టిడిపి అధికారంలోకి రాగానే రంజాన్ తోఫా, దుల్హన్ పధకాలకు ఏవిధమైన కొర్రీలు లేకుండా అమలుచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం అనంతపురం పవర్ హౌస్ సర్కిల్ లో ముస్లిం మైనారిటీలు లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ మైనారిటీల స్వావలంబనకు ఇస్లామిక్ బ్యాంక్ ను ఏర్పాటు చేసి ఆర్ధికంగా చేయూతనిస్తామని చెప్పారు.
టిడిపి అధికారంలోకి రాగానే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డుకు జుడీషియల్ అధికారాలు కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇదివరకేన్నడూ లేనివిధంగా గత నాలుగేళ్లుగా ముస్లిం మైనారిటీలపై వేధింపులు, దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలకు చెందాల్సిన రూ. 5,500 కోట్ల సబ్ ప్లాన్ నిధులు జగన్ ప్రభుత్వం దారిమళ్ళించిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10మండి మైనారిటీలు హత్యకు గురికాగా, 40మందిపై దాడులు జరిగాయని చెప్పారు.