టిడిపి అధికారంలోకి వచ్చాక పన్నుల విధానాన్ని సమీక్షిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం నందికొట్కూరు
సుంకాలమ్మ దేవాలయం వద్ద డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
పొరుగు రాష్ట్రానికి, మనకు డీజిల్ రేటు దాదాపు 12రూపాయలు తేడా ఉంది.
ఈ కారణంగా కిరాయి పెంచితే బాడిగలు తగ్గిపోతున్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను పరిష్కరించండి.
2014-19 మధ్యలో తుఫాన్ వెహికల్, ఫోర్ వీలర్, ట్రాన్స్ పోర్టు వెహికల్స్ కు గ్రీన్ ట్యాక్స్ రూ.200 ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చాక దానిని రూ.5వేలకు పెంచింది. టిడిపి వచ్చాక గ్రీన్ ట్యాక్స్ తగ్గించండి.
చీటికిమాటికీ మాపై చలాన్ల వేసి, మాకు వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని లాగేస్తున్నారు.
చలాన్ల బెడద తగ్గించండి.
టిడిపి అధికారంలోకి వచ్చాక రోడ్డు ట్యాక్స్ తగ్గించి ఆదుకోండి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
కుడిచేత్తో రూ.10 ఇచ్చి ఎడమచేత్తో వంద లాగేయడంలో జగన్ సిద్దహస్తుడు.
వాహనమిత్ర పేరుతో డ్రైవర్లకు రూ.10వేలు ఇచ్చి, చలాన్ల పేరుతో పదిరెట్లు లాగేస్తున్నాడు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి రవాణా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు.
జగన్ రెడ్డి అడ్డగోలు పన్నుల కారణంగా రవాణారంగం కుదేలైంది.
డ్రైవర్లకు సంక్షేమపథకాలు, చంద్రన్న బీమా వర్తింపజేసి ఆదుకుంటామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.