- శరవేగంగా బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు
- నేటికల్లా పూర్తయ్యేలా యుద్ధప్రాతిపదికన చర్యలు
- డ్రోన్ లైవ్ ద్వారా పర్యవేక్షించిన లోకేష్
- క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల
అమరావతి(చైతన్యరథం): విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లు పూడ్చివేతలో మంత్రి లోకేష్ కృషి ఫలిస్తోంది. లోకేష్ పర్యవేక్షణలో గండ్ల పూడ్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి. గంటగంటకు డ్రోన్ లైవ్ ద్వారా పరిస్థితిని మంత్రి లోకేష్ సమీక్షిస్తున్నారు. అటు క్షేత్రస్థాయిలో ఫ్లడ్ లైట్ల వెలుగులో పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. గురువారం కల్లా ప్రధానమైన 3 గండ్లు పూడ్చివేత పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు సమీక్షలో అధికారులు తెలిపారు. కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరుకి మూడు చోట్ల గండ్లు పడ్డాయి. 200 మీటర్ల మేర గండ్లు పడడంతో సింగ్‌నగర్, ఇతర ప్రాంతాల మీద బుడమేరు విరుచుకుపడిరది. వరద ఉధృతి తగ్గడంతో గండ్లను పూడ్చే పనులు ప్రారంభించారు. బుడమేరు గండ్లు పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి లోకేష్ హుటాహుటీన బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతానికి వెళ్లారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ అధికారులతో కలసి మంత్రి లోకేష్ గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. కుడి,ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్ల తీవ్రత, ఎప్పటి లోగా గండ్లు పూడ్చగలం అని పూర్తి వివరాలను అధికారులను అడిగి మంత్రులు లోకేష్, నిమ్మల తెలుసుకున్నారు. గత ఐదేళ్లలో కనీస మరమ్మత్తుల పనులు కూడా చెయ్యకపోవడమే గండ్లు పడటానికి ప్రధాన కారణమని మంత్రులకు అధికారులు వివరించారు. గండ్లు పడడానికి ప్రధాన కారణం గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మట్టి తవ్వకాలేనని రైతులు అంటున్నారు.
మొదటి గండిని మధ్యాహ్నానికి అధికారులు పూడ్చివేయించారు. మిగిలిన రెండు గండ్ల పూడ్చివేత పనులు కూడా ఒకేసారి చేపట్టాలని మంత్రి లోకేష్ చెప్పారు. వేగవంతంగా చేపట్టేలా అధికారులతో మంత్రులు చర్చించారు. అవసరమైన యంత్రాలు, సామాగ్రిని యుద్ధప్రాతిపదికన తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను సమన్వయం చేయాల్సి ఉన్నందున, తాను గండ్ల పూడ్చివేత పనులను కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షిస్తానని చెప్పి లోకేష్ తిరిగి వచ్చారు. డ్రోన్ ద్వారా జరుగుతున్న పనులను గంట గంటకు తాను నేరుగా సమీక్ష చేస్తానని, ప్రతి గంటకి ఎంత పని జరిగిందో తనకు నివేదించాలని అధికారులను లోకేష్ కోరారు. గండ్లు పూడ్చి పెట్టే పనులు పూర్తి అయ్యే వరకూ క్షేత్ర స్థాయిలో ఉండి పనులు పర్వవేక్షించే బాధ్యతను మంత్రి నిమ్మల తీసుకున్నారు.
బుడమేరు గండి పూడ్చే పనులను డ్రోన్ లైవ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి నారా లోకేష్ పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. గండ్ల పూడ్చివేత పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పర్యవేక్షించారు. చంద్రబాబుకు డ్రోన్ లైవ్ వీడియో చూపిస్తూ పనులు జరుగుతున్న తీరు, వేగవంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించిన వివరించారు. ప్రధానంగా 2,3 వంతెనల వద్ద పడిన గండ్లపై దృష్టి పెట్టామని లోకేష్ తెలిపారు. ఈ రెండుచోట్ల నుంచే వరద నీరు అజిత్‌సింగ్ నగర్‌లోకి ప్రవేశిస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం బుడమేరులో 5వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని వెల్లడి. ఇది రాత్రికి 8వేల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా గండ్లను పూడ్చడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు. రాత్రివేళలో ఫ్లడ్ లైట్ల వెలుగులోనైనా గండ్ల పూడ్చివేత పనులు కొనసాగించి పూర్తి చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.
ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు
ఇలాఉంటే విజయవాడ నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి లోకేష్ పర్యవేక్షణలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండే మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు సహాయ చర్యలను పర్యవేక్షిస్తుంచారు. 1800 మంది టీడీపీ కార్యకర్తలు బుధవారం ఉదయమే వరద బాధితులకు ఇళ్లకు వెళ్లి టిఫిన్, పాలు అందజేశారు. వరద ప్రభావానికి గురైన 36 వార్డుల్లో మంత్రులు, ఎంఎల్‌ఏ ల ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు కొనసాగాయి. వరద తగ్గుముఖం పట్టడంతో మంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.
కాగా ప్రకాశం బ్యారేజి వద్ద వరద బాగా తగ్గింది. బుధవారం రాత్రి 8 గంటల సమయానికి వరద ప్రవాహం 3,23,552 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో దెబ్బతిన్న గేట్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు గోదావరిలో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద ప్రవాహం 6,74,935 క్యూసెక్కులుగా ఉంది. భద్రాచలం నుంచి గోదావరిలోకి 9,71,134 క్యూసెక్కుల వరద వస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.