- పాఠశాలల నిర్వహణకు రూ.100 కోట్లు విడుదల
- కోవిడ్ తర్వాత పాఠశాలల్లో సుద్దముక్కలకు కూడా రూపాయి విదల్చని వైసీపీ సర్కారు
- కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ రాకతో స్కూళ్లకు మహర్దశ
- వివిధ రకాల గ్రాంట్లు, నిధులు కింద మొత్తం వందకోట్లకు పైగా విడుదల
- పాఠశాలల నిర్వహణ భారంతో ఇబ్బందిపడుతున్న ఉపాధ్యాయులకు ఉపశమనం
అమరావతి (చైతన్యరథం): విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో పాఠశాలల నిర్వహణకు వంద కోట్ల రూపాయలకు పైగా విడుదలయ్యాయి. దీంతో పాఠశాలల నిర్వహణ నిధుల కోసం వ్యయప్రయాసలు భరించే ప్రధానోపాధ్యాయులకు ఉపశమనం లభించనుంది. పాఠశాలల్లో సుద్దముక్కలకు కూడా రూపాయి నిధులివ్వని వైసీపీ ప్రభుత్వ తీరుతో పాఠశాలల నిర్వహణ ఖర్చుల భారం ప్రధానోపాధ్యాయులపై పడేది. కోవిడ్ తర్వాత పాఠశాలలకు సంబంధించిన కాంపోజిట్ గ్రాంట్లను, మండల రిసోర్సు కేంద్రాల నిర్వహణ నిధులను సైతం వైసీపీ ప్రభుత్వం విడుదల చేయలేదు. నిధుల లేమితో పాఠశాలలు సమస్యల వలయాలుగా మారిన దుస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉందని గుర్తించిన విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ నిధుల విడుదలకు మార్గం సుగమం చేశారు.
విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ చొరవతో 2024-25 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 855 పీఎంశ్రీ పాఠశాలలకు వార్షిక గ్రాంట్ల వినియోగం కింద మొత్తం రూ. 8.63 కోట్లు, కేజీబీవీల్లో డైట్-మెయింటెనెన్స్ ఖర్చులకు రూ. 35.16 కోట్లు, మండల రిసోర్సు కేంద్రాలకు రూ. 8.82 కోట్లు విడుదల చేశారు. రాష్ట్రంలో మిగిలిన 40,728 ప్రాథమిక, మాధ్యమిక, సీనియర్ సెకండరీ పాఠశాలలకు కూడా రూ.51.90 కోట్లు స్కూల్ కాంపోజిట్ నిధులు ఇచ్చారు. ప్రతి పాఠశాలకు 50 శాతం చొప్పున కాంపోజిట్ గ్రాంట్లు రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ నిధులు ఆయా పాఠశాలల నిర్వహణకు, నిరంతర అభివృద్ధికి, పాఠశాల పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలకు, విద్యుత్ చార్జీల చెల్లింపులు, సుద్దముక్కలు, డస్టర్లు, చార్టులు, పాఠశాల విద్యా సామగ్రి, రిజిస్టర్లు, రికార్డులు తదితర స్టేషనరీ కొనుగోలు చేయడానికి వెచ్చించేందుకు కేటాయించారు. పాడైపోయిన పాఠశాల సామగ్రి, వినియోగపడని క్రీడా సామగ్రి మరమ్మతులకు నిధులు అందుబాటులోకి తెచ్చారు. పాఠశాలల్లో ప్రయోగశాలలు, ఇంటర్నెట్, నీరు, ఉపకరణాలు కోసం ఈ నిధులు ఖర్చు చేయొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు సమస్యలు గుర్తించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, అధికారులతో చర్చించిన తరువాత అత్యవసరంగా నిధులివ్వాల్సిన అవసరం ఉందని గుర్తించి భారీగా నిధులు విడుదల చేశారు.