టిడిపి అధికారంలో వున్నప్పుడు తెలంగాణ లో చదివే విద్యార్థులకు ఫీజు రీ ఇంబరమెంట్ ఇచ్చాం. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు లలో చదివే విద్యార్థులకు సైతం ఫీజు రీ ఇంబర్స్మెంట్ ఇచ్చే విషయం పై అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం పెనుకొండ నియోజకవర్గం గట్టూరు హై వే వద్ద కుంచిటిగవక్కలిగ సామాజిక వర్గీయులు లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. టిడిపి అధికారం లోకి రాగానే వక్కలిగలకు దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని తెలిపారు.
వక్కలిగలను టిడిపి రాజకీయంగా ప్రోత్సహిస్తుందన్నారు. ఎన్టీఆర్ హయాంలో హెచ్ బీ నరసయ్య కు న్యాయశాఖ మంత్రిగా అవకాశం కల్పించినట్లు చెప్పారు. అధికారంలోకి రాగానే మడకశిర లో వక్క మార్కెట్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమకు తెచ్చిన నీరు వృధా కాకుండా డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహించేందుకు టిడిపి హయాంలో 90 శాతం సబ్సిడీ తో పరికరాలు అందజేస్తే, జగన్ ఆ పథకం రద్దు చేసాడని విమర్శించారు. హంద్రీ నీవా పనులు టిడిపి హయాంలో 90 శాతం పూర్తి చేస్తే, మిగిలిన పదిశాతం కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు.
వక్కలిగలను ఓబీసీ లో చేర్చటం పై బిసి కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి వున్నదని, ఆ విషయం పై అధినాయకత్వం తో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు.బిసిలపై అడ్డగోలుగా అక్రమ కేసులు పెడుతున్నారని, వారి రక్షణ కోసం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ప్రత్యేక చట్టం తీసుకు వస్తామన్నారు. దాని అమలు పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కమిటీలు వేస్తామని చెప్పారు. స్థానిక సంస్థలలో బిసిల రిజర్వేషన్ లను వైసీపీ ప్రభుత్వం 10 శాతం తగ్గించటం తో దాదాపు 16 వేలమంది పదవులు అవకాశం కోల్పోయారని చెప్పారు. ప్రస్తుతం అప్పులు, నిత్యావసరాల ధరలు, గంజాయి లలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో వున్నదని లోకేష్ వెల్లడించారు.