కుటుంబ బాధ్యత తీసుకుని ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చిన లోకేష్
ఏడాది తిరగకముందే హామీని నెరవేర్చిన మంత్రి
అమరావతి (చైతన్య రథం): గతేడాది పవిత్ర రంజాన్ సందర్భంగా పేద ముస్లిం మైనార్టీ సోదరుడికి ఇచ్చిన హామీని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. రంజాన్‌వేళ మంగళగిరి బస్టాండ్ సమీపంలో ఉండే షేక్ షహెన్షా ఇంటిని మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. అతడి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి లోకేష్ ఇఫ్తార్ విందు స్వీకరించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు సందర్భంగా షహెన్షా నివసిస్తున్న ఇంటిని మంత్రి పరిశీలించి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమ పూర్వీకులు నిర్మించిన రేకుల ఇంటిస్థానంలో నూతన ఇల్లు నిర్మించి తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు మంత్రి లోకేష్‌ను కోరారు. షహెన్షా కుటుంబ బాధ్యత తాను తీసుకుంటానని, నూతన గృహం నిర్మించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో ఏడాది తిరగకముందే నూతన ఇంటిని నిర్మించి పవిత్ర రంజాన్ మాసంలో ఇచ్చిన హామీని మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారు.

















