కడప: జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచేసిందని, యూడున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను అమ్ముకుంటూ యువతను మోసం చేస్తున్నారని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 25న అన్ని విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి చలో కలెక్టరేట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు, ఉపాధి, ఉద్యోగవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని అన్నారు. జగన్ విడుదల చేసిన జాబ్‌లెస్ క్యాలెండర్ రద్దు చేసి మరోసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. జగన్ తన ఎన్నికల హామీగా ఇచ్చిన డీఎస్సీని వెంటనే చేపట్టడంతో పాటు ప్రైవేటు టీచర్లకు టెట్ నిబంధనను ఎత్తివేయాలని శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.