టిడిపి అధికారంలోకి రాగానే ఉన్నత విద్యకు ఫీజు రీ యింబర్స్మెంట్, విదేశీ విద్య పధకాలను పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా రాఫ్తాడు నియోజకవర్గంలో శుక్రవారం బీసీ సామాజికవర్గ ప్రతినిధులు లోకేష్ ను కలిసి సమస్యలపై విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్ర జనాభాలో సగానికిపైగా వున్న బీసీల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు.
పధకాల పేరుతో బీసీలకు చెందాల్సిన వేలకోట్ల నిధులను దారిమళ్లించి జగన్ బీసీలకు ద్రోహం చేశారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 26 వేలమందికి పైగా బీసీలపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి రాగానే బీసీ కార్పొరేషన్ లను బలోపేతం చేసి విరివిగా సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ను సిఎంను చేసేందుకు బీసీలందరూ సహకరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.