- 18న ముగింపు, 20న భోగాపురం సమీపంలో ముగింపు సభ
- హాజరుకానున్న చంద్రబాబు, పవన్, ఇరు పార్టీల అగ్రనేతలు
కాకినాడ : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర శనివారం నుంచి పున:ప్రారంభంకానుంది. తుఫాన్ నేపథ్యంలో ఈనెల 4 నుంచి పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడిరది. పార్టీ నేతలు, క్యాడర్ తుఫాన్ సహాయక చర్యల్లో నిమగ్నం కావాల్సిన దృష్ట్యా పాదయాత్రకు విరామం ఇచ్చారు. తిరిగి శనివారం నుంచి మళ్లీ యువగళం పాదయాత్ర మొదలుకా నుంది. పాదయాత్ర ఆపిన చోటు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని శీలంవారిపాకలు జంక్షన్ నుంచి ఉదయం 10 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఈనెల 11న తుని రూరల్ పరిధిలోని తేటగుంట హైవేపై 3వేల కిలోమీటర్ల పాదయాత్రను లోకేష్ పూర్తి చేయనున్నారు. అందుకు గుర్తుగా అక్కడే పైలాన్ ఆవిష్కరణ జరుగనుంది. ఈ పాదయాత్ర ఈ నెల 18న ముగుస్తుంది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో 20వ తేదీన ముగింపు సభ జరగనుంది. ఈ సభకు అనువైన స్థలం కోసం పార్టీ నేతలు అన్వేషిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహా ఇరు పార్టీల అగ్రనేతలు ఈ సభలో పాల్గొంటారు.