- ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించాలి
- గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.2,643 కోట్ల ఆదాయం
- 2.45 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు
- స్వచ్ఛాంధ్రతో అమలు.. ఆదాయాన్ని కార్మికులకు అందజేస్తాం
- పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించేలా ప్రక్షాళన చేస్తాం
- ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్
తాడేపల్లి(చైతన్యరథం): పనికిరాదని పడేసే చెత్తతో కోట్ల రూపాయల సంపద సృష్టించ వచ్చని, లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పేర్కొ న్నారు. శుక్రవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసో ర్స్ మేనేజ్‌మెంట్ (ఎస్‌ఎల్‌ఆర్‌ఎం) ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో గార్బేజ్ టూ గోల్డ్ పేరుతో ఈ ప్రదర్శన జరిగింది. అనంతరం మీడియాతో పవన్‌కళ్యాణ్ మాట్లాడారు. ఘన వ్యర్థాలను 12 గంటల్లోపు సేకరించగలిగితే సంపద వస్తుంది…వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయంగా చేపట్టాలని సూచించారు. ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే ఏడాదికి రూ.2643 కోట్ల సంపద సృష్టించడంతోపాటు 2.42 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని తెలిపారు.
పిఠాపురం నుంచే మార్పు మొదలుపెడతాం
ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలంటే రోజుకు రెండుసార్లు చెత్తను సేకరించాలి. అంతకంటే ముందు దీనిపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలి. అందుకు మాస్టర్ ట్రైనర్స్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. వాళ్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ ఇస్తాం. మార్పు నా నుంచే మొదలుపెడతాం. ముందుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తాం. ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తామని చెబితే వారి సాయం తీసుకుం టాం. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. పంచాయతీలలో అవగాహన పెంచుతాం. ఇది చాలా కష్టమైనది, ఓపికతో కూడుకున్నది. దీనిని గనుక విజయవంతంగా చేయగలిగితే మాత్రం అద్భుతాలు సృష్టించవచ్చు. దీనిని 250 ఇళ్లు, ఒక సమూహంగానే కాకుండా ఒక కుటుంబం కూడా చేసుకునే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర కార్యక్ర మం ద్వారా దీనిని ప్రజల్లోకి తీసుకెళతాం. చెత్త ద్వారా వచ్చే సంపదను ఆయా కార్మికులకు కేటాయిస్తామని తెలిపారు.
అన్ని అనర్థాలకు ఒక ఐఏఎస్ కారణం
పంచాయతీలను గత పాలకులు అనేక కారణాలతో నిర్వీర్యం చేశారు. బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చారు. పంచాయతీలు సమూలంగా ప్రక్షాళన జరగాలి. స్వయం సమృద్ధిగా పంచాయతీలు ఎదిగేలా ఆలోచనలు చేస్తున్నాం. గ్రామాల్లో రోడ్ల వెంట కొబ్బరి చెట్లు పెంచడం ద్వారా కొంత ఆదాయం సమకూర్చుకునే ఆలోచన చేస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఏ సమీక్ష చేసినా అన్ని అనర్థాలకు ఒక ఐఏఎస్ కారణమని చెబుతున్నారు. ఆయన ఇప్పుడు సర్వీసులో లేరు. ఎవరిని బాధ్యులను చేయాలి? నిధులు ఎలా రికవరీ చేయాలి? కేవలం కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
గ్రామీణ రోడ్ల కోసం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేదు
గ్రామీణ రోడ్లపై జరిగిన సమీక్షలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ చేయకపోవడం మూలంగా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల కాలేదు. 30 శాతం నిధులు విడుదల చేసుంటే రోడ్ల నిర్మాణం అద్భుతంగా జరిగేది. రకరకాల పేర్లు చెప్పి నిధులు దారిమళ్లించారు తప్పితే మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయలేకపోయారు. కొన్ని చోట్ల రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. ఇలా అన్ని వ్యవస్థల్లో సవాళ్లుఉన్నాయి. ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కన్నబాబు, ఎస్‌ఎల్‌ఆర్‌ఎం ప్రాజెక్ట్ డైరెక్టర్ సి.శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.