- ప్రభుత్వ పరిహారం పంపిణీపై సీపం ఆదేశం
- సచివాలయంలో అధికారులతో సమీక్ష
- రూ.588 కోట్లు జమ చేశామన్న అధికార్లు
- 3శాతం కేసుల్లో సాంకేతిక సమస్యలున్నాయి
- పరిష్కరించి పరిహారం అందచేయాలన్న సీఎం
అమరావతి (చైతన్య రథం): వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు ప్రభుత్వ సాయం నూరుశాతం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అందించాల్సిన రూ.602 కోట్ల పరిహారం పంపిణీకిగాను రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేశామని అధికారులు వివరించారు. ఇందులో రైతులకు పంట నష్టపరిహారం కింద రూ.301 కోట్లు పరిహారం అందించగా… మిగిలిన మొత్తం ఇళ్లు, షాపులు మునిగి ఆస్తులు నష్టపోయిన వారికి అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం బాధితుల అకౌంట్లకు నగదు డీబీటీ పద్ధతిలో అందించగా….. అందులో 97 శాతం లబ్ధిదారుల అకౌంట్లకు పరిహారం జమ అయ్యిందని వివరించారు.
అయితే 22,185 మంది లబ్ధిదారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా నగదు జమవ్వలేదన్నారు. బ్యాంక్ అంకౌట్తో ఆధార్ అనుసంధానం అవ్వకపోవడం, ఆధార్ అకౌంట్ మ్యాచ్ కాకపోవడం, అకౌంట్ యాక్టివ్‌గా లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, అకౌంట్ తప్పుగా నమోదవ్వడం, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో పరిహారం సొమ్ము లబ్ధిదారుల అకౌంట్లలో జమకాలేదని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు బ్యాంక్‌కు వెళ్లి కెవైసీ పూర్తి చేసుకోవాలని కోరామని… ంండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వివరించారు. బ్యాంకు అకౌంట్లకు మరోసారి డబ్బులు బదిలీ చేశామని.. ఈ రోజు సాకేంతిక సమస్య పరిష్కరించుకున్న వారి అకౌంట్లలో డబ్బులు జమయ్యాయని వివరించారు.
సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికీ పరిహారం అందజేయాలని… ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండడానికి వీల్లేదని అధికారులకు సీఎం సూచించారు. అర్హులెవరికీ సాయం అందకుండా ఉండే అవకాశం ఉండకూడదని స్పష్టం చేశారు. ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని… వాటిని పరిశీలించి అర్హతవుంటే ప్రభుత్వనుండి సాయం అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. అర్హులుగా ఎంపికై ఎవరికైతే డబ్బులు వారి అకౌంట్లలో పడలేదో….. వారు సచివాలయ సిబ్బంది ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ప్రజలను కోరుతున్నామని అధికారులు తెలిపారు. వచ్చే శుక్రవారానికి అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి పూర్తిస్థాయిలో పరిహారం పంపిణీ పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు. వాహనాలకు బీమా చెల్లింపు, రుణాల రీషెడ్యూల్, అర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ వంటి అంశాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్షలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.