సెస్ రూపంలో రూ.400 కోట్ల ఆదాయానికి గండి
జీరో వ్యాపారం, ధరల కోతతో రూ.2 వేల కోట్లు స్వాహా
వ్యాపారుల లైసెన్సుల రెన్యువల్‌లోనూ అక్రమ వసూళ్లు
మిల్లుల వద్ద ముడుపులతో యథేచ్ఛగా కల్తీ కారం వ్యాపారం
రైతులకు వివిధ రూపాల్లో రూ.100 కోట్లు ఎగ్గొట్టారు
ఉద్యోగుల సహకారంతో వైసీపీ నేతల దోపిడీ వ్యవహారం
విచారణ జరిపించాలని మంత్రికి మాజీ చైర్మన్ వినతి
ఐదేళ్ల అక్రమాలను వెలికితీసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
అమరావతి(చైతన్యరథం): గుంటూరు మిర్చి యార్డులో గత ఐదేళ్లుగా చేసిన వైసీపీ నేతల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. మిర్చి యార్డులో దోపిడీ, అక్రమాలపై విచారణ జరిపించాలని మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నం సుబ్బారావు, అసోసియేషన్ నాయకుడు రామకృష్ణ సోమవారం మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో ప్రజా వినతుల కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేశారు. గత ఐదేళ్లు జరిగిన దోపిడీ వివరాలను వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండళ్లలో సుదీర్ఘకాలం కాంగ్రెస్, వైసీపీకి చెందిన నేతలే ఉన్నారు. దీంతో విచ్చలవిడిగా దిగుమతి లైసెన్సులు మంజూరు చేశారు. దీనివల్ల మిర్చి దిగుమతి అసోసియేషన్, హమాలి, వేమన్ యూనియన్లలో మెజార్టీ సభ్యులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. అక్కడున్న వ్యాపారుల నుంచి నయానో, భయానో చందాలు, మామూళ్లు వసూలు చేస్తూ ఈ డబ్బుతో అసాంఘిక కార్యకలాపాలు, దౌర్జన్యాలు, దొమ్మీలు చేస్తున్నారని ఫిర్యాదులో వివరించారు.
ఆదాయానికి గండి..జీరో వ్యాపారంతో స్వాహా
ఫిర్యాదులో మిర్చి యార్డు ఉద్యోగుల అవినీతిని వివరించారు. అక్కడ పనిచేస్తున్న సెక్రటరీ ఐ.వెంకటేశ్వర్‌రెడ్డి, పదోన్నతి పొంది ప్రస్తుతం సత్తెనపల్లిలో గ్రేడ్-2 సెక్రటరీగా పనిచేస్తున్న కె.శివారెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ కె.జయరామిరెడ్డి, వి.ఆనంద్‌భాస్కర్, సూప ర్‌వైజర్లు గడ్డం శివారెడ్డి, సి.హెచ్.శివారెడ్డి, కె.సాంబిరెడ్డి, ఫిరంగిపురంలో పనిచేస్తున్న వి.శ్రీకాంత్, షేక్ కరీమ్ అక్రమంగా భారీగా డబ్బులు వసూలు చేశారు. గుంటూరు మిర్చి యార్డులో ప్రతి ఏడాది రూ.16 వేల కోట్ల లావాదేవీలు జరుగుతాయి. ఇందుకు ఒక శాతం సెస్ రూపంలో ఏడాదికి రూ.160 కోట్లు రావాలి. అయితే సగం పైగా జీరో వ్యాపారం, ధరల తగ్గింపుతో ఏడాదికి సుమారు రూ.80 కోట్ల నష్టం జరిగింది. ఈ ఐదేళ్లలో రూ.400 కోట్లు మార్కెట్ ఆదాయానికి గండి పడిరది. దీనికితోడు 5 శాతం జీఎస్టీ రావాల్సి ఉన్నా ఆ ఆదాయానికి కూడా గండి పడిరది. ఏడాదికి రూ.800 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.4,000 కోట్లు జమకావాల్సి ఉండగా కేవలం రూ.2,000 కోట్లు మాత్రమే జమైంది. రూ.2,000 కోట్లు జీరో వ్యాపారం, ధర కటింగ్ రూపంలో స్వాహా చేశారని తెలిపారు.
లైసెన్సుల రెన్యువల్‌లో దోపిడీ
కొంతమంది కమీషన్ వ్యాపారులకు ఈ కొనుగోలు యాప్ ద్వారా షాపులు కేటా యించారు. కేటాయించిన షాపులకు ఎస్‌ఎఫ్‌టీ ద్వారా అద్దె నిర్ణయించారు. అయితే అద్దె ఎక్కువగా ఉందని వ్యాపారుల కోరిక మేరకు రూ.1.50 లక్షలు తీసుకుని 50 శాతం అద్దె మినహాయింపు ఇచ్చారు. 2023-2028 సంవత్సరానికి సెక్రటరీ ఐ.వెంకటేశ్వర్ రెడ్డి, అప్పటి ఇన్‌చార్జ్ చైర్మన్‌గా ఉన్న సుధాకర్‌రెడ్డి కమీషన్ వ్యాపారుల 400 లైసెన్స్‌లు రెన్యువల్ చేశారు. దీనికి ఒక్కొక్క వ్యాపారి నుంచి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారు. మార్కెట్ యార్డ్‌లో సుమారు 180 మంది కమీషన్ వ్యాపారులకు సంబంధించిన పార్టనర్ షిప్ డీడ్‌ను మార్చి, లైసెన్స్‌లు బదిలీ చేయడానికి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షకు పైగా వసూలు చేశారు. యార్డ్‌కు వచ్చిన సరుకుకు, రికార్డు లలో నమోదు చేసిన సరుకుకు సంబంధం లేదు. ఈ-నామ్‌లో తక్కువగా నమోదు చేసి జీరో, బిల్లు టూ బిల్లు, కట్ బిల్ వ్యాపారాలను బాగా ప్రోత్సహించి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేశారు. మార్కెట్ యార్డ్‌లో వ్యాపారులకు సీజన్‌లో అదనపు ప్లాట్స్ కేటాయిస్తూ అద్దెతో పాటు ఫీజు టూ ఫీజు సొమ్మును వసూలు చేశారు. ప్రజల ఆరో గ్యాన్ని ఫణంగా పెట్టి కారం మిల్లుల వద్ద ముడుపులు తీసుకుంటూ యథేచ్ఛగా కల్తీ కారాన్ని ప్రోత్సహించారు.
విధులు నిర్వహించకుండానే జీతాలు
పది మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు మార్కెట్ యార్డులో విధులు నిర్వహించకుండా జీతభత్యాలు పొందుతున్నారు. వారు వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారు. అందులో ముగ్గురు మాచర్ల నుంచి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సిఫారసు ద్వారా ఉద్యో గాలు పొందారు. కనీసం రిజిస్టర్‌లో సంతకాలు చేయకుండానే జీతాలు తీసుకుం టున్నారు. మరొకరు కలెక్టర్ కార్యాలయం నుంచి సోషల్ మీడియా ద్వారా టీడీపీకి వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. ఆధారాలతో సహా జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా అతడిని విధుల నుంచి తొలగించారు. వీరందరి దగ్గర నుంచి సిఫార్సులతో పాటు ముడుపులు తీసుకుని ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చారు.
రైతులకు రూ.100 కోట్లు ఎగ్గొట్టారు
ఈ ఐదేళ్లలో వ్యాపారులు వివిధ రూపాల్లో సుమారు రూ.100 కోట్లు రైతులకు ఎగ్గొట్టారు. కొంతమంది వ్యాపారులు వైసీపీ నేతల అండదండలతో దివాలా తీసినట్లు ఐపీ దాఖలు చేశారు. వాస్తవానికి వారు నష్టపోకపోయినా రైతులకు ఎగ్గొట్టేందుకు ఇలాం టి మోసాలకు పాల్పడ్డారని, వాటన్నింటిని తిరిగి నష్టపోయిన రైతులకు ఇప్పించాలని మిర్చి యార్డు మాజీ చైర్మన్ కోరారు. 2019 జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో రూ.15 వేల కోట్ల విలువ చేసే క్రయవిక్రయాలు మొత్తం అక్రమంగా జరిగాయని ఫిర్యాదులో వివరించారు. అప్పట్లో దీనిపై మొక్కుబడి విచారణ జరిగిందే తప్ప ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని..రికార్డుల్లో లావాదేవీలను తారుమారు చేశారని పేర్కొన్నారు. ఈ కోట్లాది రూపాయల కుంభకోణానికి అప్పటి మార్కెట్‌యార్డ్ ఇన్‌చార్జ్ సెక్రటరీగా పనిచేసిన ఎన్.శ్రీనివాసరావు (డిప్యూటీ డైరెక్టర్) బాధ్యులని తెలిపారు. ప్రస్తుతం ఇతను దుగ్గిరాల మార్కెట్ యార్డ్‌లో సెక్రటరీగా పనిచేస్తున్నారని, ఇతనికి మరో 10 మంది సూపర్‌వైజర్లు సహకరించారని తెలిపారు. ఈ అంశంపై పునర్విచారణ జరిపించి అందు కు బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
మార్కెట్ యార్డ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించి అధికారులు, కమీ షన్ వ్యాపారులు వైసీపీకి తమవంతు సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదు. కానీ దీనికి భిన్నంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి, గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించి సభలు, సమావేశాలు పెట్టారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమా వళిని ఉల్లంఘించడమే అవుతుంది. వీటిపై ఫిర్యాదు చేయగా నామమాత్రపు చర్యలు తీసుకున్నారు. అసలు దోషులు జేడీ కమ్ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ శ్రీనివాసరావు, మరికొంత మంది సూపర్‌వైజర్లను వదిలేశారు. ఎన్నికల సమయంలో మిర్చి యార్డ్‌లో పనిచేస్తున్న డీఈవో ఖాదర్ బాషా సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, నరేం ద్ర మోదీపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా అతడిని విధుల నుంచి తొలగించారు. అయినా అధికారులకు డబ్బు ఆశచూపి విధుల్లో చేసేందుకు ప్రయత్నం చేస్తూ మార్కెట్ యార్డ్‌ను వైసీపీ ఎన్నికల కార్యాలయంగా మార్చారు. గత ఐదేళ్లలో మిర్చి యార్డ్‌లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులు, సూపర్‌వైజర్లపై విచారణ జరిపించాలని, నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.