- డబ్బులకు కక్కుర్తి పడి మనోభావాల తాకట్టు
- లడ్డూ కల్తీ నుంచి ఆలయాలపై దాడుల వరకూ
- వైసీపీ హయాంలో అన్నీ అపవిత్రమే…
- మహాపాపానికి బాధ్యులు తప్పించుకోలేరు
- అసెంబ్లీలోనూ ఈ అంశంపై చర్చిస్తాం
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
విశాఖపట్నం (చైతన్యరథం): తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి, సింథటిక్ ఘీ, రసాయనాలు వాడటంపై దర్యాప్తు సంస్థల విచారణల్లో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం సుమారు 20 కోట్ల లడ్డూలు, దాదాపు 68 లక్షల కిలోల మేర “నెయ్యిగా పిలవబడే” పదార్థాన్ని ఉపయోగించినట్టు తేలిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాలతో తయారైన స్వచ్ఛమైన నెయ్యి కాకుండా, పామ్ ఆయిల్, రసాయ నాలు, ఇతర మూలకాలతో తయారైన సింథటిక్ వాడినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. లాభాల కోసం భక్తుల విశ్వాసాన్ని తాకట్టు పెట్టారని తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం ఆర్థిక అక్రమం మాత్రమే కాదని, హిందువుల మనోభావా లపై ప్రత్యక్ష దాడి అని అన్నారు. రోజుకు 70 వేల నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకునే తిరుమలలో, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. ఈ దుర్మార్గానికి బాధ్యు లైన వారెవరివైనా సరే కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.
ఆలయాలపై దాడులు..వైసీపీ నిర్లక్ష్యం
వైసీపీ హయాంలో కేవలం లడ్డూ వ్యవహారమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగినా నామ మాత్ర కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారని మండిపడ్డారు. ఆలయాలపై దాడులు, హిందువులపై దాడులు జరిగినా ప్రభుత్వ నిర్లక్ష్యంతో దోషులు శిక్ష తప్పించుకున్నారని అన్నారు. జగన్రెడ్డి వ్యక్తిగతంగా నాస్తికుడైనా..అధికారంలో ఉన్నప్పుడు హిందూ విశ్వా సాలను గౌరవించాల్సిన బాధ్యతను విస్మరించారని విమర్శించారు. తన హయాంలో హింసను ప్రోత్సహించి ప్రజలపై దాడులు జరిపించి.. ఇప్పుడు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఐదేళ్ల పాలనలో కల్తీ మద్యం, కల్తీ నిర్మాణాలు, కల్తీ పాలన… చివరికి దేవుడి ప్రసా దానికీ కల్తీ చేసిన పాలన వైసీపీదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
హిందూ ధర్మంపై అవమానం కొనసాగింది
వైఎస్ ఒకప్పుడు “ఏడు కొండలు కాదు రెండు కొండలు” అంటూ కలియుగ దైవాన్ని అవమానించిన ఘటనను గుర్తు చేస్తూ.. అదే ధోరణి జగన్రెడ్డి పాలనలో కొనసాగిందని చెప్పారు. హిందూ ధర్మంపై నమ్మకం లేని నాయకత్వం అధికారంలో ఉంటే వ్యవస్థలు ఎలా దిగజారుతాయో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారమే ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వ్యవహారాన్ని బయట పెట్టి నిజాలను ప్రజల ముందుంచిందని తెలిపారు. లడ్డూ తయారీలో పామ్ ఆయిల్ వాడటం, రసాయనాలు కలవడం, వాటి మూలాల ద్వారా జంతు కొవ్వు కూడా చేరినట్టు నివేదికలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. తిరుపతి లడ్డూ స్వచ్ఛతను కాపాడాల్సిన బాధ్యత అంద రిదని, ముఖ్యంగా పాలకులదని స్పష్టం చేశారు. ఈ కల్తీ వ్యవహా రంపై అసెంబ్లీలో కూడా విస్తృతంగా చర్చించబోతున్నామని, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ప్రతిఒక్కరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. దేవుడి విషయంలో చేసిన పాపానికి బాధ్యులైన ఎవ్వరూ తప్పించుకోలేరని హెచ్చరించారు.
బడ్జెట్ దేశ భవితకు బంగారు బాట
భవిష్యత్ తరాలకు మెరుగైన జీవన ప్రమాణాలు, స్థిరమైన ఉపాధి అవకాశాలు, దేశానికి దీర్ఘ కాలిక ఆదాయ వనరులు సృష్టించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2026 దేశ భవితకు బంగారు బాట వేసిందని పేర్కొన్నారు. ముఖ్యంగా మౌలిక వసతు ల అభివృద్ధికి సుమారు రూ.12 లక్షల కోట్లకు పైగా కేటాయింపు లు పెరగడం దేశ అభివృద్ధిపై కేంద్రానికి ఉన్న స్పష్టమైన దూరదృష్టిని చాటుతుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమని, అదే ఉద్యోగాల సృష్టికి, ఆర్థిక వృద్ధికి పునాదిగా మారుతుందని తెలిపారు. రేపటి తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ బడ్జెట్ రూపొందించబడిం దన్నారు. ఈ చారిత్రక బడ్జెట్కు మార్గనిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో దేశ అభివృద్ధికి తోడ్పడుతున్న కూటమి ప్రభుత్వాన్ని అభినందించారు.










