- పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
- అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్, గ్యాస్ పైప్ లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు
- మార్చిలోగా డెవలప్మెంట్ ప్లాన్ పూర్తి చేయాలని మంత్రి లోకేష్ ఆదేశం
- పనుల్లో వేగంతో పాటు నాణ్యతా ముఖ్యమని స్పష్టీకరణ
ఉండవల్లి (చైతన్యరథం): మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నూతన రూపురేఖలు సంతరించుకోనుంది.కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్, గ్యాస్ పైప్ లైన్ పనులపై అధికారులకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశా నిర్దేశం చేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో శుక్రవారం మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌ను రాష్ట్రంలో ఉత్తమ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దాలని అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు. వచ్చే మార్చి నాటికి అభివృద్ధి పనులపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కార్పొరేషన్ అభివృద్ధికి ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా అడుగులేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్‌లో పార్కులు, శానిటేషన్‌పైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే శానిటేషన్ విషయంలో బాగా పనిచేశారని కొనియాడుతూ, ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ మంగళగిరిలో భాగంగా పలు పనులు చేపట్టాలని తెలిపారు. అభివృద్ధి పనులు నిర్వహణలో వేగంతో పాటు నాణ్యత కూడా ముఖ్యమన్నారు. నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ అలీమ్ బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ డిప్యూటీ కమిషనర్ అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.