.17న విజయవాడలో వ్యాపారుల సమరభేరీ
.నాటు సారా మాఫియాను వదిలేసి బెల్లం వ్యాపారులపై దాడులు
.టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్
అమరావతి: వైసీపీ ప్రభుత్వం గత 3 ఏళ్లుగా వ్యాపారస్తుల్ని వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక స్పృహతో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండే వ్యాపారస్తులపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏమాత్రం జాలి, దయ లేకుండా చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు అందరినీ వేధిస్తున్నారని చెప్పారు. ఓ వైపు పన్నుల భారం మరో వైపు రక రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. అధికారికంగా పన్నులు పెంచడమేకాక, అనధికారికంగా వ్యాపారుల నుంచి జే ట్యాక్స్ వసూలు చేయటం దుర్మార్గంగా పేర్కొన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు వ్యాపారుల సంక్షేమానికి పాటుపడితే, జగన్ రెడ్డి మాత్రం పన్నుల మీద పన్నులు వేసి వ్యాపారస్తులను పీల్చుకుతింటున్నారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని వ్యాపారాలను నిలిపివేయించినట్లు తెలిపారు. సినిమా టిక్కెట్ల అంశంలో ప్రభుత్వ జోక్యం ఎందుకని ప్రశ్నించారు.
గతంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన ఉచిత ఇసుకను జగన్ రెడ్డి రద్దు చేసి 32 రకాల వ్యాపారాల్ని దెబ్బకొట్టారని చెప్పారు. ఇసుక రద్దు వల్ల ఐరన్ వ్యాపారులు, బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారులు, ఇటుకల వ్యాపారులు.. ఇలా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ జగన్ రెడ్డి దెబ్బకు తట్టుకోలేక చాలా మంది వ్యాపారులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినట్ల తెలిపారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కళ్లు చల్లబడలేదన్నారు. రాష్ట్రంలో తన మనుషులు తప్ప ఇంకెవరూ వ్యాపారం చేయకూడదన్న దురుద్దేశంతో జగన్ రెడ్డి ట్యాక్స్ లతో వ్యాపారులని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కరోనా విపత్కర సమయంలో ఏ వ్యాపారికైనా ముఖ్యమంత్రి అండగా నిలబడ్డారా? అని అడిగారు. జగన్ రెడ్డి ఇష్టానుసారంగా షాప్ బోర్డులకు, చెత్తకు, లెట్రిన్ లకు ట్యాక్స్, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు. అడిషినల్ లోడ్ ఛార్జీస్, ఏసిడి ఛార్జెస్ అని రెండు రకాలుగా ఒక మీటరుకు కరెంటు బిల్లు రూ. 5 వేల రూపాయలు వస్తే, రూ. 10వేల రూపాయలకి పైగా వసూలు చేస్తున్నారని వివరించారు. జగన్ రెడ్డి పర్యటనల సందర్భంగా ఏ కారణం లేకుండా షాపులు మూయించి పరదాలు కడుతూ తమ వ్యాపారాలకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పారు.
పశ్చిగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగడం వల్లే బాధితులు చనిపోయారని డాక్టర్ల నివేదికలో వెల్లడైనా, నాటు సారా మాఫియాని వదిలేసి ఎక్సైజ్ అధికారులు బెల్లం వ్యాపారులపై యుద్ధం ప్రకటించినట్లు తెలిపారు. సెబ్ అధికారులని అడ్డం పెట్టుకొని కేజీ బెల్లం దొరికినా కూడ వాళ్లని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిత్రహింసలు గురిచేశారని చెప్పారు. ఆ చిత్రహింసలు భరించలేని కొంత మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం కొల్లూరులో దుర్గారావు అనే బెల్లం వ్యాపారిని సెబ్ అధికారులను బంధించి చిత్రహింసలకు గురి చేస్తే, అతను ఆ తరువాత రైలుపట్టాలపై శవమై కనిపించారని, దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఈ ఘటపై ముగ్గురు పోలీసు అధికారులని ఎస్పీ సస్పెండ్ చేయడం వాస్తవం కాదా? పోలీసుల తప్పులేకపోతే ఎందుకు సస్పెండ్ చేశారు? బెల్లం అమ్మడం తప్పా? ఎందుకు వ్యాపారస్థులని జగన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారు? అని ప్రశ్నించారు. వ్యాపారస్థులపై వైసీపీ ప్రభుత్వ వేధింపులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 17న విజయవాడలో సమరభేరి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో వ్యాపారస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇప్పటి వరకు వ్యాపారుల దగ్గర నుంచి జే ట్యాక్స్ వసూలు చేసినవారు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తాడేపల్లి ప్యాలెస్ లోని నాయకులు భయంతో వణికపోతున్నట్లు డూండి రాకేష్ చెప్పారు.