అమరావతి(చైతన్యరథం): జనహితమే అభిమతంగా, సమాజ శ్రేయస్సు కోసం ఈనాడు ప్రారంభించిన అక్షర ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్షర సైన్యానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. నాడు, నేడు, ఏనాడూ ఈనాడుది ప్రజామార్గం అని ఒక ప్రకటనలో లోకేష్ పేర్కొన్నారు. ప్రజాపక్షమై ప్రభుత్వాలతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఈనాడు నిత్యం అక్షర యుద్ధం చేస్తూనే ఉంది. పాలకులు కక్ష కట్టి ఆస్తులు ధ్వంసం చేసినా, తప్పుడు కేసులతో వేధించినా జనానికి రక్షగా నిలుస్తూనే ఉంది. పత్రిక ద్వారా సమాజానికి దిక్సూచిగా నిలవడం ఈనాడుకే చెల్లింది. విద్య, విజ్ఞానం, వినోదం, ఉద్యోగం, వ్యవసాయం, క్రీడలు, వ్యాపారం, టెక్నాలజీ, స్వయం ఉపాధి, స్ఫూర్తివంతమైన కథనాలు.. సమస్త సమాచారం పాఠకులకు అందించి తెలుగు లోగిళ్లలో చైతన్య క్రాంతిగా నిలిచింది ఈనాడు.
గుడ్ మార్నింగ్ అంటూ తెలుగువారిని మేల్కొలిపే ఈనాడు వెయ్యేళ్లు వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. ఈనాడు 50 ఏళ్ల సంబరం సమయంలో వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు లేకపోవడం బాధాకరం. కానీ ఈనాడు రూపంలో ఆయన మన మధ్యే జీవించి ఉంటారు. అర్ధ శతాబ్దం పాటు విలువలు, నిబద్ధత, విశ్వసనీయతతో సమాజ హితం లక్ష్యంగా దిగ్విజయంగా ఈనాడుని నడిపిస్తున్న యాజమాన్యం, ఉద్యోగులు, జర్నలిస్టులకు హృదయపూర్వక శుభాభినందనలు. ఈనాడు ఎడిటర్ నుంచి ఇంటికి ఈనాడు పేపర్ వేసే బాయ్ వరకు దశాబ్దాలుగా చూపిస్తున్న అంకితభావం ప్రశంసనీయమని లోకేష్ పేర్కొన్నారు.