్చార్జ్‌గా జగన్ రెడ్డి నియమించాడు. ఈ నియోజకవర్గానికి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది ఎమ్మెల్యే కేశవ్ వల్లే. మంత్రి ఉషశ్రీ చరణ్ కరప్షన్ క్వీన్. రూ.30 కోట్లు విలువైన సుజలాన్ విండ్ పార్క్‌కు చెందిన భూములను ఆమె డ్రైవర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకొని పెట్టుకుంది. పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అక్రమ లేఅవుట్‌లు వేసి ఇష్టానుసారంగా అమ్ముకున్నారు. పేదవారికి ఇచ్చే ఇంటి జాగా కోసం 100 ఎకరాలను రూ.6 లక్ష చొప్పున కొని రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వానికి అమ్ముకుంది. అందుకే కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు మార్చారు. ఈ ఊర్లో ఉన్న చెత్త ఏ ఊర్లోను బంగారమవ్వదు. చెత్తను డంప్ యార్డ్‌కు పంపిస్తాం. ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో మరలా ఫ్యాక్షనిజాన్ని తీసుకు వచ్చారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసులను అడ్డపెట్టుకొని ఎగిరెగిరి పెడతున్నాడు. వడ్డీతో సహా చెల్లిస్తాం. శింగనమల నియోజకవర్గాన్ని ముక్కలు ముక్కలు చేసిన ఎమ్మెల్యేకు సీటే లేకుండా పోయింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు.. పాపం జగన్ రెడ్డికి కాపు కాశాడు. ఇప్పుడు టికెట్ లేదు పో అని జగన్ రెడ్డి అంటే తాడేపల్లి ప్యాలెస్‌కు సెల్యూట్ పెట్టి బాయ్ బాయ్ చెప్పాడు. గుంతకల్లులో స్టాక్ పాయింట్ పెట్టి ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఇసుక అమ్ముతున్నాడు. ఎవరు గాలి పీల్చినా కప్పం కట్టాలంటాడు. అనంతపురం ఎమ్మెల్యే రిటైర్మెంట్‌కి వచ్చేసి చిల్లర కొట్టుడు కొట్టుకుంటున్నాడు. ఇలాంటి ఎమ్మెల్యేలు, సీఎంలు, చెత్తలు మనకు వద్దని చంద్రబాబు అన్నారు.
సామాజిక న్యాయానికి మారు పేరు టీడీపీ
అనంతపురానికి జీవనాడి లాంటి డ్రిప్ ఇరిగేషన్‌ను మరలా తీసుకువస్తా. బైరవానితిప్ప, గుంతకల్లులో పెండిరగ్‌లో ఉన్న లిఫ్ట్ట్ ఇరిగేషన్, సెంట్రల్ యూనివర్సిటీలను పూర్తి చేస్తాం. గార్లదిన్న, శింగనమలలో ముస్లీంల కోసం షాదీఖానాలు పెడతాం. రద్దు చేసిన సబ్ ప్లాన్‌లు మరలా తీసుకు వచ్చి వెనుకబడ్డ వర్గాలకు అండగా ఉంటాం. వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకు వచ్చి వారి రుణాన్ని తీర్చుకుంటాను. తెలుగుదేశాన్ని ఆశీర్వదించమని బీసీలను కోరుకుంటున్నాను. సామాజిక న్యాయానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అందరికీ న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. మాదిగలకు న్యాయం చేయబోయేది కూడా తెలుగుదేశం పార్టీ. మైనారిటీలకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా. గండికోట, నిట్టూరు, బుక్కాపురం లిఫ్ట్ ఇరిగేషన్‌ను పూర్తి చేస్తాం. చిత్రావతి నదిపై తాడిపత్రి-పులివెందుల బ్రిడ్జి నిర్మాణ పూర్తి చేస్తాం. ఉరవకొండలో ఉన్న చేనేత కార్మికులకు చేయూతనందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
అనంతపురానికి అండగా ఉంటా
నేను ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే జిల్లా అనంతపురం. నాకు గుండెకు దగ్గరగా ఉండే జిల్లా అనంతపురం. ఒకప్పుడు నీళ్లు లేక పంట రాకపోతే మొట్టమొదటి సారి వేరు శనగ పంటకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చాం. రైతాంగాన్ని ఆదుకున్నాం. కరువు ఏర్పడినప్పుడు రైతులు పశువులను మేపుకోవటానికి క్యాంపులు ఏర్పాటు చేశాం. అప్పటినుంచి అనంతపురానికి నీళ్లు తీసుకురావాలని నాలో పట్టుదల పెరిగింది. అందుకే హంద్రీ-నీవాను తీసుకువచ్చాం. ప్రతీ ఎకరాకు నీళ్లిచ్చి, పేదరికం లేకుండా చేసి, రైతు తన పొలంలో బంగారం పండిరచే వరకు మీకు అండగా నేను ఉంటా. దాన్ని చేసి చూపిస్తా. ఈసారి మీరిచ్చే ఫలితాలు జగన్‌కు దిమ్మతిరిగేలా ఉండాలి. వైసీపీ జెండా భూస్థాపితమై టీడీపీ జెండా ఎగురవేయాలని చంద్రబాబు అన్నారు.
మళ్లీ స్వర్ణ యుగం వస్తుంది
మన భవిష్యత్తే మనందరి ధ్యేయం. తెలుగు జాతిని నెంబర్ వన్‌గా మార్చే బాధ్యత నాది. ఇక్కడ పుట్టి ఈ రోజు ఐటీ ఉద్యోగులుగా ఉండటానికి పునాదిని వేసింది నేను. హైదరాబాద్‌లో నాలెడ్జ్ ఎకానమీకి పునాది వేసింది నేను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతీ వ్యక్తిని ఉన్నత స్థితికి తీసుకు వచ్చే బాధ్యత తెలుగుదేశం-జనసేన తీసుకుంటాయి. రాతియుగం పోయి స్వర్ణ యుగం వస్తుందని చంద్రబాబు అన్నారు.