ఒక్కో కుటుంబానికీ ఎంత కష్టం వచ్చిందో చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. కుటుంబాలన్నీ వలసలు పోతుంటే పల్లె కన్నీరు పెడుతోంది. ఇంటిల్లిపాదీ మండుటెండల్లో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లి తిరిగి వస్తున్న దృశ్యాలు ఆందోళనకి గురిచేస్తున్నాయి. బడిలో చక్కటి రాతలు నేర్చాల్సిన చిట్టిచేతులు మట్టి పనులకి తల్లిదండ్రులతో తరలిపోతున్నారు. మెతుకు కోసం, బతుకు కోసం వందల కిలోమీటర్లు ప్రమాదకర ప్రయాణం చేస్తున్న వలస జీవులు మన పరదాల హెలికాప్టర్ సీఎం గారికి కనిపించే అవకాశమే లేదు. గురువారం మంత్రాలయం నియోజకవర్గం మాధవరం మీదుగా పాదయాత్ర చేస్తున్నాను.
డిసిఎం వ్యానులో పిల్లలతో కలిసి వలస వెళ్లి వస్తున్న కుటుంబాలు ఎదురయ్యాయి. వారితో మాట్లాడేందుకు వ్యాన్ ఎక్కాను. వ్యవసాయానికి నీటివసతి లేక, చేసేందుకు పనిలేక, ధరలు భారమై తెలంగాణ ప్రాంతానికి, గుంటూరుకి వెళ్లి పనులు చేసుకొని తిరిగి వస్తున్నాం అని చెప్పారు. ఏడాదిలో ఆరు నెలలు పనులు కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన దుస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వలసలు జగన్ రెడ్డి విధ్వంస పాలన విషఫలితం. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయానికి నీరందిస్తాం. స్థానికంగానే ఉపాధి దొరికే మార్గాలు చూపుతాం. వలస కష్టాలు లేకుండా చేస్తాం. పల్లె కన్నీరు తుడుస్తాం.