విజయనగరం (చైతన్య రథం): రాష్ట్రస్థాయి భూరికార్డుల్లో తేడాలున్నట్టు క్షేత్రస్థాయి పర్యటనల్లో గుర్తించామని, వాటిని సరిచేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లడిరచారు. శుక్రవారం విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా ఆయన కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. భూముల రికార్డుల పరిశీలన, రైతులు, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రోజుకో జిల్లాచొప్పున పర్యటిస్తున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగా విజయనగరం జిల్లాలో భోగాపురం మండలం పోలిపల్లి, బసవపాలెం గ్రామాలను సందర్శించామని, ఎఫ్‌సిఓ, పాత అంగల్, 22ఏ జాబితాలను పరిశీలించామన్నారు.
కొన్ని రికార్డుల్లో, భూముల వర్గీకరణలో గుర్తించిన తేడాలను సరిచేయమని ఆదేశాలను జారీ చేశామన్నారు. జిల్లాలో సుమారు 5,700 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేయడం జరిగిందని, దానిలో 191 ఎకరాలు వరకూ రిజిష్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయన్నారు. నిబంధనల ప్రకారం ఫ్రీహోల్డ్ జరిగిందా లేదా?, రిజిష్ట్రేషన్లు సక్రమంగా జరిగాయా.. లేదా? అన్నది కూడా పరిశీలించామన్నారు. భూ సమస్యలకు సంబంధించి ప్రజలనుంచి సుమారు 80 వినతులు స్వీకరించామని, వాటన్నిటినీ పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని సిసోడియా వెల్లడిరచారు. మీడియా సమావేశంలో కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ పాల్గొన్నారు.
శిశోడియా విస్తృత పర్యటన
ఇదిలావుంటే, రాష్ట్ర రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.శిశోడియా జిల్లాలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. భోగాపురం, ఎస్.కోట, వేపాడ మండలాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేశారు. భూరికార్డులను పరిశీలించి భూముల వర్గీకరణపై వివిధ ప్రభుత్వ శాఖలవద్ద రికార్డుల్లో తేడాలను గుర్తించారు. జిల్లా కేంద్రంలో ఆర్డీవోలు, తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లతో సమావేశమై 22ఏ కేటగిరీ భూములు, ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్, భూముల రీసర్వే అనంతరం తలెత్తిన పరిస్థితులు, గృహనిర్మాణానికి అవసరమైన భూముల గుర్తింపు తదితర అంశాలపై సూచనలు చేశారు. భూముల వర్గీకరణ విషయంలో రానున్న రోజుల్లో తహశీల్దార్ వద్ద, రిజిష్ట్రార్ల వద్ద రికార్డులు ఒకేలా నమోదై వుండాలని స్పష్టంచేశారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి భూసమస్యలపై వినతులు స్వీకరించారు.
జిల్లా పర్యటన నిమిత్తం ఉదయం భోగాపురం మండలం పోలిపల్లి నిర్వాసితుల పునరావాస కాలనీకి చేరుకున్న రెవిన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, ఆర్.డి.ఓ. ఎం.వి.సూర్యకళ తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి మండలపరిషత్ ప్రాథమిక పాఠశాలకు చేరుకొని గ్రామ రెవిన్యూ రికార్డులను పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడి భూముల క్రయవిక్రయాలపై సమాచారం సేకరించారు. అనంతరం భోగాపురంలో తహశీల్దార్ కార్యాలయం, సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలను సందర్శించి భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
బసవపాలెం చేరుకొని అక్కడ గ్రామస్థులతో మాట్లాడి భూసర్వే జరిగిన తీరుపై ఆరా తీశారు. భూముల సర్వే పూర్తయిన తర్వాత పట్టాదారు పాస్‌పుస్తకాలు ఎవరికైనా అందాయా? భూహక్కు పత్రాలు ఇచ్చారా లేదా? అనే అంశంపై మాట్లాడారు. ఎవరివద్దయినా పాస్‌పుస్తకాలు వుంటే చూపించాలని కోరారు. గ్రామంలోని రెవిన్యూ రికార్డుల్లో వున్న పలువురు భూయజమానుల పేర్లు చదివి వినిపించి వారి భూముల్లో ఎవరు సాగు చేస్తున్నారు, ఏయే పంటలు సాగు చేస్తున్నారని ఆరా తీశారు. గ్రామంలోని భూరికార్డులను పరిశీలించారు.
జిల్లా కేంద్రానికి చేరుకొని కలెక్టర్ కార్యాలయంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, సబ్ రిజిష్ట్రార్లతో సమావేశమై పలు అంశాలపై సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి భూసమస్యలపై వినతిపత్రాలు ఇచ్చేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను సావధానంగా విన్నారు. అనంతరం ఎస్.కోట, వేపాడ మండలాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు.