టిడిపి అధికారంలోకి రాగానే చెరకు రైతుల సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం మాధవరం గ్రామస్తులు యువనేత నారా లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామంలో చెరకు అధికంగా పండిస్తున్నాం. చెరకు అమ్ముకోవడానికి కర్నూలులో ఎక్కడా సుగర్ ఫ్యాక్టరీలు లేవు. ఫలితంగా రోడ్లపైనే చెరకు అమ్ముకోవాల్సి వస్తోంది. నకిలీ విత్తనాల సమస్య అధికంగా ఉంది.
టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతంలో సుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు నియంత్రించాలి. రైతులు పండించిన ప్రతిపంటకు మద్దతు ధర నిర్ణయించాలి. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యల పై లోకేష్ సానుకూలంగా స్పందించారు. పాదయాత్ర సమయంలో రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాల విక్రేతల పై కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందేలా చర్యలు చేపడతామని లోకేష్ హామీ ఇచ్చారు.