- అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్దంగా ఐదేళ్ల పాలన
- విరుచుకుపడ్డ ఎన్డీయే కూటమి నేతలు
అమరావతి, చైతన్యరథం: రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలనే, అందరికీ సమాన అవకాశాలు దక్కాలని అంబేద్కర్ ఆశిస్తే, రాష్ట్రంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా దళితులను నట్టేట ముంచిందని ఎన్డీయే కూటమి నేతలు విమర్శించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ప్రజా విజ్ఞాన దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రంలో దళితుల పట్ల జగన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన అన్యాయాలను టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, బీజేపీ నేత ఆర్‌డి విల్సన్, జనసేన పెదపూడి విజయ్‌కుమార్ వెల్లడిరచారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ ‘‘ప్రతి పౌరుడికి రాజ్యాంగ ఫలాలు అందాలనేదే అంబేద్కర్ ఆశయం. ప్రతి ఒక్కరు స్వేచ్ఛ గా బతకాలని అంబేద్కర్ కాంక్షించారు.
ప్రతి ఒక్కరు రాజకీయ భాగస్వామ్యులవ్వాలని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోరుకున్నారు. స్వాతంత్రం వచ్చాక రాష్ట్రంలో ఎంతో మంది పాలకులు ఎంతో కొంత దళితులకు మేలు చేశారు. అన్యాయం జరగకుండా చూశారు. అణచివేతకు గురవుతున్నవారిని పైకి తీసుకొచ్చారు. ఆర్థికంగా వెనుకబడినవారిని ఆర్థికంగా ముందుకు తెచ్చారు. రిజర్వేషన్లు అమలు కాని చోట్ల వాటిని సక్రమంగా అమలు చేసి దళితులను ముందుకు తెచ్చారు. కాని జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇతర పాలకులకు భిన్నంగా వ్యవహరించాడు. ఎన్నికలకు ముందు దళితులకు మేలు చేస్తానని చెప్పి వారిని నిండా ముంచాడు. దళితులతో నాకు బంధుత్వం ఉందని 2019లో నమ్మబలికాడు. వారి ఓట్లను కొల్లగొట్టాడు. దళితుల ఓట్లతో గద్దెనెక్కి వారిని అణచివేతకు గురిచేశాడు.
చంద్రబాబు పెట్టిన పథకాలన్నింటిని జగన్ తీసేశాడు. దళితులు వెనుకబడి వుంటారు కావున వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం చెబుతోంది. ఈ రాజ్యాంగంలో ఉన్న అవకాశాలను తీసి పడేశారు. దాదాపు 27 పథకాలు గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తే జగన్ ఆ 27 పథకాలను తీసేశాడు. భూమి కొనుగోలు పథకం కింద టీడీపీ హయాంలో దాదాపు ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరిస్తే భూమి కొనుగోలు పథకాన్ని తీసేశారు. ఎన్‌ఎస్‌ఎఫ్ డీసీ పథకం కింద దళితులకు కార్లు, ఇన్నోవాలు, ట్రాక్టర్ లు ఇచ్చి టీడీపీ ప్రభుత్వం వారి జీవనాన్ని మెరుగుపరచింది. టీడీపీ స్టడీ సర్కిళ్లను పెట్టి విద్యను అభివృద్ధి చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చి వాటిని ఎత్తేసింది. బాగా చదువుకొని విదేశాలకు వెళ్లాలనుకునేవారి ఆశలను అడియాశలు చేశారు.
జగన్ మీ బిడ్డ మీ బిడ్డ అంటాడే కాని క్యాన్సర్ గడ్డ అని గుర్తించాలి. అవినాష్ రెడ్డిని నీ బిడ్డగా భావించి కాపాడుకుంటున్నావు. దళితులు మీ బిడ్డలెలా అవుతారు. దమ్ముంటే ఈ పథకాలు తీసేయలేదని చెప్పగలరా?’’ అని మాణిక్యలరావు ప్రశ్నించారు. బీజేపీ నేత ఆర్‌డి విల్సన్ మాట్లాడుతూ ‘‘ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వారి ఓట్లు పొంది గద్దెనెక్కారు. నమ్మినవారిని నట్టేట ముంచాడు. నమ్మినవారిని నట్టేట ముంచడమే జగన్ నైజం అది తల్లైనా కావచ్చు, చెల్లైనా కావచ్చు. బంధాలు, అనుబంధాలు ఏవీ చూడరు. దళితులు పూర్తిగా నమ్మి మోసపోయారు. ఢల్లీి నుంచి వచ్చే నిధులు డైవర్ట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ . ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదు. ఎన్‌ఎస్‌ఎఫ్ డీసీల ద్వారా భూమి కొనుగోలు పథకాన్ని నీరుగార్చారు’’ అని ధ్వజమెత్తారు. జనసేన నేత పెదపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ‘‘అంబేద్కర్ పై ప్రేమ, గౌరవం ఉన్నట్లు వైసీపీ నాయకులు నటిస్తున్నారు.
అంబేద్కర్ పై అత్యంత ప్రేమ ఉన్నట్లు సాక్షి మీడియాలో వేసుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పై వైసీపీ నాయకులకు కొంచెం కూడా గౌరవం లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరిచారు. జగన్ దళితుల జీవితాలతో చెలగాటమాడాడు. గత ప్రభుత్వాలు అందించిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లించారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. కార్పొరేషన్ కార్యాలయాల్లో కూర్చోవడానికి కుర్చీలు లేవు, నిధులు లేవు. మరి ఎందుకీ కార్పొరేషన్లు? ఎవరిని ఉద్ధరించడానికి? మాదిగలపై సపరేటుగా ప్రేమ ఉన్నట్లు నటించారు. పవన్ కల్యాణ్ రెల్లి కులస్థుల గురించి మాట్లాడగానే ఎక్కడ రెల్లి కులస్థులు పవన్ వైపు వెళ్లిపోతారో అని జగన్ రెల్లి కార్పొరేషన్ ప్రకటించి వారికి పైసా నిధులివ్వలేదు. వారి అభివృద్ధి కోసం ఏం నిధులిచ్చారో చెప్పాలి’’ అని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.