- ప్రాజెక్ట్ దుస్థితి బాధ, ఆవేదన, కోపాన్ని కల్గిస్తోంది.
- జగన్ క్షమించరాని నేరం చేశారు
- మూర్ఖుడి పరిపానలకు పోలవరం ఓ కేస్ స్టడీ
- రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్ట్ కుదేలైంది
- 2020కి పూర్తవాల్సిన ప్రాజెక్ట్‌ను అస్తవ్యస్తం చేశారు
- పోలవరం వద్ద విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు
- పోలవరానికి 31వ సారి పర్యటన
పోలవరం,చైతన్యరథం: రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా మార్చాలని ఐదేళ్ల పాటు కష్ట పడ్డ చంద్రబాబు… ఐదేళ్ల తర్వాత పోలవరం ప్రాజెక్ట్ దుస్తితి చూసి ఖిన్నుడయ్యారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి క్షేత్రస్థాయి పర్యటనగా సోమవారం పోలవరం సందర్శనకు వెళ్లారు. ఆయన పర్యటన ఆసాంతం ఆవేదనతో సాగింది. ‘‘ పోలవరం ప్రాజెక్ట్ దుస్థితి చూస్తుంటే అందరికంటే ఎక్కువ బాధ నాకే వేస్తోంది. నా మనసంతా పోలవరమే. అందరికన్నా ఎక్కువ సార్లు నేను పోలవరాన్ని సందర్శించాను. ఇక్కడి రావడం నాకు ఇది 31వ సారి. వందకు పైగా సమీక్షలు చేశాను. 2014`19 మధ్య కాలంలో 72 శాతం ప్రాజెక్ట్ పూర్తయింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్ట్‌ను అస్తవ్యస్తం చేశారు. నేను పడ్డ కష్టాన్నంతా బూడిదలో పోసిన పన్నీరు చేశారు’’ అని బాధ, ఆవేదన నిండిన స్వరంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. 2020 నాటికి పూర్తవ్వాల్సిన ప్రాజెక్ట్‌ను జగన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేపట్టి ప్రాజెక్ట్ కుదేలయ్యేలా చేసిందని బాధపడ్డారు.
ప్రజా ధనమంతా వృధా అయిపోయిందని, విలువైన కాలం హరించుకుపోయిందని, ఓ మూర్ఖుడు, రాజకీయాలకు ఎందుకు పనికిరాని వాడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో పోలవరం ఓ కేసు స్టడీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి చేసిన నిర్వాకం కారణంగా ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి కనీసంగా మరో నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారంటూ చాలా ఆవేదనతో చెప్పారు. ప్రాజెక్ట్‌ను చూడడానికి కూడా జగన్‌రెడ్డి ప్రభుత్వం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఆంధ్ర ప్రజల జీవనాడి అయిన పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రంలో కరువు అన్నదే లేకుండా చేయాలన్న తన కలను కల్లలు చేసేలా జగన్‌రెడ్డి వ్యహరించిన తీరుపై చంద్రబాబులో బాధ, ఆవేదన, కోపం అన్నీ ఒక్కసారిగా కనిపించాయి. ‘‘పోలవరం పరిస్థితి చూస్తుంటే బాధ, ఆవేదన, కోపం పెల్లుబుకుతోంది. కానీ వీటన్నింటనీ నిగ్రహించుకొని ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది’’ అని ఆయన అన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు… అనంతరం అక్కడే విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జగన్‌రెడ్డిది క్షమించరాని నేరం
పోలవరం ప్రాజెక్ట్ ఆది నుండి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని చంద్రబాబు అన్నారు. తాను 2014లో ఎన్నికల్లో గెలిచిన వెంటనే తెలంగాణలో ఉన్న ముంపు మండలాలు ఏడిరటినీ ఏపీలో కలిపితేనే ప్రమాణస్వీకారం చేస్తానని పట్టుబట్టి సాధించామని, ఆనాడు అది జరగబట్టే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలుగుతున్నామని చెప్పారు. పోలవరం కోసం తాను పగలు, రేయి శ్రమించానని, పండుగ రోజు కూడా నాగపూర్ వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ప్రాజెక్ట్ పనులు వేగంగా జరిగేలా కృషి చేశానని గుర్తు చేశారు. ప్రాజెక్ట్‌కు అవసరమైన భూసేకరణకు కూడా కొంతమంది సమస్యలు సృష్టిస్తే, వారితో ప్రత్యేకంగా మాట్లాడి నచ్చచెప్పి, వారికి మంచి పునరావాస ప్యాకేజీ ఇచ్చి ప్రాజెక్ట్ పనులు ఆగకుండా చర్యలు తీసుకున్నానని చెప్పారు.
కానీ ప్రభుత్వం మారగానే అధికారం చేపట్టిన రోజునే రివర్స్ టెండరింగ్‌కు వెళ్తామని, కాంట్రాక్టర్‌ను మారుస్తామని ప్రకటించారని, నాలుగు రోజులకే కాంట్రాక్టర్‌ను పంపించి వేశారని చెప్పారు. అంతేకాకుండా అక్కడ పని చేస్తున్న అధికారులందర్నీ కూడా బదిలీ చేశారని, ఏమీ తెలియని అధికారులను అక్కడ నియమించారని చెప్పారు. కీలకమైన పనులు చేపట్టాల్సి ఉన్నందున కాంట్రాక్టర్‌ను మార్చవద్దని, కొత్త కాంట్రాక్టర్ వస్తే ఎవర్నీ బాధ్యుల్నీ చేయాలో అర్ధంకాని పరిస్థితి అని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ వినకుండా మూర్ఖంగా ప్రవర్తించారని చెప్పారు. దాని ఫలితంగానే 2019`20 ఏడాదిలో గోదావరికి వచ్చిన రెండు వరదల్లో ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని చెప్పారు. కానీ దాని వల్ల జరిగిన నష్టాన్ని కనుక్కోవడానికి కూడా సంవత్సరం సమయం పట్టిందని చెప్పారు.
2019 సీజన్ పూర్తయ్యేలోపు కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేయడానికి మిగిలి పోయిన పనులు చేయాల్సి ఉందని, కానీ కాంట్రాక్టర్‌ను, అధికారులను మార్చడంతో ఆ పనులు పూర్తి చేయలేకపోవడంతో ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని చెప్పారు. కాంట్రాక్టర్‌ను మార్చకుండా ఉండిఉంటే 2020 చివరి నాటికి ప్రాజెక్ట్ పూర్తయ్యేదని, కానీ జగన్ రెడ్డి తన మూర్ఖపు చర్యలతో రాష్ట్ర ప్రజలకు, పోలవరానికి శాపంలా మారాడని అన్నారు. పోలవరం విషయంలో జగన్‌రెడ్డి క్షమించరాని నేరం చేశారని అన్నారు. సాగునీటి రంగం ప్రాధాన్యతను గుర్తించి తాము ఏడాదికి సగటున 13,683 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. జగన్‌రెడ్డి ప్రభుత్వానికి నిధులు అధికంగా ఉన్నప్పటికీ ఏడాదికి సగటున 7,100 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని, అవీ కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌లు ఇవ్వడానికే ఉపయోగించారు కానీ పనులు చేయడానికి కాదని చంద్రబాబు తెలిపారు.
ప్రజా ధనం వృధా
జగన్‌రెడ్డి చేసిన నిర్వాకం కారణంగా డయాఫ్రమ్ వాల్ నాలుగు చోట్ల తెగిపోయిందని, 35 శాతం డ్యామేజ్ అయిందని చంద్రబాబు చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో యుద్ద ప్రాతిపదికన రెండు సీజన్లలో 446 కోట్ల రూపాయల ఖర్చుతో డయాఫ్రమ్ వాల్ నిర్మించినట్లు చెప్పారు. ఇప్పుడు మరమ్మత్తుల కోసం తెగిన ప్రాంతం వరకు సమాంతర గోడ కట్టడానికే 447 కోట్ల రూపాయలు అవుతుందని, అయినప్పటికీ డయాఫ్రమ్ వాల్ భద్రంగా ఉంటుందన్న గ్యారంటీ లేదంటున్నారని చెప్పారు. అలా కాకుండా మొత్తం గోడ కట్టడానికి 990 కోట్ల రూపాయలు అవుతుందని అధికారులు తనకు చెప్పినట్లు తెలిపారు. అదే విధంగా ఎగువున, దిగువున ఉన్న కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతిందని, తమ ప్రభుత్వ హయంలో ఈ రెండిరటినీ 550 కోట్ల రూపాయలతో నిర్మించామని, అయితే వీటి మరమ్మత్తులకు రెండు వేల కోట్ల రూపాయలు అవుతుందో, ఇంకా ఎంత అవుతుందో చెప్పలేని పరిస్థితి అని అన్నారు. ఇవి పూర్తవ్వడానికి మరో నాలుగు సీజన్లు పడుతుందని, అంటే మరో నాలుగేళ్ల సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారని తెలిపారు. జగన్‌రెడ్డి మూర్ఖపు చర్యలు వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందని, విలువైన సమయం హరించుకుపోయిందని చెప్పారు. 2020 చివరి నాటికి పూర్తవ్వాల్సిన ప్రాజెక్ట్ భవిష్యుత్తుతో జగన్‌రెడ్డి ఆడుకున్నాడని, ఇప్పుడు పదేళ్ల సమయం అదనంగా తీసుకుంటుందని, ప్రాజెక్ట్ ఖర్చు కూడా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
జగన్ రెడ్డి మూర్ఖత్వంపై ప్రజల్లో చర్చ జరగాలి
పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఈ దుస్థితి కల్పించిన వారిని చట్ట ప్రకారం శిక్షించాల్సిందే అన్నారు. ప్రజలు వేసిన శిక్ష వారికి సరిపోదన్నారు. జగన్‌రెడ్డి అనుభవం లేకనే ఈ విధంగా ప్రాజెక్ట్‌ను నాశనం చేశారా అని ఒక విలేకరి ప్రశ్నించగా అనుభవం లేకపోవడం కాదు మూర్ఖత్వం అని చంద్రబాబు చెప్పారు. తనకు ఏమీ తెలియకున్నా ఇష్టానుసారంగా వ్యవహరించినా సరిపోతుందనే ప్రవర్తన కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి జగన్ కాదని, అటువంటి వ్యక్తికి అధికారం ఇస్తే ఏమౌతుందో అనే దానికి పోలవరం ఒక కేస్ స్టడీ అని అన్నారు. జగన్‌రెడ్డి మూర్ఖపు చర్యలు రాష్ట్రానికి శాపంగా మారాయని, అందులో పోలవరం ఒకటని, వీటన్నింటిపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు అధికారుల నుండి తాను ప్రాధమికంగా సమాచారం తీసుకున్నానని, తాను ఇంకా పూర్తిగా అధ్యయం చేసి మరలా వివరణాత్మకంగా మాట్లాడతానని చెప్పారు. కేంద్రంలోనూ జనవనరుల శాఖకు కొత్త మంత్రి వచ్చారని, ప్రస్తుత పోలవరం పరిస్థితిపై కేంద్ర పెద్దలు, అధికారులతో చర్చించాల్సి ఉందని అన్నారు. చంద్రబాబుతోపాటు విలేకరుల సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామనాయుడు, రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖా మంత్రి కె.పార్దసారధి పాల్గొన్నారు.