అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సందర్శించారు. ఆర్డిటి వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్ చిత్రపటానికి పూలమాల వేసి లోకేష్ నివాళులర్పించారు. విన్సెంట్ ఫెర్రర్ సతీమణి అన్నే ఫెర్రర్ కి లోకేష్ నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఆర్డిటి కార్యాలయంలోకి విన్సెంట్ ఫెర్రర్ కుమారుడు మాంచు ఫెర్రర్, ఆయన సతీమణి విశాల ఫెర్రర్ లు లోకేష్ ను ఆహ్వానించారు.
ప్రభుత్వానికి సమాంతరంగా ఆర్డిటి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం అని లోకేష్ ప్రశంసించారు. 1969లో ఎన్నో అవమానాలు ఎదురైనా పేదలకు సేవలు అందించాలనే ధృడ సంకల్పంతో విన్సెంట్ ఫెర్రర్ గారు చేసిన కృషి చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోతుందని లోకేష్ పేర్కొన్నారు. ఆర్డిటి రాయలసీమ వ్యాప్తంగా 3 వేల గ్రామాల్లో సేవలు అందిస్తుందని చెప్పారు. ఆసుపత్రులు నిర్మాణం, ఆర్ధిక సహాయం, ఇళ్ల నిర్మాణం, విద్య, వైద్యం, చెక్ డ్యాం ల నిర్మాణం, గ్రామాల్లో త్రాగునీటి సదుపాయం ఇలా ఆర్డిటి అనేక సేవలు అందిస్తుందని అభినందించారు.
వేల కోట్లు ఖర్చు చేసి పేదలకు సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. అనంతపురం జిల్లాలో ఆర్డిటి సహాయం పొందని కుటుంబం అంటూ లేదని పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్డిటి సేవలు మరింత విస్తరించే విధంగా కలిసి పనిచేస్తామని వెల్లడించారు. గ్రామస్థులకు ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కల్పన కోసం ఆర్డిటి సేవలు వినియోగించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. యువత కు స్కిల్ డెవలప్మెంట్, ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పడం ద్వారా ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందడానికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు.
టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రణాళిక సిద్దం చేసుకొని ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని చెప్పారు. మహిళల పట్ల ఉన్న చులకన భావం పోగొట్టెలా మహిళలకు ఆర్ధిక స్వేచ్ఛ కల్పించడం కోసం ఆర్డిటి ఎంతో కృషి చేస్తుందన్నారు.. ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళల అభివృద్ది కోసం ఆర్డిటి తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నామని లోకేష్ తెలిపారు.