టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలకు స్వర్ణయుగం తెస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం మంత్రాలయం లో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రాలయం బీసీ ప్రతినిధులు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. బీసీ ల భద్రత కోసం టిడిపి అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత బీసీ కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం.
ఫోన్లో ఒక్క బటన్ నొక్కగానే ప్రభుత్వమే మీ ఇంటికి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేసే విధానం తీసుకొస్తాం.దామాషా ప్రకారం బీసీ ఉప కులాలకు నిధులు కేటాయిస్తాం. సబ్సిడీ రుణాలు అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం తిరిగి ప్రారంభిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ కాన్వాయ్ కి అడ్డం పడుకొని నిరసన తెలిపిన రైతుల్ని ఆదర్శంగా తీసుకొని అందరూ ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఉప కులాల వారీగా ముందు నియోజకవర్గం స్థాయిలో, ఆ తరువాత మండల స్థాయిలో కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.బోయ, వాల్మీకి లను జగన్ నమ్మించి మోసం చేశారు.
ఎన్నో సార్లు జగన్ ప్రధానిని కలిశారు. ఒక్క సారి అయినా బోయ, వాల్మీకి లను ఎస్టీల్లో చేర్చాలని అడిగారా? అంత మంది ఎంపిలు ఉన్నారు ఒక్క రోజైనా పార్లమెంట్ లో ఈ అంశం గురించి మాట్లాడారా?టిడిపి హయాంలో సత్యపాల్ కమిటీ వేసి అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. జగన్ నాలుగేళ్లుగా డ్రామాలు ఆడి ఇప్పుడు కేవలం 4 జిల్లాలో ఉన్న బోయ, వాల్మీకి లను ఎస్టీల్లో చేర్చాలని కొత్త తీర్మానం చేసి మీకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుగీత కార్మికుల పొట్ట కొట్టాడు జగన్. చెట్లను కొట్టేయడం తో పాటు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
జగన్ సొంత మద్యం అమ్ముకోవడానికి కల్లు గీత కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తాం. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం. చెట్ల పెంపకం కోసం సహాయం అందిస్తాం.టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రజకులకు వాషింగ్ మెషీన్, ఐరెన్ బాక్సులు అందజేసాం. దోబి ఘాట్స్ ఏర్పాటు చేశాం. ఉచిత విద్యుత్ అందజేసాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాషింగ్ మెషీన్ తో పాటు రజకులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని హామీ ఇచ్చారు. రజకులకి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ మోసం చేశాడని లోకేష్ ఆరోపించారు. మంత్రాలయంలో ఎమ్మెల్యే విషనాగు మత్స్యకారులను వేధిస్తున్నాడన్నారు. వైసిపి పెత్తందారుల చేతిలోకి వెళ్లిపోయిన మత్స్యకారులకు చేసిన చెరువులు అన్ని తిరిగి మత్స్యకారులకు కేటాయిస్తాం.మత్స్యకారుల పొట్ట కొట్టేలా జగన్ తెచ్చిన జీఓ లు అన్ని రద్దు చేస్తామని లోకేష్ వెల్లడించారు.
బీసీలకు నిజమైన రాజకీయ, ఆర్ధిక స్వతంత్ర వచ్చింది టిడిపి వలనే.
బిసిలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించింది టిడిపియేనని చెప్పారు. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించాం. ఆదరణ 2 లో కొన్న పనిముట్లు బిసిలకు ఇవ్వకుండా వాటిని తుప్పు పట్టేలా చేసింది జగన్ ప్రభుత్వం.జగన్ స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి 16,500 మంది బీసీలను పదవులకి దూరం చేశారు.
వైసిపి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మంది బీసిలపై కేసులు పెట్టి వేధించారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో బీసీలకు కుల ధృవీకరణ పత్రం తీసుకునే హక్కు కూడా లేకుండా పోయింది.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గొర్రెల కాపరులను ఆదుకుంటాం. గొర్రెలు కొనడానికి సబ్సిడీ రుణాలు అందిస్తాం. మందులు, దాణా, మేత సబ్సిడీ లో అందిస్తాం. ఇన్స్యూరెన్స్ పథకం అమలు చేస్తామని వివరించారు. కనకదాస జయంతిని రాష్ట్ర పండుగ గా జరపాలని నిర్ణయం తీసుకున్నాం.
బీరప్ప దేవాలయాలు నిర్మాణం కోసం సహాయం చేస్తాం. అర్చకులకు గౌరవ వేతనం కూడా అందిస్తామని లోకేష్ చెప్పారు. వడ్డెర కులస్తులను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది.టిడిపి హయాంలో వడ్డెర కులస్తులకు కేటాయించిన మైన్లను జగన్ ప్రభుత్వం లాక్కుంది. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ మైన్ల ను మీకు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. పాలిచ్చే ఆవుని వద్దనుకొని, తన్నే దున్నపోతు తెచ్చుకున్నారు. జగన్ ని నమ్మి మోసపోయారని విమర్శించారు.
అంతకుముందు పలువురు బీసీ సామాజిక వర్గ ప్రతినిధులు మాట్లాడుతూ పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. బోయ, వాల్మీకి లను ఎస్టీల్లో చేరుస్తామని జగన్ మోసం చేశారు.బోయ, వాల్మీకిలకి ఎటువంటి కుల వృత్తి లేదు. బిసిలకు అమలు అయ్యే ఏ సంక్షేమ కార్యక్రమం మాకు అందడం లేదు.మాదాసి కురువ లకు జగన్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. టిడిపి హయాంలో గొర్రెల పెంపకం కోసం సహాయం అందించేవారు. ఇప్పుడు ఆ సంక్షేమ కార్యక్రమాలు జగన్ ప్రభుత్వం ఆపేసింది.
వడ్డెర కులస్తులను జగన్ ప్రభుత్వం మోసం చేసింది. మాకు కార్పొరేషన్ ద్వారా ఎటువంటి రుణాలు అందడం లేదు.కల్లు గీత కార్మికులను వైసిపి ప్రభుత్వం కోలుకోలేని దెబ్బకొట్టింది.రజకులను జగన్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. ఎటువంటి సహాయం అందడం లేదు. మత్స్యకారులను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది అని వారంతా లోకేష్ కు విన్నవించారు.