- కన్నుపోగొడితే ఎమోషనల్ జరిగిందని మాట్లాడతారా?
- ఎంతమందిని కొడతారు.. ఎన్నికళ్లు పొడుస్తారు?
- పట్టాభి ఇంటిపై దాడిరోజే చర్యలు తీసుకుంటే ఇలా జరిగేదా?
- రౌడీయిజంతో ఎంతోకాలం రాజకీయం చేయలేరు
- గాంధీ కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు భరోసా
- గాంధీని పరామర్శించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు
హైదరాబాద్ : ‘‘మిస్టర్ డీజీపీ ఏమిటీ బాధ్యతారాహిత్యమైన మాటలు.. విజయవాడలో నిన్న మీ పోలీసు కమిషనర్ క్షణికావేశంలో ఎవరోకొట్టడంతో కన్నుపోయిందని సింపుల్ గా చెబుతున్నారు.. మీ కళ్లు పీకేసినా ఇలాగే మాట్లాడతారా? మీ కుటుంబ సభ్యులకు జరిగితే ఇలాగే ఉదాసీనంగా ఉంటారా..? వైసిపి మూకలు మారణాయుధాలతో మూకుమ్మడిగా దాడిచేస్తే ఒకపక్క హెవీ బ్లీడింగ్‌తో రెటీనా దెబ్బతిని గాంధీ కన్నుపోతే ఏదో ఎమోషనల్‌గా జరిగిందంటూ రౌడీలకు కొమ్ముకాస్తారా? ఇదే నా మీ పోలీసింగ్ ? ఇంతటి తీవ్రమైన చర్యకు పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసుపెట్టి లోపల వేయాల్సింది పోయి నిందితులకు కొమ్ముకాస్తారా?’’ అంటూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైకాపా నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన విజయవాడ టిడిపినేత చెన్నుపాటి గాంధీని మెరు గైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
గాంధీపై వైసిపి మూకలు దాడిచేసిన విధానం, ఆయన కన్నుపోయిన విషయం తెలుసుకున్న చంద్ర బాబునాయుడు తీవ్ర ఆగ్రహోద్రుడయ్యారు. మరోమారు ఇలా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ డీజీపీని, రాష్ట్ర పోలీసులను హెచ్చరిం చారు. గాంధీపై దాడిచేసిన నిందితులకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అండదండలు ఉన్నాయని ఆరో పించారు. హత్యా రాజకీయాలను టిడిపి సహించబోదని హెచ్చరించారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి సిఎం అయ్యాక ఎక్కడ చూసినా హత్యా రాజకీయాలు, బెదిరింపులు, వేధింపులు, దౌర్జన్యాలే. బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టడం, జైలుకు పంపడం దానికి పరాకాష్ట. ఇలాంటిది మరొకటి జరిగితే సహించేది లేదు..ఖబడ్దార్ అంటూ నిప్పులు చెరిగారు.