క్షేత్రస్థాయిలో పనిచేసేవారిని నేరుగా గుర్తించాలనేదే మా లక్ష్యం
పార్టీ ఆవిర్భావం దినోత్సవంలో బాగా పనిచేసిన 19మంది కార్యకర్తలకు వేదికపై అవకాశం
తెలంగాణ తొలి, మలి ముఖ్యమంత్రులు తెలుగుదేశం యూనివర్సిటీనే
తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే కార్ఖానా
2019-24 మధ్య సామాన్య ప్రజలపై దాడి చేశారు
కలిసికట్టుగా పనిచేస్తే మనం ఆశించిన మార్పు సాధ్యమవుతుంది
టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్‌లతో ‘కాఫీ కబుర్ల‘లో లోకేష్ దిశానిర్దేశం
మంగళగిరి (చైతన్య రథం): “ఇది టీడీపీ 3.0 వర్షన్. పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చి ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకెళ్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్‌లకు శిక్షణ తరగతుల్లో భాగంగా ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. “తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ లాంటిది. ఎంతోమంది గొప్ప నాయకులను తెలుగుదేశం పార్టీ తయారుచేసింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి తెలుగుదేశం యూనివర్సిటీనే, రెండో ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం యూనివర్సిటీనే. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారుచేసే కార్ఖానా. గతంలో గండిపేటలో నిరంతరం పార్టీ శిక్షణ తరగతులు జరిగేవి. చాలామంది ఉప ముఖ్యమంత్రులు అయినవారున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అయినవారు ఉన్నారు. ఇప్పుడు ఏడాదిలో కనీసం 300 రోజులు పార్టీ శిక్షణ తరగతులు జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం మీకు పదవులి ఇస్తున్నాం, కానీ ఏం చేయాలో చెప్పడం లేదు. చాలామందికి వారి బాధ్యతలు ఏంటో తెలియవు. వేటి ఆధారంగా పార్టీ తమను గుర్తిస్తుందో చాలామందికి తెలియదు. ఈ శిక్షణ తరగతుల ద్వారా వారికి అవగాహన వస్తుంది” అన్నారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా
94శాతం సీట్లు కూటమి కైవసం చేసుకుంది
“పార్టీలో పనిచేసే వారిని గుర్తించేందుకు యాప్ తీసుకొచ్చాం. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల పనిచేసేవారిని, చేయనివారిని గుర్తించవచ్చు. ఓవైపు శిక్షణ తరగతులు, మరోవైపు ‘మై టీడీపీ’ యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం. ఓ కార్యక్రమానికి పిలుపునిస్తే దానిని సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 2019నుంచి 2024 వరకు మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. అక్రమ కేసులు పెట్టారు. దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపైనే దాడి చేశారు. ఏ తప్పూ చేయని చంద్రబాబుని 53 రోజులపాటు రాజమండ్రి జైలులో బంధించారు. దీంతో అందరం ఉద్యమించాం. ఆ ఉద్యమంవల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 94శాతం సీట్లు కూటమి కైవసం చేసుకుంది. వైసీపీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారు. ఇందుకువారి అహంకారమే కారణం. నాకు రాష్ట్రంలో మూడో అత్యధిక మెజార్టీ వచ్చిందని అహంకారానికి పోకూడదు. అందరినీ కలుపుకొని పోవాలి. కులాలకు అతీతంగా అందరూ నాకు ఓటేశారు కనుకనే అంత మెజార్టీ వచ్చింది. నాపై బాధ్యత పెరిగింది. నా పనులు సక్రమంగా చేస్తున్నాను. దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు అహంకారాన్ని ఒప్పుకోరు. అది గమనించాలి” అన్నారు.
2019-24మధ్య సామాన్య ప్రజలపై దాడి చేశారు
తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది చాలా కీలకపాత్ర. యూనిట్, బూత్‌లను సమర్థంగా నడిపించగల వ్యక్తులు మీరు. మీపై బాధ్యత ఉంది. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమీక్షించాలి. మీరు పార్టీని నడిపించాలి. అందుకే పార్టీ సిద్ధాంతాలు, విధులు, బాధ్యతలపై శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు పద్ధతి ప్రకారం నెరవేరుస్తున్నాం. సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం. 2019-24 మధ్య సామాన్య ప్రజలపై దాడి చేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య కలిసి హత్య చేశారు. డాక్టర్ సుధాకర్‌ను హింసించారు. తన సోదరిని వేధిస్తున్నారని ప్రశ్నించిన అమర్ నాథ్ గౌడ్‌ను చంపారు. మన పార్టీకి చెందిన తోట చంద్రయ్యను హత్య చేశారు. ఇవన్నీ మనం మర్చికూడదు. ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకురావాలి” అని దిశానిర్దేశం చేశారు.
పార్టీకే ప్రథమ ప్రాధాన్యత
“తెలుగుదేశం పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు వంటింది. వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి సమయం కేటాయిస్తున్నాను. ఆ వారంలో నా శాఖకు సంబంధించిన కార్యక్రమం ఉన్నా పార్టీకే ప్రాధాన్యత ఇస్తున్నా. అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రతి బూత్ లో మెజార్టీ తీసుకువస్తే 175 స్థానాల్లో విజయం సాధించవచ్చు. నాకు 91వేల మెజార్టీ వచ్చినా 8శాతం బూత్ లలో మైనస్ వచ్చింది. దీంతో ఇప్పటి నుంచే నేను కసరత్తు చేస్తున్నా. రాష్ట్రవ్యాప్తంగా బలహీనంగా ఉన్న బూత్ ల బలోపేతంపై దృష్టిసారించాం. క్లస్టర్ పరిధిలో ఉన్న బలహీన బూత్ ల బలోపేతంపై మీరు దృష్టిసారించాలి” అని సూచించారు.
క్లస్టర్ ఇంఛార్జ్ పొలిట్‌బ్యూరో స్థాయివరకు ఎదగాలి
“పార్టీలో కూడా నిరంతరం మార్పు రావాలి. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువగా ఉండకూడదు. క్లస్టర్ ఇంఛార్జ్ పొలిట్ బ్యూరో స్థాయి వరకు రావాలి. గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరోలో కూర్చోవాలి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇది నాకు నాలుగోసారి. ఈసారి నాకు ఆ బాధ్యత వద్దని మన నాయకుడికి చెప్పా. వేరేవారికి అవకాశం ఇవ్వాలని, పార్టీలో పనిచేసే వారు చాలామంది ఉన్నారని చెప్పా. ఈ సంస్కరణ కోసం పార్టీలో నేను నాలుగేళ్లు పోరాడా. మంచి కోసం మార్పులు తీసుకువస్తున్నాం. నేను అనుకున్న మార్పులు తీసుకువచ్చే వరకు వదిలిపెట్టను. ఒకటికి పదిసార్లు చర్చించాలి. నమ్ముకున్న సిద్ధాంతం కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. అలిగి ఇంట్లో కూర్చొంటే నష్టపోతాం. బహిరంగ వేదికలపై కాకుండా ఎవరైనా తమ అభిప్రాయాలను ‘మై టీడీపీ’ యాప్ ద్వారా తెలియజేయవచ్చు. మేం తీసుకునే పది నిర్ణయాల్లో మూడు తప్పవుతాయి. సరిదిద్దుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని లోకేష్ వివరించారు.
ఇది టీడీపీ 3.0 వర్షన్
“ఏ పార్టీలోనూ ఈవిధంగా శిక్షణ తరగతులను నిర్వహించడం లేదు. మేం కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకుంటున్నాం. ఇదీ తెలుగుదేశం పార్టీ అంటే. కలిసికట్టుగా పనిచేస్తే మనం ఆశించిన మార్పు సాధ్యమవుతుంది. పనిచేసిన వారిని ప్రోత్సహిస్తాం. మధ్యవర్తులు లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే వారిని నేరుగా గుర్తించాలనేదే మా లక్ష్యం. ఇవాళ చంద్రబాబు చుట్టూ కోటరీ లేదు. అన్ని విషయాలను ఆయన నేరుగా తెలుసుకుంటున్నారు. నేనుకూడా క్షేత్రస్థాయినుంచి అభిప్రాయాలు తీసుకుంటాను. ఇది కొత్త పార్టీ టీడీపీ 3.0 వర్షన్‌కి వచ్చాం. మార్పు తీసుకువస్తాం. ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకువెళ్తాం. ‘మై టీడీపీ’ యాప్ ద్వారా కార్యక్రమాలు చేపడతాం. అందరూ యాప్‌తో అనుసంధానం కావాలి. పనిచేసే వారిని గుర్తిస్తాం. ఈనెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో వేదికపై పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుతోపాటు ‘మై టీడీపీ’ యాప్, క్లస్టర్, మండల పార్టీ అధ్యక్షుడు, అనుబంధ విభాగాలు.. ఈ విధంగా రాష్ట్రంలోనే నెం.1గా నిలిచిన 19మంది కార్యకర్తలను గుర్తించి నాయకుడితోపాటు వేదికపై కూర్చొనే అవకాశం కల్పిస్తాం. కార్యకర్తే అధినేత అనేది మా శాసనం. అది మా గైడింగ్ ప్రిన్సిపుల్, మా గైడింగ్ ఫోర్స్. ఏ కార్యక్రమం చేసినా కార్యకర్తలను గుర్తించాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వివరించారు.
















